Monday 16 June 2014

అందరిలా కాదు, భిన్నంగా సృష్టించండి - Create Differently


రాస్తాచే లారిదఅం...?




“ఎలా ఉన్నారు?”
బాగున్నాను.

“హౌ అర్ యు?”
ఐ యాం  ఫైన్.

వందల వేల సార్లు అందరికీ మనం చెప్పే సమాధానం. అయితే నిజంగా మనం అంతర్గతంగా బాగున్నామా? లేదా? అన్నది మనకి తెలుసు. అంటే  మీ లోపల మీరు ఎలా ఉన్నారో మీకు మాత్రమే తెలుస్తుంది. అనేక సార్లు ఎక్కువ మంది ప్రజలు లోపల ఎలా ఉన్నా బయట బాగున్నామని చెబుతారు. వారి హృదయానికి, మెదడుకి మధ్యలో ఉన్న నోరు ఆ రెండింటిలో ఉన్నదానిని కాకుండా వేరేలా పలికిస్తుంది. మరి మీరు అందరిలా ఉండాలనుకుంటున్నారా? మీరు కుడా అందరిలా చేస్తారా? నలుగురితో పాటు మనం నడవాలి కదా? అందుకే పదండి ఇష్టం వచ్చినట్లు అందరిలా !

  • ఈ శీర్షిక రాసే సమయానికి ప్రపంచ జనాభా 723,10, 60, 595 (ఏడొందల ఇరవై మూడు కోట్ల పదిలక్షల అరవై వేల ఐదొందల తొంబై ఐదు ) మంది. ఒక సర్వే ప్రకారం వీరిలో 97 % మంది లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిని పుస్తకంలో రాసుకోరట, కేవలం 3% మందే చేసే పని మనం చేయటం ఎందుకు? అందుకే  లక్ష్యాలు నిర్దేశించుకోకండి.  అందరితో కలిసి బతకాలి కదా? అలాంటిది మనకంటూ ఒక జీవిత ఉద్దేశ్యం ఎందుకు మళ్ళీ కొత్తగా?
  • ఒక రోజులో మనిషికి దాదాపు 60,000 (అరవై వేలు) ఆలోచనలు వస్తాయని ఒక అంచనా కాబట్టి మీకూ  అన్ని ఆలోచనలు వస్తాయి. అందులో దాదాపు 85% మీ గురించి మీరే ఆలోచిస్తారు. అందులో 80% నెగటివ్ గానే  ఆలోచిస్తారు. ఆ నెగటివ్ ఆలోచనలను అలాగే కొనసాగించండి. ఇంత మంది ప్రజానికానికి లేనిది మనం కొత్త ప్రయోగాలు చేయడం దేనికి? ఆలోచనలు మార్చుకోడం దేనికి? అందరిలా ఆలోచించండి.
  • ఒక పని చేయాలంటే ఒక స్థాయికి చేరాలంటే వయసు,  అనుభవం ఉండాలి. లియోనార్డో డావిన్సి 51 సంవత్సరాల వయసులో ప్రఖ్యాత చిత్రం మోనాలిసాని చిత్రించాడు, 52 సంవత్సరాల వయసులో అబ్రహం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు, 62 సంవత్సరాల వయసులో కల్నల్ హాలండ్ సాండర్ సన్ కే.ఎఫ్.సి. స్థాపించాడు. అంటే యాభై లేదా అరవై సంవత్సరాల వయసులో మనిషికి ఎదిగే  అవకాశం వస్తుందన్న మాట ! ఏంటీ?  తక్కువ వయసువాళ్ళు కూడా కొంత మంది సక్సెస్ అయ్యారు అంటున్నారా? అబ్బే అదంతా అదృష్టం అండి. వాళ్ళకి ఒంట్లో, ఇంట్లో, ఇంటికున్న వాస్తులో , బడిలో, గుడిలో,  దేశంలో బాగా కలిసి వచ్చింది అందుకే కొందరు చిన్నోళ్ళు కూడా గొప్ప వాళ్ళు అయ్యారు. మరికొందరు ఈ మధ్య సాఫ్ట్ వేర్ లాంటి కిటుకులు పట్టుకుని ఎదిగారు. అంతే. ఇప్పటివరకు చిన్న వయసులో మనం గొప్ప వాళ్ళు  కాకపోతే అవ్వడానికి ఎదురుచుద్దాం. వయసు యాభై లేదా అరవైల్లోకి  వచ్చే వరకు ఆగుదాం, అవసరమైతే డెబ్బై , ఎనభై ల వరకు వెయిట్ చేద్దాం. ఎందుకంటే ప్రతి కుక్కకి ఒక రోజు ఉంటుంది.  మనం ప్రత్యేకించి ఏమీ  చేయవలసిన అవసరం లేదు.
  • సాధారణ వ్యక్తికంటే ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కేవలం 20% అదనంగా ఆనందంగా ఉంటారట, పెళ్లి చేసుకున్న వాళ్ళు చేసుకొని వారికంటే కేవలం 10% మాత్రమే అదనంగా సంతోషంగా ఉంటారట. అంటే ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. 20 % మందిలో ఉండడం కోసం ఎందుకు ఉదయాన్నే ఇంట్లోవాళ్ళని, పక్కింటి వాళ్ళని డిస్టర్బ్  చేస్తూ నిద్ర లేవటం, ఎక్సర్ సైజ్ చేయటం? కేవలం 10% మందిలో ఒకరిలా ఉండటం కోసం సరైన వయసులో పెళ్లి చేసుకోవటం ఎందుకులెండి. చూద్దాం, చేద్దాం అనే అనుకుందాం. ఎందుకంటే మనకంటే ముందు అలా అనుకున్న వాళ్ళు కూడా కొందరు చేసేసుకున్నారుగా?
  • ఐక్య రాజ్య సమితి వారు విడుదల చేసిన ప్రపంచ ఆనందమైన దేశాల లిస్టు లో మన దేశం 111వ స్థానం లో ఉంది. 98% శారీరక జబ్బులు కూడా మానసిక ఆలోచనల వలనే కలుగుతున్నాయి అంటారు. అయితే మాత్రం దానిని మార్చే ప్రయత్నం మనమేం చేస్తాము చెప్పండి? ఆరోగ్యం , ఆనందం, ధ్యానం , పటిష్ట కుటుంబ వ్యవస్థ , సామాజిక సమానత అంటూ తిరిగితే ఇంట్లో పనులు , బయటి పనులు చక్కబెట్టేది ఎవరు? ఆనందకర సమాజం మంచి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అదే వస్తుంది. మనలో మన కుటుంబంలో కూడా వాళ్ళే మార్పులు తెస్తారు అందుకే మనం అందరిలా, మన పని మనం చేసుకుపోదాం. చట్టం (గవర్నమెంట్) తన పని తాను చేసుకుపోతుంది.
  • 90% మనల్ని నియంత్రించేది  సబ్ కాన్షియస్ మైండ్ అంటారు. మీకు కనిపించని మైండ్ శాసిస్తుంది, కనిపించే మీ శరీరం పాటిస్తుంది. అయితే కాన్షియస్ గా దానిని మీరు  ఎదో చేద్దాం అనుకుంటే ఏమి లాభం చెప్పండి. మన చేతిలో లేనిది, బుర్రలో ఎలా ఉంటుంది అందుకే అందరిలా దాని పని అది చేయనివ్వండి.
  • 70% మంది ప్రజలు కంఫర్ట్ జోన్ మాయాజాలంలో ఉండిపోతారు, మానసికంగా తమ శక్తి యుక్తులకు పరిధులు తామే విదించుకుంటారు, తమ మానసిక భయాలు సమస్యకంటే ఎక్కువ బాధ పెడుతున్నా వ్యతిరేకదిశలోనే పారిపోతారు. అందుకే ప్రత్యేకించి మీరు కొత్త పుస్తకాలు, కొత్త ప్రయత్నాలు, కొత్త వారిని కలుసుకోవటం వంటి ప్రయత్నాలు చెయ్యలేదని అనుకోకండి. అందరిలాగే మనం. అందరిలాగే మీరు కుడా మీరు గీసుకున్న అలవాటైన చట్రంలో ఉండండి. ఇప్పుడు సడన్ గా  బయటికి అడుగు వేసి చేసేదేముంది?
  • 90% మనల్ని నియంత్రించేది  మన అలవాట్లు అంటారు. నెలకి ఒక పుస్తకం చదవటం, ప్రణాళిక ప్రకారం రాసుకుని జీవించటం, నెలకి ఒకసారి మీ పనిని రివ్యూ చేసుకోటం,  కోచింగ్ తీసుకోవటం, శిక్షణా కార్యక్రమాలకి , సెమినార్ లకు వెళ్ళటం, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటివి కొన్ని సంవత్సరాలుగా లేని అలవాట్లు. ఇప్పుడు ఆ చిత్రమైన అలవాట్లు ఎక్కడినుంచి వస్తాయి. అయినా అలా చేస్తేనే మేధావులు అయ్యారా?
నా ఆర్టికల్స్ లో ఎప్పుడు ప్రస్తావించని అంశాలు, చర్చిస్తున్నట్లు అనిపిస్తుందా? ఈ భూమి మీద కొన్ని కోట్ల మంది చేసే పనులు చెప్తున్నారు, అది కాదు కావలసింది అనుకుంటున్నారా? నేను అందరిలో ఒకడినే కానీ, గొర్రెల మందలో ఒకదిని కాదు అనుకుంటున్నారా? అందరిలా కాదు భిన్నంగా జీవించాలి అనుకుంటున్నారా? నేను భిన్నమైన వ్యక్తిని అనుకుంటున్నారా?  ఆశించిన అద్భుతాలు సాధించాలనుకుంటున్నారా? మీ జీవిత స్థితిలో ఉన్నత మార్పులు, మీ కుటుంబంలో తద్వారా సమాజంలో ఆరోగ్యకరమైన , ఆనందమైన ప్రభావాన్ని సృష్టించాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ క్రింది పనులు చేయండి. ఇదీ ఈ నెల  అందించే అతి చిన్న పెద్ద ఎక్సర్ సైజ్ (Small is Big).
ఒక్క క్షణం మీ జీవితం గురించి ఆలోచించండి.
ఒక్క గంట మీరు కోరుకుంటుంది ఎలాంటి జీవితమో రాయండి.
ఒక్క రోజు మీరు కోరుకున్నట్లు జీవించండి
ఒక్క నెల ఈ ప్రక్రియ కొనసాగించండి

ఒక్క సంవత్సరం మీరు ఆశించిన జీవితాన్ని సృష్టిస్తూ, నమ్మకంతో మీ జీవన ప్రాధాన్యాలపై దృష్టి కేంద్రీకరించి పని చేయండి.

*********
"సైకాలజీ టుడే" మాస పత్రికలో  నేను రాస్తున్న  న్యూ లైఫ్ కాలమ్ లో జూన్ 2014 కోసం  ప్రచురింపబడిన ఆర్టికల్