Friday 9 May 2014

మీ అరచేతిలో అల్లావుద్దీన్ దీపం - ఆ ఒక్క అలవాటు మీ జీవితాన్ని అద్భుతం చేస్తుంది

మీ అరచేతిలో అల్లావుద్దీన్ దీపం - ఆ ఒక్క అలవాటు మీ జీవితాన్ని అద్భుతం చేస్తుంది
చిన్నప్పుడు ఎండాకాలం వచ్చిందంటే చాలా సమయం ఖాళీగా ఉండేది. ఇల్లు, అమ్మ, నాన్న, పిన్ని , బాబాయ్, పెద్దమ్మ పెదనాన్న, అత్తమ్మ, మామయ్యా, తాతయ్య, అమ్మమ్మ,అక్కలు చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు,  ఫ్రెండ్స్, ఆటలు, ఐస్ క్రీం లు, కొబ్బరినీళ్ళు, మామిడి కాయలు, జ్యూస్ లు, పెళ్ళిళ్ళు, టూర్ లు, సమ్మర్ క్యాంపు లు, అబ్బా..భలే వుంటుంది కదూ! వీటితో పాటు మనం అనేక కథలు చదివే వాళ్ళం, పెద్దవాళ్ళు , స్నేహితులు కథలు చెబుతుంటే వినేవాళ్ళం, నేర్చుకునే వాళ్ళం. ప్రతి కథకి ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటారు. కథ అనేక మలుపులతో నడుస్తుంది. ఆ చందమామ కథల్లో అల్లాఉద్దీన్ అద్భుతదీపం ఉంటుంది. అందులోనుంచి ఒక పెద్ద శక్తి రూపం బయటికి వచ్చి ఏమి కోరుకుంటే ఆ వరాలు ఇస్తుంది. అటువంటి ఒక అద్భుతం మీ జీవితంలో జరిగితే మీరు ఆ కోరికలు తీర్చే అదృశ్య శక్తిని ఏమి కోరుకుంటారు?   
  • మంచి ర్యాంక్ రావాలి
  • పేరున్న కాలేజి లో సీటు రావాలి
  • ఎక్కువ డబ్బు సంపాదించాలి
  • బహుళజాతి సంస్థలో ఉద్యోగం సంపాదించాలి
  • పిల్లలమంచి సంబoధం ఇచ్చి పెళ్ళిళ్ళు చెయ్యాలి
  • వ్యాపారం లాభాల్లో నడవాలి,
  • బిజినెస్ ఇతర ప్రాంతాలకు , దేశాలకు విస్తరించాలి 
  • ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి
  • చక్కని కాలనీలో ఇల్లు కట్టుకోవాలి
  • పెద్ద కార్ కొనుక్కోవాలి
  • కుటుంబంతో ఆనందంగా ఉండాలి
.......ఇలా మీరు ఏదో  ఫలితాన్ని సృష్టించాలనుకుంటున్నారు? అవునా? మరి ఆ అదృశ్య శక్తి ఎప్పుడన్నా మీ ఎదుట పడిందా? మీరు ఏం కావాలో ఆ శక్తిని అడిగారా?
మీరు ఆశించింది సాధిస్తే మీరు ఎలా ఉంటారు?
మీ జీవిత కథలో మెయిన్ క్యారెక్టర్ మీరే. మీ సినిమాలో హీరో / హీరోయిన్ మీరే. మీ జీవితంలో జరిగే అనేక సంఘటనలు, మీరు ఇప్పుడున్న స్థితులు , మీ జీవితంలోని వ్యక్తులు, మీ ప్రపంచం .....ఈ సృష్టి అంతా కలిసి ఒక అల్లావుద్దీన్ దీపం లాంటి ప్రక్రియ. మీరు ఏమి కోరుకుంటారో జీవితం దానినే సృష్టిస్తుంది. ఒక్క సారి అలోచించండి ఈ క్షణంలో మీరు ఏమి కోరుకుంటున్నారు? ఏమి సృష్టించాలని ఆలోచిస్తున్నారు? మీ ప్రయత్నాలవలన ఆశించింది సాధిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? అప్పుడు ఎక్కడ ఉంటారు? మీతో ఎవరు ఉంటారు? మీరు ఎలా కనిపిస్తారు? మీతో మీరు ఏం మాట్లాడుకుంటారు? ఇతరులతో ఎలా మాట్లాడతారు? మీ ఫీలింగ్స్ ఏమిటి?....అబ్బc భలే ఉంది...జరిగితే బాగుండు అనిపిస్తుంది కదూ?
ఎక్సర్ సైజ్:  మీ అద్భుత జీవితం మీచేతులలో
                                 ఎడమచేయి                                    కుడి చేయి 
ఈ పై బొమ్మలో రెండు చేతులు ప్రతిమలు ఇవ్వబడ్డాయి. వీటితో ఈ క్రింది ఎక్సర్ సైజ్ ఈ క్షణమే చేయండి. మీ చేతి ప్రతిమలను మీ జర్నల్ లేదా పర్సనల్ డైరీ లో గీసుకుని కూడా ఈ ఎక్సర్ సైజ్ చేయవచ్చు.  
స్టెప్ 1: కుడి చేతి ప్రతిమలో, మీ సాధించాలనుకుంటున్న మీ లక్ష్యాలు, నేరవేర్చుకోవాలనుకుంటున్న మీ కలలు ఒక్కొక్క వేలిలో ఒక్కొక్కటి రాయండి. ఐదు కంటే ఎక్కువ అంశాలు రాయవలసి వస్తే అరిచేతి భాగంలో రాయండి.
స్టెప్ 2:  ఇప్పుడు ఎడమ చేతి ప్రతిమలో ప్రతిరోజూ మీ 24 గంటల సమయంలో మీ శక్తిని , సమయాన్ని  ఎక్కువగా ఉపయోగిస్తున్న అంశాలు ఒక్కొక్క వేలిలో ఒక్కొక్కటి రాయండి. ఇంకా ఎక్కువ అంశాలు రాయవలసి వస్తే అరిచేతి భాగంలో రాయండి.
స్టెప్ 3:  ఇప్పుడు ఎడమ చేతి ప్రతిమలోని ఏ అంశాల ద్వారా కుడి చేతి ప్రతిమలోని ఏ అంశాలు సాధిస్తారో గుర్తిస్తూ బాణం గీతల ద్వారా జతపరచండి.
స్టెప్ 4: పై మూడు స్టెప్ లు చేయడం ద్వారా మీరు గుర్తించిన అంశాలు, మీ ప్రయత్నాల విధానాలు, మీ నిబద్దత పై మీకు కలిగిన అంశాలు మీ డైరీ లో వ్రాసుకోండి. ఈ ఎక్సర్ సైజ్ ద్వారా నేర్చుకున్న అంశాలు దృష్టిలో ఉంచుకుని ఈ నెల నుంచే మీ శక్తిని, సమయాన్ని ఉన్నత ప్రాధాన్యాలపై ఫోకస్ చేయండి.       
జింక బ్రతకాలంటే పులికి  చిక్కకుండా పరిగెత్తాలి. పులికి  ఆహారం కావాలంటే జింక కంటే వేగంగా పరిగెత్తగలగాలి. అయితే పులి ఎంత వేగంగా పరిగెత్తినా జింక కి వ్యతిరేక దిశలో వెళితే ఏం ప్రయోజనం. మీరు ఆశించిన జీవితం సృష్టించాలంటే మీరు చేసే ఆలోచనలు, ఆచరణ, ప్రయత్నాలు అందుకు అనుసంధానంగా ఉండాలి. మీ లక్ష్యాలు ఒక మార్గంలో ఉన్నప్పుడు మీ ఫోకస్, మీ ఎనర్జీ ఆ లక్ష్యాల దిశలో ఉండాలి. లేకపోతే లక్ష్యాలు కేవలం  కోరికలగా ఉండిపోతాయి. ఒక సారి ఆలోచించండి. ఇప్పుడు మీరు ఆలోచిస్తున్న  ఆలోచనలు, మీరు ప్రయత్నం చేస్తున్న పద్దతులు, మీ నమ్మకాలు, మీ దృక్పథం  రాబోయే ఐదు సంవత్సరాలలో లేదా రెండు సంవత్సరాలలో మీకు ఎలాంటి ఫలితాలని ఇస్తాయి? ఆ ఐదు లేదా రెండుసంవత్సరాలలో మీరు ఏ స్థితిలో ఉంటారు? మీరు ఎలా ఫీల్ అవుతారు? మీరు ఆశించింది సృష్టించాలంటే మీ జీవన ప్రాధాన్యాలపై దృష్టి పెట్టి పనిచేస్తున్నారా ? గమనించండి.
మీ జీవిత ప్రాధాన్యాలే మీ  అలవాటుగా మార్చుకోండి:
  • మీరు ఎప్పుడు దేనిగురించి ఆలోచిస్తారో, దేనిగురించి కృతజ్ఞతగా ఉంటారో దానిని సృష్టిస్తారు. What you think about, what you feel thank about will be what you bring about in your life. మీ ఆలోచనలలో ఎక్కువగా మీరు ఆశించిన విషయాలు ఉండేలా చూసుకోండి. కొందరు అంటారు “ఈ ఉద్యోగం వద్దు ఇంకా మంచిది కావాలనుకుని ఎప్పుడూ అనుకుంటూ ఉన్నానండి కానీ నా ఖర్మ ఏంటో అసలు ఈ కంపెనీ నుంచి బయట పడదామంటే ఆఫర్స్ సరైనవి రావట్లేదండి”. మీరు ప్రస్తుతాన్ని అందులోని ఆనందాన్ని గుర్తించకుండా, ఉన్నదానిని ఆనందంగా స్వీకరించకుండా కొత్తదానిని సాధించినా ఆనందించలేరు. “ఈ కంపెనీ వద్దు”  అనే బదులు “నాకు ఫలానా కంపెనీలో, ఇంత సాలరీతో, ఈ పోసిషన్ లో ఉద్యోగం కావాలి” అని ఆశించిన దానిని పాజిటివ్ పదాలతో మాట్లాడడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే మీరు “వద్దు.. వద్దు..” అంటే , వద్దు అనే  స్థితినే సృష్టించుకుంటారు.  

  • ఒక నెల... ఒక సంవత్సరం... ఒక జీవితం:  మన జీవితంలో ఏ ఒక్క రోజుని , ఏ ఒక్క క్షన్నాన్ని రెండూ సారి బ్రతకలేం. ఇది ఒక జీవితం. అందుకే మీ జీవిత లక్ష్యం, వచ్చే ఐదు సంవత్సరాల లక్ష్యాలు, మీ ఒక సంవత్సరం లక్ష్యాలు ఏమిటో నిర్ణయించుకోండి. ప్రతి సంవత్సరం ఎదో ఒక నెలలో మీ వన్ ఇయర్ గోల్స్ పెట్టుకుని జీవితాన్ని స్పష్టంగా పునః పరిశీలించుకొండి. మీ గత సంవత్సర లక్ష్యాలు సాధించడానికి ఎలా ప్రయత్నించారు, ఏమి నేర్చుకున్నారు, ఎవరెవరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు, రాబోయే సంవత్సరంలో ఏమి చేయాలనుకుంటున్నారు అన్నీ పరిశీలించుకోండి. సంవత్సరం లక్ష్యాలు నెలల వారిగా మార్చుకొని, నెల వారి లక్ష్యాలు చేరేందుకు మీ రోజువారీ ప్రణాళికలతో ముందుకు వెళ్ళండి.
  • రాయటం అంటే  నిర్మాణాత్మకంగా అలోచించడమే: అందుకే జర్నల్ లేదా డైరీ రాయండి. మీ జీవితంలో జరిగే ముఖ్య అంశాలను , మీ లక్ష్యాలను రాసుకోడానికి, మీ ఎదుగుదలను మీరే మానిటర్ చేసుకోడానికి, మీ ఆలోచనలలో స్పష్టత రావడానికి, ప్రతినెల రివ్యూ చేసుకోడానికి, ప్రతిరోజు గోల్స్ చదువుకోడం ద్వారా అర్ధవంతంగా ప్రణాళిక, ప్రోత్సాహం చేసుకోడానికి  అద్భుతమైన ప్రక్రియ జర్నల్ రాయడం. జర్నల్ లేదా పర్సనల్ డైరీ రాయండి.
  • ఏది చూస్తారో, ఏది భావిస్తారో అది జరుగుతుంది: మీ జీవన ప్రాధాన్యాల దిశగా సంవత్సరం లక్ష్యాలు (ఇయర్ గోల్స్) సాధించినట్లుగా అప్పుడు ఎలా ఉంటారో అలా ఫీల్ అవ్వండి, అప్పుడు ఎవరితో ఉంటారు, ఏం మాట్లాడతారు, ఎలా ఫీల్ అవుతారు. అలా ఈరోజు నుంచే ఫీల్ అవుతూ ఉండండి. ఒకే రకమైన భావాలు ఆకర్షించ బడతాయి. మీరు ఆనందాన్ని, సాధించాను అనే భావాలని రోజు ఫీల్ అయితే ఆనందం, సాధించడం నిజంగానే ఆకర్షిస్తారు.
మీ జీవితం ప్రాధాన్యాలు మీ అలవాటుగా చేసే పనులలో భాగం అవ్వాలి. 90% మీ ఆలోచనలు , పనులను నియంత్రించేది మీ సబ్ కాన్షియస్ మైండ్. దానిని సైతం మీరు ప్రోగ్రాం చేయాలనుకుంటే, మీ జీవితానికి రిమోట్ మీ చేతిలో ఉండాలంటే మీ అలవాట్లు మీ జీవిత ప్రాధాన్యాల దిశలో ఉండాలి. అందుకు మీలో మీరు మాట్లాడుకునే మాటలు, మీలో మీరు చూసే చిత్రాలు మీరు ఆశించిన అంశాలకు తగినట్లుగా ఉండాలి. ఈ కీలక అంశాన్ని దృష్టిలో ఉంచుకొని మీ ఆర్టికల్ రాయటం జరిగింది.   ఇంకెందుకు ఆలస్యం ఈ క్షణమే మీకు ఒక పర్సనల్ నోట్ బుక్ కొనుక్కోండి. మీ జీవిత ప్రాధాన్యాలపై పనిచేయటం మీ అలవాటుగా మలుచుకోండి.

**************"సైకాలజీ టుడే" మాస పత్రికలో  మూడు సంవత్సరాలుగా నడపబడుతున్న నా న్యూ లైఫ్ కాలమ్ లో మే 2014 కోసం  ప్రచురింపబడిన ఆర్టికల్ 

1 comment:

  1. స్పూర్తి కలిగించే విషాయలను చక్కటి ఉదాహరణలతో మరియు మంచి చిత్రాలను పొందుపరచి అందరికీ ఉపయోగపడే విధంగా రాసినందుకు మీకు కృతజ్ఞ్తతలు.

    ReplyDelete