Wednesday 3 December 2014

Four Thieves who steal your productivity - మీ ప్రొడక్టివిటీని దొంగిలించే నలుగురు దొంగలు

ఇది డిసెంబర్ 2014. అంటే మన జీవితంలో ఒక క్యాలెండర్ సంవత్సరం ఆఖరిలో ఉన్నాం. మరి ఈ సంవత్సం  12 నెలలు మీ లైఫ్ ఎలా గడిచింది, మీ సమయాన్ని శక్తిని దేనిపై కేంద్రీకరించారు, ఏం నేర్చుకున్నారు, ఏం సాధించారు ఇవన్నీ రివ్యూ చేసుకోడానికి మంచి సమయం. 2014 లో మీ ఉత్పాదకత (ప్రోడక్టివిటి) ఎలా ఉంది? అనుకున్నది చేస్తే ఓకే , చేయకపోతే మాత్రం మీలో ప్రొడక్టివిటీ (ఉత్పాదకత) దొంగలు ఉన్నారన్న మాట. వాళ్ళెవరు? వారికెలా చెక్ పెట్టాలి వంటి కీలకమైన అంశాలను చర్చించడానికే ఈ ఆర్టికల్.

మీరు ఎన్ని ప్లాన్స్ వేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, మీ ప్రొడక్టివిటీని దొంగిలించడానికి కొందరు దొంగలున్నారు. ఈ దొంగలకు ఇప్పటికైనా చెక్ పెట్టాలి అనుకుంటే వాళ్ళు ఎవరు, ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు వారిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవాలి. ఆ దొంగలు నలుగురు ఎక్కడో లేరు.  మీలోనే చొరబడతారు. మిమ్మల్ని పనులు చేసుకోనీయకుండా శాసిస్తారు. రండి వారిని గుర్తించి మన పనులు మనం వేగంగా చక్కబెట్టుకుందాం. 
  1. శరీరాన్ని పట్టించుకోని దొంగ-  ఆరోగ్యకరమైన అలవాట్లు లేకపోవటం:
మిమల్ని మీరు ఈ ప్రశ్నలు అడగండి. నిజాయితీగా సమాధానం వెతికే ప్రయత్నం చేయండి. ముందు ఆ పని చేయండి తర్వాత పేరాగ్రాఫ్ లోకి వెళ్ళకుండా ఈ ఆత్మ శోధన చేయండి. మీ అలవాట్లు , ఆహారం, నిద్ర, వ్యాయామం విషయాలలో మీరు ఏమి చేయాలి? మీరు ఏమి చేస్తున్నారు? అసలు మీ ఎత్తుకి తగిన బరువు ఉన్నారా? మీ బాడీ మాస్ ఇండెక్స్ (బి. యమ. ఐ) ఎంత?మీరు ఎప్పుడు నిద్ర లేస్తున్నారు? ఎన్ని గంటలకి పడుకుంటున్నారు? మీరు ఏ సమయంలో ఎక్కువ శక్తివంతంగా పనిచేయగలరు? మిమ్మల్ని హాయిగా, ప్రశాంతంగా, ఎనెర్జిటిక్ గా  ఉంచే ఆహారం ఏమిటి? మీ శరీరానికి మనసుకి శక్తి నిచ్చే పనులు, అలవాట్లు మీకు ఉన్నాయా?
ఒక్క క్షణం ఆలోచించండి ప్రకృతి ఉచితంగా (అల్ ఫ్రీ ఆఫర్) ఇచ్చిన ఈ అద్భుతమైన శరీరాన్ని బాగా చూసుకోకపోతే మీరు ఎక్కడ జీవిస్తారు? మీరు ఎలా ఉంటారు? హాస్పిటల్ వార్డులలో అనారోగ్యంతో ఉన్నవాళ్ళని గమనించండి, ఆరోగ్యంగా ఉండి మనం జీవశక్తిని ఎంత వేస్ట్ చేసుకుంటున్నామో గుర్తించగలరు. ఉన్నత స్థాయిలో ఎదిగిన వాళ్ళు ఉన్నతంగా శక్తిని ఉపయోగించుకున్న వారందరూ ఆరోగ్యాన్ని కాపాడుకుని అద్భుతాలు సృష్టించారు. అందుకే మెడిటేషన్, మంచి ఆహార అలవాట్లు, ఆత్మీయులతో ప్రేమగా ఉండటం, లక్ష్యాలతో ముందుకు వెళ్ళడం ప్రణాళికతో జీవించడం వంటి అలవాట్లు చేసుకోండి.
  1. మొహమాటం దొంగ - లేదు , కాదు అని చెప్పలేకపోవటం:
మీరు మీ లక్ష్యాలకు, మీ ఉత్పాదకతకు సంబంధంలేని ఒక అంశానికి ‘ఎస్’ అని చెప్పారంటే మీ ప్రపంచంలో మిగతా అన్ని విషయాలకు ‘నో’ అని చెప్పినట్లే. ఆశ్చర్యంగా ఉందా? ప్రస్తుతం ఈ పుస్తకం చదువుతున్నది మీరు. మీరు ఈ క్షణంలో ఇక్కడే ఉన్నారు ఇంకో చోటలేరు. కాబట్టి మీరు ‘ఎస్’ అని ఒక దానికి చెపితే, మిగతా అన్ని విషయాలకు ‘నో’ చెప్పినట్టే కదా. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, కొల్లీగ్స్, మీనుంచి అనేక అంశాలు, పనులు, మీ ప్రెజెన్స్ ఆశిస్తారు. అది సహజం. కాని మీరు మీ చేయాలనుకున్న పనులను ఎంత వరకు  వదిలేసి ఇతర పనులకు సమయం కేటాయించగలరో నిర్ణయించుకోండి. అందుకే మీరు ప్రతి ఒక్కరినీ సంతోష పరిచే పని చేయలేరు అనే వాస్తవాన్ని అర్ధం చేసుకోండి. పనులను ఇతరులకు డెలిగేట్ చేయండి. మంచి అనిపించుకునే పనిలో (అదొక సూడో ఆనందం) మీకు సంబంధం లేని బాధ్యతలు, పనులు, సహాయ కార్యక్రమాలు చేసి మీ సొంతపనులు వెనకేసుకోవద్దు. ఫోకస్ అంటే మీరు ఏ పనులు చేయకుండా ఉంటారో నిర్ణయించుకోవడమే అంటాడు జాన్ కార్మార్క్. అందుకే ప్రేమగా చెప్పండి మీకు మరో పని ఉందని, మీ సమయం మీకు చాలా ఉపయోగకరమని. ముఖ్యంగా మీ అత్యంత ముఖ్యమైన పనులు చేసే సమయంలో రోజుకి కనీసం 4 గంటలు ఈ మెయిల్స్, ఫోన్, మీటింగ్స్, ముచ్చట్లు, ఏ  పనులు ఏ అంతరాయాలు లేకుండా చూసుకోండి.
  1. భయపడే దొంగ - గందరగోళం అంటే భయపడటం:
మీ ప్రాజెక్ట్ పనులు, మీ లక్ష్యాలు కేకు వాకింగ్ అన్నట్లు, నేతితో పెట్టిన విద్య అన్నట్లు ఉంటే బ్రహ్మాండంగా చేసేవాడిని అనేక ఇబ్బందులు ఎదురౌతున్నాయి అదుకే చేయలేకపోతున్న అంటారు. నిజానికి ఈ ప్రపంచంలో ఏ ఉన్నత ఫలితాలు అయినా, ఏ పెద్ద సక్సెస్ అయినా అనేక గందరగోళాలు, అడ్డంకులు, కష్టనష్టాలు తట్టుకున్న తర్వాత వచ్చినవే. అంటే ఒక ఉన్నత కార్యక్రమం, లేదా కాన్షియస్ గా ప్రణాళికతో ముందుకెళ్ళడం అనే ప్రాసెస్ లో భాగంగా మీకు తెలియని మలుపులు , అడ్డంకులు, ఎత్తుపల్లాలు ఉంటాయి. మనుషులు పనులకు సాయం చేయకపోవచ్చు, మిమ్మల్ని అవకాశంగా తీసుకోవచ్చు, ప్రాజెక్ట్ లేదా బిజినెస్ నష్టం రావచ్చు, కొన్ని అవకాశాలు కోల్పోవచ్చ్చు. లేనితనం, చిన్నతనం ఫీల్ అవ్వొచ్చు, ఓటమి ఆవహించిన భయం ఉండొచ్చు, ఒత్తిడి ఎక్కువ అవ్వొచ్చు. భావోద్వేగాలను అర్థం చేసుకోడానికి అదొక అవకాశం అనుకోండి, వాటిని అర్థం చేసుకోండి, గందరగోళం సహజం అని నమ్మండి. అందులోనుంచే మీరు స్పష్టతని వెతుక్కుంటారు అని గమనించండి. చిక్కుముడులు అంటూ లేకపోతే విప్పిదానికి చెప్పుకోడానికి ఏముంది? 
  1. ప్రభావాన్ని చూపే దొంగ- ప్రొడక్టివ్ వాతావరణం లేకపోవటం:
మీ వాతావరణం అంటే మీరు ప్రతిరోజు ఏమిచుస్తారు, ఎవరితో మాట్లాడతారు, ఏం చదువుతారు, ఏం వింటారు, ఎక్కువగా ఎవరెవరితో గడుపుతారో అదే వాతావరణం. అంటే మీరు చూసే, వినే, ఎక్స్పీరియన్స్ చేసే అంశాలు అన్నమాట. మీకు తెలిసిన మనుషులు, తెలిసిన ప్రదేశాలు, తెలిసిన క్లైంట్స్ అంటూ మీకు కంఫర్ట్ ఉన్న చోటనే ఉంటే ఆ విధానాలు మీకు ఉత్పాదకతని ఇస్తున్నాయా అని ఆలోచించు కోవాలి. కొంతమంది వారి జీవితం పై వారికే స్పష్టత , గౌరవం లేకుండా ఉంటారు అటువంటి నెగటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళ సాంగత్యం మీ జీవితం పై ప్రభావం చూపే అవకాశం ఉంది. నో చెప్పడం ఇక్కడ ముఖ్యం లేదంటే మీ వాతావరణం నిరుత్సాహమైపోతుంది. ఎందుకంటే మీరు ఎక్కువ సమయం గడిపే వ్యక్తుల ప్రవర్తనా విధానాలు, జీవన శైలి మీకు తెలియకుండానే చాప కింద నీరులా మిమ్మల్ని చుట్టేస్తుంది. యాటిట్యూడ్ అనేది ఒక అంటువ్యాధి వంటిది, ఒకరినుంచి ఒకరికి త్వరగా పాకిపోతుంది. మీకు ‘చిత్రం భళారే విచిత్రం’ సినిమాలో బ్రహ్మానందం ‘నీ యంకమ్మ’ అనే డైలాగ్ గుర్తుందా? ఆ యాటిట్యూడ్ ప్రదర్శించే సందర్భాలలో నిజ జీవితంలో ఇప్పటికీ  చాలా మంది ఆ డైలాగ్ వాడుతుంటారు. గమనించారా? అందుకే సరైన, ఉత్పాదకతని, ఉన్నత అలవాట్లని నిజ జీవితంలో పాటించే వ్యక్తులతో గడపండి, ఉన్నత వాతావరణాన్ని సృష్టించుకోండి. మీ లక్ష్యాలకు, మీ వ్యక్తిత్వానికి ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళ సాంగత్యం మిమ్మల్ని ఎక్స్ లెన్స్ వైపు నడిపిస్తుంది.

మీ గత సంవత్సరంలో ఈ నలుగురు దొంగలు మీకు ఎంత నష్టాన్ని తెచ్చారో ఒక్క సారి ఆలోచించండి. 2015 లో ఆ పరిస్థితి లేకుండా ఉండాలంటే ఏమి చేయాలో నిర్ణయం తీసుకోండి. ఒక ఉన్నత ప్రణాళికతో  న్యూ ఇయర్ లో న్యూ లైఫ్  నిర్మించుకోండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు హృదయ పూర్వక క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు J  

Friday 10 October 2014

Think big - Achieve Big : : ఉన్నతంగా ఆలోచించండి- గొప్పగా సాధించండి

చిన్నప్పటి కథలలో అనగనగా ఒక ఊరిలో పెద్ద, చెడ్డ రాక్షసుడు ఉండేవాడు....వంటి స్టొరీ లు వినటం వల్లనేమో చాలా మంది  పెద్ద స్థాయిలో ఒక దృఢమైన అడుగు వేయాలంటే భయపడతారు, పెద్ద సక్సెస్ సాధించాలంటే అది మనది కాదు అనుకుంటారు, బిగ్ అంటే బ్యాడ్  అన్నట్లు ఆలోచిస్తారు.  పెద్దగా అలోచించాలంటేనే చెడు చేసినట్లు కాదు, ఆర్డినరీ  వ్యక్తి ఎక్స్ ట్రా -  ఆర్డినరీ గా సాధించవచ్చా ? అసలు అలాంటిది ఉందా  అనే అంశాలను శాస్త్రీయంగా చర్చించడానికి ఈ ఆర్టికల్.

ప్రస్తుతం మనం లేముకాబట్టి, పెద్దది అనుకుంటున్నాం కాబట్టి పెద్ద స్థాయికి ఎదగాలనుకోవటం ఏ మాత్రం తప్పు కాదు. చిన్నప్పటి కథలోలా పెద్ద రాక్షసుడు ఉంటాడు , వాడు చెడ్డ వాడు అని చదువుకున్నంత మాత్రాన పెద్దవి అన్నీ చెడ్డవి కావు. పెద్ద స్థాయిలో అలోచించి మీరు కొన్ని నిర్ణయాలు, పనులు చేసి నప్పుడు చెడు అనుభవాలు ఎదురై ఉండొచ్చు. చెడు జరిగిన ఒక పెద్ద అంశం మీ జీవితంలో ఉంది ఉండవచ్చు. అలా అని బిగ్ అంటే బ్యాడ్ కాదు. పెద్ద సక్సెస్ గురించి, గొప్ప విషయాల గురించి మాట్లాడగానే ప్రజలు సాధారణంగా కష్టపడాలి, ఎంతో ప్రయాసతో కూడుకున్నది, సంక్లిష్టమైనది, ఒత్తిడి తో కూడుకున్నది అనే భావనకు లోనౌతారు. ఆ భావాలకు సంభందించిన ఇమేజెస్, మాటలు మైండ్ థియేటర్ లో చూస్తారు. ఆ విధంగా పెద్ద సక్సెస్ అన్నా, పెద్ద విషయాలు అన్నా ఇవే ఫీలింగ్స్ రిపీట్ చేయటం వలన ఒక ఒత్తిడికి, మానసిక అసౌకర్యానికి గురౌతారు. దీనిఫలితంగా ఆ ఆలోచనలు వచ్చినపుడు తమ మానసిక శక్తిని, సమయాన్ని, కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంబంధాలను, ఆరోగ్యాన్ని కోల్పోతేగాని అది సాధించాలేనేమో అనుకుంటారు. గొప్ప అంశాలు సాదిస్తామో లేదో అనే సందిగ్దంలో , కొత్త విధానాలను అందుకోగలమా అనే మీమాంసలో, కన్ఫ్యూజన్ లో ఉంటారు. దీనితోపాటు ఒకవేళ పెద్ద లక్ష్యాల దిశలో పనిచేసినా మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురవగానే మరోసారి దాని గురించిన ఆలోచన రాగానే తల గిర్రున తిరుగుతుంది. ఈ ఆలోచన చట్రం అలా కొనసాగితే ఓ కొత్త ఫోబియా (భ్రమలో) కనిపెట్టి మరీ కొనుక్కున్నట్లే. అదే పెద్ద ఫోబియాపెద్ద అంశాలంటే అనవసరంగా భయపడడం. ఎప్పుడైతే మనం పెద్ద అంటే చెడు అని, అనుసంధానం చేసి చూసామో మన ఆలోచనలు కుంచించుకుపోతాయి. అంతే కాక చిన్నగా ఆలోచించడం జీవితంలో భాగామైపోతుంది. ఇంకా ఊహించండి, చిన్నగా ఆలోచిస్తే పెద్ద సక్సెస్ ఎలా వీలౌతుంది?

మీ స్థాయికి సీలింగ్ లేదు:
ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి ఇంతే సాధించగలదని ఒక సీలింగ్ ఏమీ లేదు. ఏ శక్తి వచ్చి మనకెవరికీ “ఇదే  నీ స్థాయి”  అని మన సీలింగ్ పాయింట్ చెప్పలేదు. మరి అలాంటప్పుడు మీరు జీవితంలో ఏ స్థాయి కావాలి అని అంటే ఏమి సెలెక్ట్ చేసుకుంటారు? చిన్నదా? పెద్దదా? సమాధానం ఏంటో అందరికి తెలుసు పెద్దదే. ఎందుకంటే మనంతట మనమే మన ఎదుగుదలను అడ్డుకోవాలనుకోము. పెద్ద అంశాలు సాధించాలంటే కావలసిన సాధనా విధానాలు (strategies) మానసిక ప్రక్రియలు (Psychological processes) అర్థం చేసుకుంటే చాలు. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు పెద్దఅంశాలు ఎన్నుకునే వ్యక్తిగా అంగీకరించారో అప్పుడు పెద్ద అంటే మీరు ఇచ్చుకునే అర్థం మారిపోతుంది. అప్పుడు పెద్ద అంటే మిమ్మల్ని మీరు “ది బెస్ట్” గా స్వీకరించటం. ఎప్పుడైతే పెద్ద మీరు పెద్ద ఫలితాలు కోరుకున్నారో అప్పటివరకు మీ కంఫర్ట్ జోన్ ని పటాపంచలు చేస్తూ ధైర్యంతో కూడిన ఆలోచనలు వస్తాయి, మీ చాలెంజెస్ నుంచి మీరు అవకాశాలు చూడడం మొదలుపెడతారు. బిగ్ రిజల్ట్స్ నమ్మడం మొదలైతే మీరు మీలోని ప్రశ్నలకు సమాధానాలు ధైర్యంగా అడుగుతారు, మీ రోల్ మోడల్స్ ని త్వరగా కలుస్తారు, మీ లాంటి వ్యాపారులు మరొకరు ఉంటె వారి కంటే భిన్నంగా చేయటం ఎలా అని ఆలోచిస్తారు, భిన్నమైన మార్గాలలో ప్రయాణించదానికి ప్రయత్నిస్తారు.

పెద్ద ఆలోచనలతోనే గొప్ప ఫలితాలు:
ఈ ప్రపంచంలో మనుషులందరికీ అదే సమయం ఉంటుంది. కనీసం జీవిన్చాము అంటే జీవిత కాలం అనేది ఉంది. ఆ కాలంలో ఏమిచేస్తావు అనేది ఆ వ్యక్తి స్థాయిని నిర్ణయిస్తుంది. అంటే రోజు మొత్తంలో నువ్వు ఎంత గొప్పగా, ఎత్తుగా, ఉన్నతంగా అలోచిస్తావో ఆ స్థాయిలో ఫలితాలు వస్తాయన్న మాట. ఈ క్రింద ఇచ్చిన చిన్న గ్రాఫ్ ద్వారా దీనిని అర్ధం చేసుకోవచ్చు. 
అంటే నువ్వు ఎంత గొప్పగా ఆలోచిస్తావు అనేది రాకెట్ లాంచర్ లా పనిచేసి నిన్ను ఆ స్థాయికి చేర్చగలదన్నమాట . ఏ స్థాయి ఫలితం/ సక్సెస్ అయినా మీరు ఏమి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎవరితో చేస్తున్నారు అనేదానిపై ఆధారపడి ఉంటుంది. అయితే మీకు చిన్న ఫలితాలను ఇచ్చే ఈ మూడు అంశాలు జీవితంలో భాగమై ఉంటే మీకు చిన్న ఫలితాలే వస్తాయి. ఆ కాంబినేషన్ స్థాయికి మించి భిన్నమైన స్థాయిలో ఫలితాలు రావాలంటే భిన్నమైన కాంబినేషన్ (ఏమి చేయాలి, ఎలా చేయాలి, ఎవరితో చేయాలి) కావాలి. ఇది సహజం. ఎంత పెద్దగా వీలైతే అంత పెద్దగా ఆలోచించండి. పెద్ద ఫలితాలు పొందాలంటే మీ ఆలోచనా స్థాయికి తగ్గట్లు భిన్నమైన కాంబినేషన్ మారాలి. అప్పుడు ఫలితాలు ఆటోమేటిక్ గా మారతాయి.
పెద్దగా ప్రశ్న అడగటం వింత అనుకోవచ్చు, ఆలోచించడం , సాధించడం క్లిష్టం అనిపించవచ్చు . అది కొత్తలో మొదలుపెట్టిన తొలిరోజుల్లో మాత్రమే. దూరాన ఉన్న కొండ మహా పెద్దగా ఉంటుంది కాని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వెళుతుంటే ఇంకా పెద్దగా కనిపించిన ఆకొండ దగ్గరికెళ్ళి ప్రయాణం కొనసాగించి చూస్తే మీ పాదాల కింద మౌనంగా ఒదిగిపోతుంది. అక్కడినుంచి ప్రపంచం కుడా ప్రశాంతంగా అందంగా కనిపిస్తుంది. అదే కొండ, అదే మనిషి కాని పెద్ద ఆలోచన దిశలో ప్రయత్నించాక ఫలితాలు సంతృప్తిని ఇస్తాయి.

పెద్ద ప్రశ్న-పెద్ద ఆలోచన-పెద్ద ఫలితం :
అందుకే నేను ఎలా సక్సెస్ అవ్వాలి అని అనకండి, నేను 1000 మందికి అన్నం పెట్టేలా వ్యాపారాని ఎలా నిర్మించాలి అని అడగండి. నాకు సేల్ వస్తాడా రాదా అని సందేహించకండి, నేను ఈ నెలలో 30 ఎలా చేయాలి అని ఆలోచించండి. నేను సొంత ఇల్లు కట్టగాలనా అని సందేహించకండి, నేను 1000 గజాల స్థలంలో గార్డెన్ తో, స్విమ్మింగ్ పూల్ తో, నాకు ఇష్టమైన అభిరుచితో ఇల్లు ఎలా నిర్మించుకోవాలి దానికి నేనేం చేయాలని ఆలోచించండి ఆ విధంగా ప్రయత్నించండి. ఈ పెద్ద ప్రశ్నలకు పెద్ద సమాధానాలు, మీ లూనుంచి ఒక అంతర్వాణి కొన్ని సమాధానాలు సూచనలు చేస్తుంది. మీ అంతర్వాణి (శరీరం, మనసు చెప్తున్న ) సిగ్నల్స్ ని గమనించండి. పెద్ద ప్రశ్నలు, పెద్ద ఆలోచనలు దిశలో పెద్ద పనులు చేయండి. మీరు అలా సాధిస్తే ఎలా ఉంటారో ఆలోచించుకోండి. అయినా అనుమానాలు ఉంటె ఆల్రెడీ సాధించిన వారిని కలిసి మాట్లాడండి. వారిని గమనించండి, వారి అనుభవంలోంచి నేర్చుకోండి. భయపడకండి. భయాలు పక్కింటి తాళాలవంటివి. మీ ఇంటి తాళం తీయాలంటే మీరు ధైర్యం అనే తాళం చెవి వాడాలి. పక్కింటి తాళం వంటి భయాన్ని కాదు.

చిన్నగా ఆలోచించడం అనేది మీ జీవితానికి ఒక పరిధిని నిర్మించేలా , మీ ఎదుగుదలకు అద్దంకిలా మరేలా చేస్తుంది. దానికి ఆ అవకాశం ఇవ్వకండి. ఈ సృష్టిలో అద్భుతాలన్నీ ఎలా సృష్టించాబద్దయో మీరు అలాగే సృష్టించ బడ్డారు. అందుకే జీవితాన్ని సంపూర్ణంగా , ఫుల్ల్ గా జీవించండి. పెద్దగా ఆలోచించండి. పెద్ద గోల్స్ పెట్టుకోండి. పెద్ద అంటే గొప్ప, ఉన్నతమైన రాబోయే తరాలు మార్గదర్శకంగా నిలిచేలా, ప్రపంచంలో మీ ముద్రని ఉన్నతంగా వేసేలా. అందుకే మీరు ఏ స్థాయిలో ఊహల్లో సాధించాగాలరో ఆ స్థాయికి మించి ప్రయత్నాలు చేసి పెద్ద ఫలితాలు సృష్టించండి. పెద్దగా ఆలోచించండి, పెద్దగా జీవించండి. థింక్ బిగ్, లివ్ బిగ్. బెస్ట్ విషెస్. 
మీకు, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు దీపావళి శుభాకాంక్షలు J   
******
                        "సైకాలజీ టుడే" మాస పత్రికలో  నేను రాస్తున్న  న్యూ లైఫ్ కాలమ్ లో అక్టోబర్ 2014 కోసం  ప్రచురింపబడిన ఆర్టికల్  

Monday 8 September 2014

ఉన్నత అలవాట్లతో ఉన్నత జీవితం సృష్టించుకోండి - Create Empowering Life with Empowering Habits


ఇంటిలో, బడిలో, సమాజంలో, వ్యక్తిత్వ వికాస పుస్తకాలలో, శిక్షణా కార్యక్రమాలలో రిపీటెడ్ గా చెప్పే అంశం “ఉన్నత అలవాట్లు జీవిత అభివృద్ధికి మెట్లు”. ఎందుకు అలా అంటారు. విజయానికి చిట్కా ఏమిటంటే ఉన్నత అలవాట్లను ఎన్నుకోవడం, వాటిని జీవితంలో భాగంగా చేసుకోవడం. అంతే. వెరీ సింపుల్. ఉన్నత అలవాటు మీ జీవితంలో భాగం అయ్యేకొంది, మీరు క్రమశిక్షణ తో కూడిన వ్యక్తిగా కనిపిస్తారు. కాని నిజానికి మీరు నిత్యం చేయడానికి ఒక ఉపయోగపడే పని కలిగిఉన్న వ్యక్తిగా మారతారు. మీరు ఒక ముఖ్యమైన క్రమశిక్షణని  ఎన్నుకుని శక్తివంతమైన అలవాటుగా మార్చుకున్న వ్యక్తిగా మారతారు.
ఒక వ్యాధి- ఒక అల వాటు – ఒక విజయం:


అతనికి  చిన్నవయస్సులో ఏ.డి.హెచ్.డి. (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్) ఉన్నట్లు గుర్తించారు. కిండర్ గార్టెన్ టీచర్ తల్లితో చెప్పింది – “ మీ బాబు ఒక చోట తిన్నగా కుర్చోలేడు, నిశ్శబ్దంగా  ఉండలేడు, అతను ఒక బహుమతి లాంటి కొడుకు కాదు. అతను దేని మీద ధ్యాస నిలపలేదు, దేని మీద ఫోకస్ చేయలేడు”. పదకొండు సంవత్సరాల వయసులో అతని ప్రవర్తన బాగాలేదని స్విమ్మింగ్ పూల్ లో లైఫ్ గార్డ్ స్టాండ్ ని పట్టుకుని అలాగే గంటల కొద్ది నీళ్ళల్లో నిలుచునే వాడు. ఆ ప్రవర్తన లోపాలు కొంత పెద్దయ్యాక కూడా అతన్ని వదిలేయలేదు. 14 సంవత్సరాల వయసు నుంచి అతనికి రోజుకి కనీసం 6 గంటలు, వారానికి ఏడు రోజులు, సంవత్సరానికి 365 రోజులు స్విమ్మింగ్ లో శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షణలో అతని శక్తి అంతా ఒక అలవాటుని అభివృద్ది చేసుకోడానికి ఒక క్రమశిక్షనకోసం వెచ్చించాడు – రోజూ ఈదటం.  ప్రతి క్షణం గాలి తీసుకోవటం ఎలాగో, ప్రతి రోజూ ఈదటం అలాగే అన్నట్లు ఈత జీవితంలో భాగమైంది. 2004 లో ఏథెన్స్ లో 8 మెడల్స్, 2008 లో బీజింగ్ ఒలింపిక్స్ లో 8 మెడల్స్, 2012 లో లండన్ లో ఒలింపిక్స్ తో 22 మెడల్స్ తో కలిపి అతను రిటైర్ అయ్యేనాటికి ప్రపంచంలో స్పోర్ట్స్ చరిత్రలో ఆల్- టైం రికార్డు సొంతం చేసుకుని అత్యంత ఆకర్షణీయమైన ఒలింపియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతని తల్లి కొడుకు క్రమశిక్షణ, ఫోకస్ తనని ఆశ్చర్య పరుస్తుందని చెప్తుంది. అదే తల్లికి కిండర్ గార్టెన్ టీచర్ “దేని మీద ఫోకస్ చేయలేదడు” అని చెప్పింది. అతనెవరో గుర్తుపట్టారా? అతనే మైకేల్ ఫెల్ప్స్. అతనికి 11 సంవత్సరాల వయసు నుంచి కోచింగ్ ఇచ్చి తోడ్పడిన వ్యక్తి “బౌ మాన్”. అయితే ఈ రియల్ స్టొరీ లో అద్భుతం ఎలా సాధ్యమైంది?  ఒకే ఒక ఎంపిక  చేసుకున్న  క్రమశిక్షణ కోసం కట్టుబడి ఉండటం వలన.
ఉన్నత క్రమశిక్షణ అభివృద్ధి చేసుకోవటం వలన దీర్ఘ కాలంలో ఉన్నత లాభాలుంటాయి. అది మీరు వెతుక్కుంటున్న విజయాన్ని మీ జన్మహక్కు అయిన ఎక్స్ లెన్స్ ని మీ దరికి చేరుస్తుంది. మీ జీవితం చాలా స్పష్టంగా, క్లిష్టతరం కాకుండా సరళంగా తయారౌతుంది ఎందుకంటే మీకు ఏది బాగా చేయాలో , ఏది చేయకూడదో తెలుస్తుంది. క్రమశిక్షణను సరైన అలవాటు నిర్మించుకోడానికి ఉపయోగించుకోవటం మాత్రమే ఉపయోగిస్తే అది మీ ఎక్స్ లెన్స్ కి “లైసెన్స్” లా , మీ జీవితంలోని అనవసర అంశాలకి “అవుట్ పాస్” లా పని చేస్తుంది. ఇది సత్యం. మీరు సరైన పని చేసినపుడు  అది మీకు జీవితంలో మీ ప్రతి పనిని మానిటర్ చేయాల్సిన అవసరం లేని స్వేచ్చ కూడా ఇస్తుంది.

మేజిక్ స్వీట్ స్పాట్ కి 66 రోజులు:
క్రమశిక్షణ (Discipline), అలవాట్లు (Habits) అంటే చాలా మందికి మాట్లాడడం ఇష్టం ఉండదు. ఆ మాటల శబ్దాలు, ఆ చిత్రాలు మైండ్ లోకి రాగానే మనుషులు అలిసిపోతారు. హహ కనీసం అలా ఫీల్ అవుతారు. అమ్మో..నా బలాలు-బలహీనతల ఆత్మ పరిశీలన చేసుకోవాలేమో అనుకుంటారు. లేదా ఎందుకు చేయలేకపోయానంటే....అని కారణాల చిట్టా మొదలు పెడతారు. కాని క్రమశిక్షణ, అలవాట్లు ఉన్నతంగా నిర్మించుకోగలిగితే జీవితం అద్భుతంగా మారుతుంది.  అందుకే మీ జీవితాన్ని మేజిక్ లా మార్చగలిగే ఆ స్వీట్ స్పాట్ ఏంటో దానిని జీవితంలో ఎలా భాగం చేసుకోవాలో తెలుసుకుందాం రండి. మీకు శుభవార్త ఏంటంటే మంచి క్రమశిక్షణ దీర్ఘ కాలం ఉంటుంది. అలవాట్లు ప్రారంభంలోనే ఇబ్బందిగా అనిపిస్తాయి. నిర్విరామంగా కొనసాగించే కొద్దీ ఆ అలవాటుని కొనసాగించటం మీకు సులభమౌతుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన కీలక అంశం. అలవాట్లు ప్రారంభించేటప్పుడు కంటే జీవితాంతం కొనసాగించ దానికి తక్కువ శక్తి, ఫోకస్ చాలు. ఒక క్రమశిక్షణ ఎక్కువ కాలం కొనసాగిస్తే అది మీ జీవితంలో భాగం అయిపోతుంది. ఒకసారి ఈ విషయాలు ఆలోచించండి. వంట చేయడం, పొద్దున్నే టీ తాగటం, లంచ్ తర్వాత ఒక సిగరెట్ కాల్చడం, ఈవెనింగ్ వాకింగ్ కి వెళ్ళటం, స్నేహితులు వద్దకి వెళ్లి వచ్చాక మనం క్షేమంగా చేరామని చెప్పటం...ఇలా మీరు రోజు వారి చేసే కార్యక్రమాలు చెక్ చేసుకోండి చిన్న క్రమశిక్షణ లా కొంతకాలం కొనసాగించి అలవాటుగా చేసుకున్నవే. మంచి చెడు ఏదైనా అలాగే జీవితంలో భాగం అయిపోతాయి. ఒక కొత్త ప్రవర్తన మన అలవాటుగా మారితే, దానిని రోజువారి జీవితంలో భాగం చేసుకోడానికి పెద్ద శ్రమ పడనవసరం లేదు.
అందుకే మన క్రమశిక్షణ ఎక్కువ కాలం కొనసాగిస్తే అలవాటుగా మారుతుంది. ఒక మంచి అలవాటు జీవితంలో భాగం అయ్యాక దానిని మైంటైన్ చేయటం ఈజీ. అలా మీ రోజు వారి కార్యక్రమాలు కూడా సులభంగా కంటిన్యూ చేస్తారు, కొత్త అలవాటు లాభాల్ని రుచి చూస్తారు. మీ ఆత్మ విశ్వాసం , ఆత్మ గౌరవం పెరుగుతుంది. ఆ తర్వాత ఇంకో క్రమశిక్షణ తీసుకోవచ్చు. అయితే ఎన్ని రోజులు ఈ క్రమశిక్షణ (కొత్త పని, ప్రవర్తన) కొనసాగించాలి అంటే వ్యక్తిత్వ వికాస శిక్షణలలో, పుస్తకాలలో ఎక్కువగా 21 రోజులు అని నేర్చుకుంటాము. అయితే దీనిని ఇప్పటికీ  ఆధునిక సైన్సు ప్రకారం నిరూపించాబడినట్లు మనకు రుజువులు లేవు. అయితే దీనికి యూనివర్సిటీ కాలేజీ అఫ్  లండన్ వారు 2009 లో చేసిన రీసెర్చ్ ఒక శాస్త్రీయ సమాధానాన్ని ఇచ్చింది. ఒక కొత్త ప్రవర్తన ఒక అలవాటుగా ఎన్ని రోజులకి మారుతుంది అని పరిశోధన చేసారు. 18 రోజుల నుంచి 254 రోజులు పట్టింది అయితే  దాదాపు 66 (అరవై ఆరో ) రోజు ఒక స్వీట్ స్పాట్ అని ఆ రోజు ఎక్కువ మంది అలవాటు నిర్మించుకూగాలిగారని కనిపెట్టారు.
మంచి అలవాట్లు ఉన్నవారిపై మేగాన్ ఊటేన్  మరియు కెన్ చెంగ్ చేసిన ఒక రీసెర్చ్ లో ఉన్నత అలవాటు విజయవంతంగా వారి జీవితాల్లో భాగం చేసుకున్న విద్యార్థులు జీవితాలు ఎంతో బాగున్నాయని, తక్కువ ఒత్తిడి కలిగి ఉన్నారని, అనవసర ఖర్చులు తగ్గించుకున్నారని, మంచి ఆహార నియమాలు నేర్చుకున్నారని, మద్యపానం, సిగరెట్స్ తగ్గించారని కనుగొన్నారు. ఉన్నత అలవాట్లు ఉన్నవారు ఉన్నతంగా పనిచేయగలరు. ఎందుకంటే చాల ముచ్యమైన పనులు వారు క్రమం తప్పకుండా చేయగల నైజం కలిగి ఉంటారు.
గుర్తుంచుకోండి – అలవారుచుకోండి:
  • క్రమశిక్షణా యుత వ్యక్తిగా కంటే ఉన్నత అలవాట్లు పాటించే శక్తిగా, ఎంపిక చేసుకున్న ఉన్నత క్రమశిక్షణలు ప్రాక్టీసు చేసే వ్యక్తిగా మారండి
  • ఒక సమయంలో ఒక  అలవాటు ఏర్పరుచుకోండి. ఒక సమయంలో ఒకటే తీసుకుని , దానిని ఎక్కువ కాలం ప్రాక్టీసు చేస్తూ కొనసాగించండి.
  • ప్రతి అలవాటుకు తగినంత సమయం కేటాయించండి. దాదాపు 66 రోజులకు అలవాటు అవుతుంది. ప్రాక్టీసు చేయండి. అయితే అలవాటుగా మారడానికి మీకు ఎక్కువ రోజులు ప్రాక్టీసు అవసరం అనిపిస్తే కాన్షియస్ గా ఎక్కువ రోజులు కూడా ప్రాక్టీసు చేయండి.
 మీరు ఏది నిర్విరామంగా (రిపీటెడ్) చేస్తారో అదే మీరు అవుతారు. అంటే సాధించడం అనేది ఒక పని కాదు, ఒక అలవాటు. అందుకే ఎక్స్ లెన్స్ కోసం , సక్సెస్ కోసం మీరు అర్రులుచాచనవసరం లేదు. ఉన్నత క్రమశిక్షణలు గుర్తించి, ఫోకస్ తో వాటిని మీ డైలీ లైఫ్ లో భాగం అయ్యేలా అలవాట్లు నిర్మించుకుంటే చాలు. అద్భుత ఫలితాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఆ అద్భుత అలవాట్లు నిర్మించుకునేలా ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.  ప్రయత్నం చేసి మీ సక్సెస్ స్టొరీ మాతో పంచుకోండి. ఎక్స్ లెన్స్ మీ జన్మ హక్కు. దానిని నిజం చేసి చూపించండి మీ అలవాట్లతో.  బెస్ట్ విషెస్.
*****
                     "సైకాలజీ టుడే" మాస పత్రికలో  నేను రాస్తున్న  న్యూ లైఫ్ కాలమ్ లో సెప్టెంబర్ 2014 కోసం  ప్రచురింపబడిన ఆర్టికల్  

Monday 1 September 2014

The August Fest 2013 - Write Up: What a start-up can learn?


Hi 
I have attended a two-day conference called The August Fest 2014 on 30th and 31st August 2014. 
Before I share anything about conference, I thought I can share my write-up (an unedited version of my notes)  on the same event organised in August 2013 at Indian School of Business (ISB). This is just my personal notes considering myself as budding entrepreneur and I have actually circulated to all August Fest participants in 2013 and got great response. So this is for you all who want to bring out the entrepreneur out. :)  



1.      Develop a value proposition; give value to your product. Don't worry about price.
2.      Do market research, try to understand the present competitors, make yourself unique in your service or product
3.      Develop a sense of perseverance and with stand with ups and downs with lot of courage and learn from others experiences
4.      Don't worry about you have experience in the field that you have passion or start up that you want to take up, just try to organize and learn the game and play it till you win it
5.      Don't have a second option for your career or plan B for your business
6.      Congratulations on your first failure. Because the more you fail faster, the better you get to success in the field of entrepreneur. It does not mean you should fail , it means you may fail but as long as you learn from failure faster, you can enjoy great success. Get feedback, do analysis of feedback, learn from others instead of failures
7.      One person can venture into many businesses even though he is not a great performer in college or in studies (Does not mean one should not perform well in academics)
8.      Every entrepreneur one thing is common they all dared to do things. They are risk takers. They believed their product or service even though others cannot believe or laughed at their ideas.
9.      Things that you never think as a great business idea can be a wonderful or already successful business
10.  There is plenty of opportunity as long as you can provide solution to a problem
11.  Building meaningful relation is building business
12.  Your first impression is a makes more impact on your sales . A book is always judged by it's cover page
13.  Give yourself to the fullest and believe that you can do, make as much best as you can, you will automatically receive. Giving is nothing but receiving in a flow of business.
14.  Try to learn the decision makers and contact them. Try to remember every persons' name who involve in the process of most important journeys in life as you progress as a entrepreneur (A reception is a great business provider in other role for you,  a security guard is a wonderful supporter for meeting a decision maker in a office)
15.  Compete on value that you give through your product and service, compete on relationships, compete on trust that you can bring, compete on giving the best [Wowing] to the customers instead of competing on price.
16.  Get the other person see the value of your product by offering a free or test service or sample product then the sale can be closed with less cost
17.  Your passion (sometimes hobby) can be very well converted into business if you can find the need or value for what you do
18.  Many entrepreneurs are using internet, social media and mobile apps for the services or product and this is much needed to sustain on long run
19.  Videos are more attractive for presentations when developed professionally and used at right time with quality
20.  Instead of addressing crowd you can also target premier customers with high value products with relevant pricing and make revenues 

21.  THE MUST KEEP IN MIND FEEDS: Understand the problem, Solution /Product, People, Price, Capital,  market research, taking mentors support, attending entrepreneurs networks and workshops, Cash flow, revenue model,  Marketing, Customer feedback, Sustainable model, possibilities for scaling up

Thursday 31 July 2014

మిమ్మల్ని గెలిపించే టీ - మేనేజ్ మెంట్ టెక్నిక్

టీ - మేనేజ్ మెంట్ టెక్నిక్


ఒక కప్పు టీ తాగితే కొంత మందికి ఒక రోజంతా  హాయిగా ఉంటుంది అలాగే  టీ- మేనేజ్ మెంట్ టెక్నిక్ పాటిస్తే ఎవరికైనా జీవితమే అద్భుతంగా మారుతుంది . అది  ఎలాగో తెలుసుకుందాం రండి.  


ఈ విశ్వంలో మీద కొన్ని లక్షల , కోట్ల జీవరాశులున్నాయి.
ఈ భూమి మీద ఏడువందల ఇరవై నాలుగు కోట్ల యాభై ఐదు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఐదు వందలు  (724 55 79 500) కి పైగా మనుషులు ఉన్నారు.
ఇంతమంది మనుషులకు దాదాపు కేవలం మూడే మూడు వనరులు (రిసోర్సెస్) ఉన్నాయి. అవి ప్రకృతి మనిషికి అందించిన అద్భుతాలు. అవే శరీరం (బాడీ), మనస్సు (మైండ్), జీవ శక్తి (లైఫ్ ఎనర్జీ).
అయితే ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి జీవన నాణ్యత (క్వాలిటీ అఫ్ లైఫ్) అయినా ఈ మూడు వనరులను ఎలా ఉపయోగించుకుంటున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు ఏ దేశంలో ఉన్నారు, ఏ కల్చర్ లో పెరిగారు, మీ ఆచార వ్యవహారాలూ ఏమిటి, మీ తల్లిదండ్రుల పెంపకం ఎలా ఉంది, మీ విద్యార్హత ఏమిటి, మీరు పని చేసే కంపెనీ ఏమిటి, మీ ఎత్తు, మీ బరువు, మీ రంగు, మీ కులం , మతం, ప్రాంతం ఏమిటి అనే అంశాలు మీ జీవితాన్ని శాసిస్తున్నాయి అనో, ప్రభావం చూపుతున్నాయనో మీరు అనుకుంటే అది కేవలం మీ భ్రమ. ఈ భ్రమని నిజమని నమ్మి, పెంచిపోషిస్తే ఆయా అంశాలన్నీ మీ ఆలోచనలకు సంకెళ్ళుగా , ప్రయత్నాలకు పరిధులుగా, మీ ఎదుగుదలకు ఆటంకాలుగా మారతాయి. మళ్ళీ ఒక సారి ఆలోచించండి శరీరం, మనస్సు , జీవ శక్తి  ఇవే ఇప్పటివరకు జన్మించిన మనుషులందరికీ ఉన్నది. ఇకముందు జన్మించే వారికి ఉంటుంది. మరి ప్రపంచ స్థాయి విజేతలు, దేశ స్థాయి విజేతలు, మీ ప్రాంత స్థాయి విజేతలు అనేక రంగాలలో అద్భుతాలు చేసారు కదా వారికి ఇవే వనరులు ఉన్నాయి కదా? మరి కొందరు ఎందుకు సాధిస్తుంటారు, సృష్టిస్తుంటారు? కొందరు ఎందుకు కేవలం వారిని చూస్తూ లేదా ఉన్న జీవితానికి వంకలు పెట్టుకుంటూ, ఎందుకు ఎదగాలేదో దానికి  గుడ్డి కారణాలు చెప్తూ గడుపుతారు? కేవలం వారి వనరులు వారు ఉన్నత స్థాయిలో గుర్తించక పోవటం వాలాన. మీరు సృష్టించే వారిలో ఉండాలనుకుంటున్నారు. అందుకే గుర్తుంచుకోండి. ప్రతి విజేతకు ఉన్న వనరులు మీకు ఉన్నాయి అని తెలుసుకోవటం విజ్ఞానం. ఆ వనరులను మీరు ఎలా ఉపయోగిస్తారు,  దేనిపై ఫోకస్ చేస్తారు అనేది మీ నైపుణ్యం. అదే జీవన నైపుణ్యం.  ఆ జీవన నైపుణ్యాన్ని సింపుల్ గా నేర్చుకొని మీ జీవితానికి మీరు అప్లై చేయడానికి ఉపయోగపడే అద్భుత అస్త్రం ఈ టీ (TEA) మేనేజ్ మెంట్ టెక్నిక్.

టీ మేనేజ్ మెంట్ టెక్నిక్ అంటే ఏమిటి?
కొందరు ఉదయాన్నే టీ తాగుతారు కదా? అందులో టీ ని ఇంగ్లీష్ భాషలో TEA అని రాస్తాము. ఇది గుర్తుంచుకుంటే  టీ మేనేజ్ మెంట్ టెక్నిక్ సులభంగా గుర్తుంటుంది. అంటే మీ సమయాన్ని (TIME), మీ శక్తిని (ENERGY) మీ కార్యక్రమాలను (ACTIVITIES) ఉన్నతంగా నిర్వహించడమే టీ – మేనేజ్ మెంట్ టెక్నిక్ (TEA Management Technique). 

మీ సమయం (TIME) –  మీరు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు మీ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు? ఏమి పనులు చేస్తున్నారు? ఎప్పుడైనా గమనించారా? ఆ ఏముంటాయి రోజు చేసే పనులే కదా అనుకోకండి. అదే సమయంలో ఎన్నో  ఉన్నత పనులు చేయగలరేమో, మీరు మిస్ అవుతున్నారేమో ఆలోచించండి. మీ జీవిత లక్ష్యాల వైపు మీ సమయం ఫోకస్ చేయొచ్చేమో  గమనించండి. రోజుకి 86 400 సెకన్ల సమయం మీ వ్యక్తిగత ఎకౌంటు లో ఈ ప్రకృతి ఇచ్చే వరం. దానిని ఎలా వాడుకుంటారో ఆలోచించండి. నిమిషానికి లక్షల ఖర్చు అవుతుందనుకుని మీ సమయం వినియోగించుకోండి.

మీ శక్తి (ENERGY) -  ఒక రోజు మొత్తంలో మీరు యాక్టివ్ గా ఏ సమయంలో ఉంటారు? కొందరు ఉదయం శక్తి వంతంగా పని చేయగలరు. కొందరు రాత్రి పడుకునే ముందు ముఖ్యమైన పనులు బాగా చేస్తారు. కొందరు సాయంత్రం యాక్టివ్ గా ఉంటారు. ఏ  యాక్టివ్ గా ఉంటున్నారు, ఆ సమయంలో ఎలా మీ శక్తిని వాడుకుంటున్నారు? మీరు ఎలాంటి పనుల మీద ఎక్కువ జీవశక్తి, ఆలోచన శక్తి, శారీరక శక్తి ఉపయోగించుకుంటున్నారు? ఎక్కువ శక్తివంతంగా ఉన్నప్పుడు ముఖ్యమైన పనులు చేయగలుగుతున్నారా?. మీ జీవిత ఉన్నత జీవశక్తిని మీ జీవిత ప్రాదాన్యాలపై ఫోకస్ చేస్తున్నారా. ఆలోచించండి.
మీ కార్యక్రమాలు / పనులు (ACTIVITIES)  - ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరం...ఇలా ఒక జీవితం చేతివేళ్ళ మధ్యలోంచి నీళ్ళు జారినట్లు కాలం జారిపోతుంది. ఆ విలువైన సమయంలో మీ జీవన ప్రాధాన్యాలపై ఫోకస్ చేస్తున్నారా? మీరు ఎలాంటి పనుల మీద మీ సమయం, శక్తి ఉపయోగించుకుంటున్నారు? మీరు ఇప్పుడు చేస్తున్న పనులు మీ జీవితాన్ని అత్యంత ఉన్నత స్థాయికి తీసుకేలతాయా? మీరు చేస్తున్న పనులు మీ కలలకి దగ్గరిగా, మీ లక్ష్యాలకి దగ్గరిగా తీసుకేల్లెల ఉన్నాయా? మనలో ఇద్దరు మనుషులు ఉండాలి. ఒకరు పనులు చేస్తుంటే, మరొకరు రోజు మొత్తం లో చేసే ప్రతి పనిని అవి జీవితానికి పనికోచ్చేయా కాదా అని గమనిస్తూ ఉండాలి. అంటే  ఒక  యాక్టివిటీ వాచ్ మాన్ మనలోనే ఉండాలన్న మాట. అతను మనలో ఉన్న పనులు చేసే నిర్వాహకుడిని గమనించాలి. మీరు అలా మీ పనులను పరిశీలించుకోండి. ఉన్నత మార్గానికి తీసుకెళ్ళే ఉపయోగకరమైన పనులు చేయండి.
టీ మేనేజ్ మెంట్ టెక్నిక్ - ఎక్సర్ సైజ్:
స్థలాభావం వలన కేవలం చిన్న టేబుల్ ఇచ్చాము. మీరు ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు మీ సమయాన్ని , శక్తిని, పనులను వివరంగా ప్రతి రోజు ఈ క్రింది టీ (TEA) మానిటరింగ్ షీట్ లో రాసి రాత్రి పడుకునే ముందు పరిశీలించుకోండి. మూల్యాంకనం చేసుకోండి. ఈ ఎక్సర్ సైజ్ 4 వారాలు చేయండి.
సమయం
పనులు
ఎంత శక్తి ఉపయోగించారు?10 మార్కులు అధికం , 0 అసలు ఉపయోగించలేదు
మీ జీవన ప్రాదాన్యాలకు, మీ ఉన్నత జీవితానికి ఈ పని అవసరమా?
లేదు, కొంత అవును, అవును,  కాదు, ఖచ్చితంగా పనికి రాదు
6 – 7 ఉదయం



7 – 9 ఉదయం



9 – 1 మధ్యాహ్నం




మీ జీవితంలో ఏమి మార్చుకుంటే ఉన్నతంగా మారతారో మీరే నేర్చుకునేలా ఉపయోగపడుతుంది ఈ “టీ మేనేజ్ మెంట్ టెక్నిక్”. దీనిని అమలు చేసి మీ మార్పులు మాతో పంచుకోండి. ఎక్స్ లెన్స్ మీ జన్మ హక్కు. దానిని ఆహ్వానించాలంటే అద్భుతమైన టెక్నిక్ మీరు పాటించాలి. బెస్ట్ విషెస్. మీకు, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు J   
*****
"సైకాలజీ టుడే" మాస పత్రికలో  నేను రాస్తున్న  న్యూ లైఫ్ కాలమ్ లో ఆగష్టు  2014 కోసం  ప్రచురింపబడిన ఆర్టికల్ 

Tuesday 15 July 2014

10,000 Hits - Thank you all :)


10,000 Hits - Thank you all
=====================
Dear Friends,
I created this blog called "NEW LIFE TIPS" to share my articles (Telugu and English) on personal excellence. It reached 10,000 + hits day before yesterday. Thanks you all for accepting the work and encouraging me. I could able to introduce my work to people from different countries (India, Indonesia to USA, New Zealand) , from different walks of life and professions (students, employees, managers, up coming trainers, writers, auto drivers to professors, directors of the companies to IAS officers).
To reach people with content rich, practically possible tools and techniques, we are launching a website and the blog articles also will be available in the website very soon. I request you all to share your opinions, give your constructive feedback and comment your responses to improve the quality of the articles, content delivery and concepts presented in the blog. My heartfelt thanks to all my blog readers, fb friends and meaningful interactions you had with me.

 May your life filled with health, joy, love, happiness, wealth, balance, bliss, abundance and peace :)
Thanks a million :)
Chandra 

Friday 11 July 2014

Create Your Vision Board - మీ విజన్ బోర్డ్ సృష్టించుకోండి

మీ విజన్ బోర్డ్ సృష్టించుకోండి
“ఒక్క సారి కమిట్ అయితే నామాట నేనే వినను” అనేది  జనాదరణ పొందిన సినిమా డైలాగ్. మరి అలా ఒక్క సారి కమిటై మన గోల్స్ మనం చేరాలంటే సినిమాలో చూపించినంత ఈజీ గా వీలౌతుందా ? అసలు 90% మనిషి చర్యలని నడిపించే సబ్ కాన్షియస్ మైండ్ ని, రోజు వారీ అలవాట్లని నిర్దేశించుకున్న లక్ష్యాలు దిశలో ప్రోగ్రాం చేయాలంటే  ఉపయోగపడే  ఆయుధాలు ఉన్నాయా అంటే  ఉన్నాయి అనే చెప్పాలి.  వాటిలో ఒక ఆయుధాన్ని మీకు పరిచయం చేయడానికే  ఈ  ఆర్టికల్.


మనుషులందరికీ చూడటం, వినటం, పనులు చేయటం వచ్చినప్పటికీ కొందరు చూడటం ద్వారా కొందరు వినటం ద్వారా కొందరు పనులు చేస్తూ ఉండటం ద్వారా,  ఫీలింగ్స్ ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు. కొందరికి వీటిలో ఎదో ఒకటి లేదా రెండు విషయాలు శక్తివంతంగా నేర్చుకోడానికి దోహదం చేస్తాయి. మీరు ఈ ఆర్టికల్ చదువుతున్నారు అంటే చదవటం ద్వారా నేర్చుకునే మనస్తత్వం కలవారై ఉంటారు.  మీరు ఏ టైపు వ్యక్తి అయినా మీరు కోరుకున్నదానిని మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండిపోయేలా, మీ రోజువారీ జీవితంలో భాగమైపోయేలా  చేయడానికి ఉపయోగపడే అద్భుత యంత్రం అంటే మీ “విజన్ బోర్డ్ (Vision Board).


విజన్ బోర్డ్ అంటే ఏమిటి?


విజన్ బోర్డ్ అంటే అనేక బొమ్మల సమ్మేళనం, వివిధ రంగురంగుల చిత్రాల మాలిక. మీ జీవితంలో మీరు ఏమి కావాలని కోరుకుంటున్నా , మీరు ఎలా ఉండాలనుకుంటున్నా, మీరు ఆశించే అనేక విషయాలు, మనుషులు, వస్తువులు, అనుభవాలు, ఫీలింగ్స్, స్థితులు తెలిపే దృశ్యరూప సాక్షాత్కారమే మీ విజన్ బోర్డ్. అంటే మీ శరీరం,  మనస్సు, మీ కుటుంబం, మీ రిలేషన్ షిప్స్, మీ కెరీర్, మీ వ్యాపారం, మీ చదువు, మీ సామాజిక బంధాలు, మీ ఆధ్యాత్మిక ఆలోచనలు, మీ వ్యక్తిగత అభివృద్ధి, మీరు ఎంజాయ్ చేయాలనుకుంటున్న అంశాలు, మీరు చూడాలనుకుంటున్న ప్రదేశాలు, తీసుకోవాలనుకుంటున్న శిక్షణా కార్యక్రమాలు...ఇలా అనేక అంశాలకు సంబంధించిన రంగుల,అందమైన, శక్తివంతమైన చిత్రాల సమాహారం విజన్ బోర్డ్. దీనినే కొందరు “ కలల బోర్డ్” (Dream board), లక్ష్యాల బోర్డ్ (Goal board), సృజనాత్మక మాలిక (Creativity Collage) వంటి పేర్లతో కూడా పిలుస్తారు. పేరు ఏదైనా మీరు మీ జీవితంలో దేనిని కోరుకుంటున్నారో ఆ అంశాల దృశ్య రూపమే విజన్ బోర్డ్. చిత్రాలతో పాటు మీకు కచ్చితంగా గుర్తుండిపోవాలనుకున్న పదాలు, మిమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడిపించే మాటలు (పాజిటివ్ స్టేట్ మెంట్ లు) కూడా  రాసుకోవచ్చు.        

మీ విజన్ బోర్డ్ మీకు ఐదు రకాలుగా సహాయపడుతుంది :

  1. మీరు ఏమి ఆశిస్తున్నారో ఆ దృశ్య రూపాన్ని ఒకే ఒక చోట చూసుకునే అవకాశం ఉండడం వలన మెదడు మీకు ఉన్నత స్థాయిలో పనిచేస్తుంది, కొత్త ఆలోచనలు కల్పిస్తుంది. మిమ్మల్ని ఒకే చట్రంలో ఆలోచించే బదులు, చట్రం బయటికి వచ్చి ఆలోచించేలా ప్రోత్సహిస్తుంది. అందుకే కార్పొరేట్ సంస్థలు వారి లక్ష్యాలు సింగల్ పేజి లో, బోర్డుల్లో  చిత్రాలు / మాటల ప్రమోషన్ ద్వారా వారి ప్రతినిధుల మైండ్ బాగా ప్రోగ్రాం చేస్తారు.
  2. మీ లక్ష్యాలపై మీకు స్పష్టత ఇస్తుంది, మీలో జీవితంపై గల కొన్ని అస్పష్టతలను  తొలగిస్తుంది. ఎందుకు, ఎప్పుడు, ఏమిటి, ఎక్కడ వంటి అంశాలతో అలోచించి మీ విజన్ బోర్డ్ చిత్రాలు సేకరణ జరిగితే అద్భుతమైన స్పష్టత అదే వస్తుంది   
  3. మీ రోజు వారీ జీవితంలో బిజీ అయిపోయి కోరుకున్న లక్ష్యాలపై పనిచేయలేక పోతున్నాం అనే పరిస్తితిలోంచి బయట పడేసి మిమ్మల్ని మీ లక్ష్యాలపై పనిచేసేలా అనుక్షణం గుర్తుకు తెస్తుంది
  4. మీరు కోరుకున్న లక్ష్యాలను చేరుకున్నట్లు ఊహించుకోడానికి (విజువలైజేషన్ కి) ఉపయోగపడే అద్భుతమైన యంత్రం ఇది. ఎవరైతే విజువలైజేషన్ చేస్తారో వారు ఊహించిన దానిని నిజజీవితంలో సృష్టించే అవకాశాలు ఎక్కువ.     
  5. మీరు ఆశించిన ఫలితాలను , విషయాలను మీ వైపు ఆకర్షించేలా మీ నుంచి తరంగాలను ప్రసరింపజేస్తుంది . దీనినే ఆకర్షణ సిద్దాంతం (Law of attraction) అన్నారు

మీ విజన్ ఇలా చేసుకోండి :

కావలసిన వస్తువులు:

  1. పాత మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్, ఎక్కువ అందమైన చిత్రాలు (ఇమేజెస్) ముద్రించే దిన పత్రికలు, వార పత్రికలు, మాస పత్రికలు
  2. కత్తెర 
  3. గ్లూ స్టిక్ లేదా చిన్న కాగితాలు అంటించడానికి కావలసిన పదార్ధం
  4. దళసరి అట్ట ముక్క లేదా ఫోమ్ బోర్డు లేదా పిన్ బోర్డు
  5. తెల్లటి పేపర్స్ (A4 వైట్ షీట్స్)
  6. కలర్ స్కెచ్ పెన్ లు
తయారీ విధానం :

స్టెప్ 1: ముందుగా మీరు ఒక సంవత్సరం నుంచి 15 నెలలలో సాధించాలనుకుంటున్న మీ లక్ష్యాలు నిర్ణయించుకోండి. ఆ లక్ష్యాలు సాధిస్తే మీరు ఎలా ఉంటారో ఆ విధంగా కనిపించే చిత్రాలు, మీరు ఇంకా ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో, మీతో , మీ ఫీలింగ్స్ తో బాగా అనుసంధానంగా ఉన్న చిత్రాలు కత్తెర తో కట్ చేసుకుని పక్కకి పెట్టుకోండి.

స్టెప్ 2: మీ ముఖ్యమైన కొన్ని గోల్స్ కోసం చేస్తున్నారా? బరువు తగ్గడం, పుస్తకం రాయటం, జాబు సంపాదించటం, ఇల్లు కట్టడం వంటి ఏదైనా ఒక ప్రత్యేక మైన ఫలితాన్ని ఆశిస్తూ చేస్తున్నారా అనే దానిని దృష్టిలో పెట్టుకుని మీ విజన్ బోర్డ్ సైజ్ నిర్ణయించుకోండి.

స్టెప్ 3: మీ లక్ష్యాలకు, మీరు మీ జీవితంలోకి ఆకర్షించాలనుకుంటున్న అన్ని అంశాలను తెలియజేసేలా ఉన్న చిత్రాలను కత్తెర సహాయంతో కట్ చేసి పక్కకి పెట్టుకోండి. అలా మొత్తం జీవితంలోని అన్ని విషయాలకు / జీవిత ప్రాధాన్యాలకు (categories or priorities or dimensions of life) సంబంధించిన చిత్రాలు కట్ చేసిన తర్వాత మీ బోర్డులో ఎక్కడ దేనిని అతికించాలో పెట్టి చూసుకోండి. అవసరాన్ని బట్టి పదాలు లేదా మాటలు లేదా స్టేట్ మెంట్స్ కొన్ని  తెల్ల కాగితం పై స్కెచ్ పెన్ లతో రాసుకోండి. బోర్డు మధ్యలో లేదా పై భాగంలో కొంత ఖాళీ మీ అందమైన , మీరు ఆత్మ విశ్వాసంతో ఉన్న ఆకర్షణీయమైన ఫోటో, నా విజన్ బోర్డ్ అని టైటిల్ ఎక్కడపెట్టాలో నిర్ణయించుకుని అన్ని చిత్రాలు గ్లూ స్టిక్ తో అంటించండి. వీలైతే  మీకు బాగా  ఇన్ స్పైరింగ్ గా అనిపించే చిత్రాలు మాత్రమే ఒక దాని పక్కన ఒకటి పెట్టి నచ్చిన విధంగా అతికించండి. అన్ని ఒకే సైజ్ చిత్రాలు ఉండాలని లేదు. ఒక్క విషయం గుర్తుంచుకోండి ఆ చిత్రాలు చూస్తే మీకు తక్షణం ఆ విధంగా మిమ్మల్ని నడిపించేలా ఆ చిత్రాలు ఉండాలి. మీరు రాసుకునే పదాలు, మాటలు కుడా శక్తి వంతంగా ఉండేవి ఎన్నుకోండి. ఈ విధంగా మీ విజన్ బోర్డ్ సిద్దమైనట్లే. కావాలంటే మీకు నచ్చిన కలర్ పేపర్స్ తో , పదాలతో ఇంకా ఆకర్షణీయంగా చేసుకోండి. వీలైనంత వరకు మీ బోర్డ్ లో మీ సొంత ఫోటోలు వాడండి. మీరు ప్రస్తుతం లావుగా ఉంది ఆరోగ్యంగా అవ్వడం మీ లక్ష్యం పెట్టుకుంటే, ఎత్తుకు తగ్గ బరువు ఉన్న నాజూకు ఫోటో తీసుకుని తల ప్రదేశంలో మీ ఫోటో పెట్టి మీరే అలా ఉన్నట్లు ఇమేజ్ చేసుకొని అతికించుకోండి. సొంత చిత్రాలు మీ మైండ్ పై అత్యంత ప్రభావాన్ని చూపుతాయి.

మీ విజన్ బోర్డ్ ఎలా వాడుకోవాలి :

సినిమా హీరో లు హీరోయిన్ల ఫొటోస్ ఇంట్లో పెట్టుకునే వారు చాలా మంది ఉన్నారు.  మీ జీవితాన్ని అర్ధవంతంగా నిర్మించుకోడానికి మీఫోటో తో, మీ విజన్ బోర్డ్ పెట్టుకుంటే తప్పేమీ లేదు. ఇది మీ లైఫ్ , మీ లైఫ్ కు మీరే  కింగ్, మీ సామ్రాజ్యానికి  మీరే మహారాణి కాబట్టి సిగ్గు పడొద్దు. ఎవరేమనుకుంటారో అని దాచిపెట్టొద్దు. మీ ఫస్ట్ రూమ్ లో, మీ బెడ్ రూమ్ లో లేదా ఏదైనా మీరు నిత్యం చూసే ప్లేస్ లో పెట్టండి.
  •  విజువలైజేషన్ మరియు ఫీలింగ్స్: ప్రతి ఉదయం మీ కాలకృత్యాలు, మెడిటేషన్, శారీరక వ్యాయామం అయిపోయాక స్నానం చేసి ప్రశాంతంగా 5 నిమిషాలు మీ విజన్ బోర్డ్ చూడండి. దానిలో చిత్రాల్లో ఉన్నట్లుగా మీ జీవితం అందంగా, ఆనందంగా, విజయవంతంగా రూపుదిద్దుకున్నట్లుగా (transform) ఊహించుకోండి. అలా ఊహించినప్పుడు మీలో కలిగే భావనలు, ఫీలింగ్స్ ద్వారా మీరు ఈ సృష్టిలోకి ఒక తరంగాలు (వైబ్రేషన్స్)  విడుదల చేస్తారు. అవి ఇంకా ఎక్కువ అటువంటి ఫీలింగ్స్ సృష్టించేలా జీవితాన్ని మార్చుకునేలా మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. వాటిని మీ జీవితంలోకి త్వరగా ఆహ్వానిస్తుంది.
  • చిత్రాల యంత్రంలో మాటల మంత్రం: అవును . విజన్ బోర్డ్ మీరు ఆశించిన ఫలితాలని మీ వైపు ఆకర్షించడానికి, మీ సబ్ కాన్షియస్ మైండ్ ని ప్రోగ్రాం చేయడానికి శక్తి వంతమైన చిత్రాల రూపం అయితే వీటికి తోడు మిమ్మల్ని నడిపించే అత్యుత్తమమైన మాటలు, ఉత్ప్రేరక పదాలు చదవటం ద్వారా, బొమ్మలకు అనుసంధానంగా పాజిటివ్ అఫిర్ మేషన్స్ ద్వారా మీ లక్ష్యాలపై  మీ అంతర్గత శక్తులను కేంద్రీకరించవచ్చు. అందుకే మీ విజన్ బోర్డ్ చూస్తూ సాధించినట్లు ఊహించుకున్నట్లే, వాటిని చూస్తూ మీ పాజిటివ్ అఫిర్ మేషన్స్ చదవండి. మననం చేసుకోండి.
  • ఒక పన్నెండు నెలల ఆట. ఈ విజన్ బోర్డ్ లో మరో పన్నెండు నెలలో సాధించాల్సిన ఫలితాలకొరకు చేసుకోండి. అయితే ప్రతి రోజు పై మూడు స్టెప్ లలో చెప్పిన విధంగా చేయండి. అయితే ఆ పనిని ఒక రోజు చేస్తే సరిపోదు. మీ జీవితంలో భాగం ఐపోయే వరకు చేయాలి. అదేంటి నేను చేసినవి వెంటనే అవ్వలేదు అనుకోవద్దు. కచ్చితంగా అవుతున్నాయి, ఇంకా బాగా చేయాలంటే నేను ఏమి నేర్చుకోవాలి అని ఆలోచిస్తూ మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఈ విజన్ బోర్డ్  ఎక్సర్ సైజ్ లు చేయండి. మీలో , మీ మైండ్ లో ఉన్న కొత్త శక్తులు మీకు పరిచయం అవుతాయి. పై మూడు పద్దతులద్వారా ఎక్కువకాలం మీ లక్ష్యాలు గుర్తుంటాయి, ఫలితాలకోసం పనిచేయాలనే తపన మీలో ఉంటుంది ఎందుకంటే చూస్తూ, చదువుతూ, ఊహించుకుంటూ నేర్చుకుంటే ఎడ్గార్ డేల్ (Edgar Dale) శాస్త్రవేత్త చెప్పినట్లు మనిషి 50% కి పైగా నేర్చుకుంది గుర్తుంచుకో గలడు. అందుకే ఒక సంవత్సరం కమిట్ మెంట్ తో చేయండి.    
 
మీ విజన్ బోర్డ్ తయారీలో అవసరం అయితే సాఫ్ట్ కాపీస్  ఇమేజెస్ తీసుకుని కంప్యూటర్ లో చేయించుకొని కూడా మీ ఇంట్లో వాల్ మీద లేదా వుడ్ వర్క్ చేసిన డోర్ మీద పెట్టించుకోవచ్చు. పిన్ బోర్డ్ వాడితే ఇమేజెస్ ని పిన్ లతో పెట్టాల్సి వస్తుంది. కాని అవి ఊడిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి.

అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు భక్తులు, పవిత్ర రమజాన్ మాసంలో మహమ్మదీయ సోదరులు 40 రోజులు ఉపవాసం దీక్ష ఉంటారు. చాలా మంది చెడు అలవాట్లు మానేయ గలుగుతారు. దీనికి ఒక సైకలాజికల్ కారణం ఉండకపోలేదు. ఏదైనా పని 21 రోజులు చేస్తే అది జీవితంలో భాగం అయ్యే (అలవాటు) అవకాశం ఉంది. అలాంటిడి మీ విజన్ బోర్డ్ చేసిన తర్వాత ఎక్సర్ సైజ్ లు ఆరు వారాలు 42 రోజులు చేయండి ఇది మీ జీవితంలో భాగ అవటమే కాకుండా ఇంకా ఉన్నతంగా చేయటం ఎలా అనే ఆలోచనలు వస్తాయి, మీ పై మీకు నమ్మకం పెరుగుతుంది.

 ********
"సైకాలజీ టుడే" మాస పత్రికలో  నేను రాస్తున్న  న్యూ లైఫ్ కాలమ్ లో జూలై 2014 కోసం  ప్రచురింపబడిన ఆర్టికల్