Saturday 9 April 2016

బిగ్ బిజినెస్ సృష్టించడానికి 5 మెట్లు [ Five Steps To Create A Big Business ]

“మా కళ్ళ  ముందే చిన్న పనులతో ప్రయాణం మొదలుపెట్టాడు, కళ్ళు మిరుమిరుమిట్లు గొలిపే విజయం సాధించాడు”
“ఏదో బ్రతకడానికి బజ్జీల బండి పెట్టుకున్నాడు, ఇప్పడు బిజినెస్ లో  బాగా దూసుకెళ్ళిపోతున్నాడు”
“ఆవిడ పాపం తప్పనిసరి పరిస్థితుల్లో ఇంట్లోనే మిషన్ కుట్టి కుటుంబాన్ని పోషించేది, ఇప్పుడు వాళ్ళ కుటుంబం మొత్తం రకరకాల వ్యాపారాలలోకి వెళ్ళిపోయారు” ....ఇలాంటి నిజమైన సక్సెస్ స్టోరీస్  మీరు వినే ఉంటారు.
మీ చుట్టూ ఉన్న కొందరి రియల్ స్టోరీస్ గమనించినపుడు మీరు ఇలాగే ఫీల్ అయి ఉంటారు. మరి వారికి అద్భుత విజయం ఎలా సాధ్యమైంది? అందరిలా మొదలుపెట్టి, అందరికంటే ముందుగా, ఇతరులు ఊహించనంతగా సక్సెస్ సాధించిన వారు ఏమి చేసారు? వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? చిన్న వ్యాపారం నుంచి బిగ్ బిజినెస్ సృష్టించాలంటే ఎక్కవలసిన ఆ ఐదు మెట్లు ఏమిటి? ఇటు వ్యాపానికి, అటు ఉద్యోగానికి... ముఖ్యంగా ఉన్నత జీవితానికి ఉపయోగపడే ఆ ముఖ్యాంశాలేమిటో చూద్దాం.
***    ***    ***    ***    ***    ***
చిన్న వ్యాపారం మొదలుపెట్టటం, దాని ద్వారా వినియోగదారులకు ఉన్నత సేవలు, వస్తువులు అందించడం, వారి సమస్యలకు విలువైన సోల్యూషన్స్ ఇవ్వటం, అందుకు వారినుంచి డబ్బుని తీసుకోవటం అనేది ధైర్యవంతమైన పని. ఎంట్ర ప్రెన్యూర్ చేసేది అదే. మనలో చాలా మంది తమకు నచ్చిందని, ఆ ఏరియా లో ఎవ్వరు పెట్టలేదని, ఇతరులు  ఆ వ్యాపారంలో బాగా సంపాదించారని, తక్కువ పెట్టుబడితో వీలైందని, రిస్క్ లేని వ్యాపారం అని ఇలా రకరకాల కారణాలతో వ్యాపారం మొదలు పెడతారు. కానీ రోజువారి పనులు, పరిస్థితులు, నిజంగా ఆ ప్రోడక్ట్ అవసరం  స్థాయి (ఎవరికి , ఎప్పుడు, ఎక్కడ), ఆ ఫీల్డ్ లో ఇప్పటికే ఉన్న వారు సృష్టించిన కల్చర్, మారుతున్న ఆర్ధిక పరిస్థితులు, టెక్నాలజీ రెవల్యూషన్ వంటి ప్రభావాల వలన ఉన్న అభిరుచి, ప్యాషన్ కాస్త తగ్గే అవకాశం ఉంది. మీ లక్ష్యాల జర్నీ నుంచి ట్రాక్ పక్కకు లాగినట్లు, మీ ప్రయత్నాల దారిలో అడ్డంకులు వేసినట్లు రియాలిటీ కాస్త ఊహకు తేడాగా కనిపించొచ్చు. అనుభవ రాహిత్యం, ఇంకాస్త ప్రయత్న లోపం వలన లాభాలు తగ్గొచ్చు. ఒకోసారి అప్పటికే లాభాల కోసం ముందుకు వెళుతున్న పరిస్థితుల్లో , మళ్ళీ తిరోగమనం దిశగా వెళ్ళొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ ఐదు ముఖ్యమైన మెట్లు ప్రతి చిన్న వ్యాపారస్తుడు అర్థం చేసుకోవాలి , అధిరోహించాలి.


సోపానం 1: నేర్చుకోవడం ఎప్పటికీ ఆగదు       
ట్రైనింగ్ ప్రోగ్రాం లలో తరచు అడిగే ఒక ప్రశ్న .
మీలో ఎవరికి మార్పు కావాలి? అందరు చేతులు ఎత్తుతారు.
మీలో ఎవరు మారడానికి సిద్దంగా ఉన్నారు? .......కాసేపు సైలెన్స్.
ఆ సైలెన్స్ కి ముఖ్య కారణాలు రెండు.
  1. 90% పైగా ప్రజలు “మారడానికేముంది నేను అన్నీ కరెక్ట్ గానే చేస్తున్నా కదా?”  అనుకోవడం. ఇది వాస్తవమా? కాదా? తెలుసుకోలేకపోవటం.
  2. నా రిజల్ట్ ఇలా ఉండడానికి కారణం ఏమిటి అంటే.....”  అంటూ కారణాలు వెతుక్కోవటం.  
ఇంకొంచం నిశితంగా గమనిస్తే ....
పాయింట్-1 ప్రకారం మారడానికి ఏమి లేదు అనుకుంటే , మరి మీకు రిజల్ట్ బాగా వచ్చి ఉండాలి. వస్తుందా? ఒకరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదేమో, కాని మనల్ని మనం మోసగించుకోకూడదు మిత్రులారా? వ్యాపారం ఐనా జీవితం అయినా అకౌంటబిలిటీ ముఖ్యం, సెల్ఫ్- అకౌంటబిలిటీ చాలా ముఖ్యం.
ఇక పాయింట్-2 ప్రకారం మీకు రిజల్ట్ రాకపోడానికి కారణాలు వెతుక్కుంటూపోతే  ఉదయం నిద్రలేకపోవడానికి కారణం రాత్రి మా వీధిలో కుక్కలు మొరగటమే కారణం అన్న వద్ద మొదలై వర్షాకాలం వర్షం చిరాకు, ఎండాకాలం వేడి, బస్సులలో రద్దీ...ఇలా పెద్ద లిస్టు  చెప్పుకోవచ్చు. కేవలం ఫైల్యుర్స్ కి  కారణాలు కనుక్కుంటే వ్యాపారాలు నిర్మించలేము. తెలివైన ఎస్కేపిస్ట్ స్థితిని దాటి ఫలితాలకు బాధ్యత వహించే వ్యక్తిగా మారాలి. అందుకే మా ట్రైనింగ్ కార్యక్రమాలలో చెప్తుంటాము మీ busyness నిజమైన బిజినెస్ గా మార్చుకోండి అని.
చాలా వ్యాపారాలలో (కొన్ని కార్పొరేట్ కంపెనీలు  కూడా) మా ఉద్యోగస్తులకి రెండుగంటలు, ఒక పూట / ఒక్క రోజు మోటివేషన్ కావాలి అంటారు. మోటివేషన్ అంటే ట్రైనింగ్ కి మరో పేరు అనో, మోటివేషన్ అంటే ట్రైనింగ్ అనో అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాస్త అవగాహన ఉన్న కొందరు ఒక వారం ట్రైనింగ్ ఇప్పిస్తారు. గొప్ప పాఠం ఏమిటంటే మీ  సిబ్బంది అందరికీ , మీకూ నిరంతరం శిక్షణ (ట్రైనింగ్ ) అవసరం. ఇది ఒక నిరంతర ప్రక్రియ. దీనికి రెండు పెద్ద సవాళ్ళు  ఏమిటంటే సమయం (టైం), శిక్షణ ఖర్చు (మనీ). సమయాన్ని అడ్డంకి అనుకుంటే మీ ఎంప్లాయిస్ రోజువారీ పనులలో  ఉపయోగపడే స్కిల్ల్స్ నేర్చుకుని , ఇతరులకు నేర్పడం అనేది వారి బాధ్యతలలో భాగం చేయండి. 

సోపానం 2: విషయజ్ఞానం ఇవ్వండి, నిరదారితంగా చెప్పొద్దు         
ఈరోజుల్లో అతిగా మార్కెటింగ్ చేస్తే అది గోల గోల గా చేసినట్లు ఔతుంది. మార్కెటింగ్ అంటే మీ ప్రాముఖ్యతల గురించి, మీ సంస్థ కి వచ్చిన అవార్డ్ లు, గుర్తింపుల గురించి చెప్పటం కాదు మార్కెటింగ్ అంటే అవసరం ఉన్న వ్యక్తులతో బంధాన్ని ఏర్పరుచుకోవడం, వారి అవసరాలను మీరు ఎలా తీరుస్తారో , ఎంత ఉన్నతంగా ఆ పని చేయగలరో చెప్పడం. అందుకు విషయ జ్ఞానం ఇవ్వాలి . మోటివేషన్ కొన్నాళ్ళే ఉంటుంది, అయితే ఎక్కువ కాలం బిజినెస్ ఉండాలి, ఉన్నతంగా ఎదగాలి అంటే కొన్ని విధానాలు టీం కి నేర్పగలగాలి అందుకు ప్రతినెల శిక్షణ అవసరం అని చెప్పడానికి కారణం ఇదే. ఉన్నత మార్కెటింగ్ అనేది విషయజ్ఞానం ఇస్తుంది, ఒప్పిస్తుంది, నమ్మకంగా సర్వీస్ , ప్రోడక్ట్  వినియోగించేలా చేస్తుంది. ఇతర సంస్థలు కూడా మీరు ఇచ్చే సర్వీస్ ఇస్తూ ఉంటాయి. కేవలం మా వద్ద కూడా ఫలానా సర్వీస్ లు ఉన్నాయని ఊక దంపుడు ప్రకటనలు గుప్పించి  తక్కువ నాణ్యత అందించే వారు కొన్నాళ్ళు మార్కెట్ లో ఉన్నా తర్వాత కనుమరుగై పోతారు. అలాంటి  పోటీదారులు ఉన్నచోట ఉన్నతమైన ఆశయంతో, కనీస నాణ్యతతో, సృజనాత్మక విధానాలతో, ఉన్నత వినియోగదారుల సేవతో మీరు రాణించవచ్చు. ఇందుకు నిబద్దత అవసరం. 

సోపానం 3:  సేల్స్ అనేది చెడు మాట కాదు          
నిజానికి ఒక చిన్న వ్యాపారం లేదా సంస్థ లో ఉన్న ప్రతి వ్యక్తి సేల్స్ లో ఉన్నట్లు, లేదంటే ఖచ్చితంగా సేల్స్ కి వ్యతిరేక డిపార్టుమెంటు లో ఉన్నట్లే. అవును చేదు మందులా ఉన్నా , ఇది వ్యాపార ఆరోగ్యాన్ని కాపాడే వాస్తవం. ఒక వ్యక్తి తన బాధ్యతల్లో సేల్స్ కి ఎలా దోహదపడుతుందో తెలుసుకోవాలి. ఒక టీచర్ తన క్లాసు లో ఉన్న పిల్లలతో ఎలా ఉంటున్నారు అనేది ఆ పిల్లలు ఇంటికి వెళ్లి స్కూల్ గురించి ఎలాంటి ముచ్చ్చట్లు షేర్ చేస్తారు అనేది ఆధారపడి ఉంటుంది. మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తే, ఆ ప్రభావం ఉన్నతంగా ఉంటుంది. అది పేరెంట్స్ లో తర్వాతి విద్యా సంవత్సరంలో  అక్కడే చదివించాలా వద్దా అనే నిర్ణయానికి దోహదం చేస్తుంది. ఈరోజుల్లో ఏదో ఒకటి చేసి  ప్రోడక్ట్ , సర్వీస్ ని అంటగట్టే వాళ్ళు సేల్స్ లో ఉండలేరు. ఇప్పుడు కస్టమర్ కి ఎక్కువ విషయ పరిజ్ఞానం ఉంది, అవసరమైతే సామాజిక మాధ్యమాలలో, ఆన్ లైన్ లో మీ గురించి, మీ సర్వీస్ గురించి, మీకు మీ కాంపిటీటర్ కు వ్యత్యాసం గురించి తెలుసుకుని వస్తారు. ఇప్పుడు సేల్స్, మార్కెటింగ్ వ్యక్తికి కావలసింది పెద్దమొత్తం లో - ఎదో ఒకటి చెప్పి- అమ్మే వాళ్ళు కాదు. స్పష్టంగా అవసరమైన ప్రశ్నలు వేస్తూ, కస్టమర్ అవసరాలు మనసుతో తెలుసుకుని, వారి అవసరాలకు ప్రోడక్ట్ ఇచ్చే సొల్యూషన్ ని మ్యాచ్ చేసి ఒప్పించగల వాళ్ళు, కస్టమర్ ఆనందంగా నిర్ణయాలు తీసుకునేలా చేయగలవారు, సంస్థ పై నమ్మకాన్ని కస్టమర్ మనసులో ముద్రించ గలవారు. ప్రోడక్ట్ గురించి ఊదర గొట్టే నాలెడ్జ్ మాత్రమే కాకుండా కస్టమర్ నిజమైన అవసరాలు ఏమిటి, వాటిని ఎలా చేరుకోగలరు అనే సంభాషణ ఉన్నతంగా చేయగలవారు.



సోపానం 4:  మీ బ్రాండ్ తో జీవించండి           
కాకినాడ కాజా, హైదరాబాద్ బిర్యాని, గుంటూరు మిర్చి చాలా గుర్తింపు ఉన్న మాట మనందరికీ తెలిసిందే. కాని ఒక్క సారి ఈ ప్రదేశాలకు వెళ్ళాక కొత్త వారికి కూడా ఇంకోటి తెలుస్తుంది.
కాకినాడ కోటయ్య స్వీట్స్, హైదరాబాడ్ పారడైస్ బిర్యాని, గుంటూరు కోమల విలాస్.....బ్రాండ్ గుర్తింపు అంటే ఇది.  మీ ప్రాంతంలో మీరు ఎంచుకున్న ప్రోడక్ట్ , సర్వీస్ కు ఒక బ్రాండ్ నేమ్ గా గుర్తింపు రావాలి. అందుకు ప్రయత్నించాలి. చిన్న వ్యాపారం ఉన్న వాళ్ళకి కొందరికి ఈ పదాలు తెలియవు. కొందరు జనాల్లో గుర్తుండిపోయేలా క్రియేటివ్ గా కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. ఎవరు బ్రాండింగ్ చేస్తారో వాళ్ళతో ప్రజలు బాండింగ్ (బంధాలు) కొనసాగిస్తారు. ఎవరికి బంధాలు ఎక్కువ ఉంటాయో వారికి బిజినెస్ బాగుంటుంది. మీ బ్రాండింగ్ అనేది మీకు అద్దం (మిర్రర్) వంటిది. ఇది మీ నిజ ప్రతిరూపం వంటిది అలాగే కస్టమర్స్ తమని తాము అందులో  చూసుకోడానికి మీతో కలిసిపోడానికి అవకాశాన్ని ఇస్తుంది. తమకి ఎదురైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక్కొక్క కస్టమర్ మీ బ్రాండ్ గురించి ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది. అందుకే మీ వెబ్ సైట్, మీ బిజినెస్ కార్డు, మీ ఆఫీస్ లో ఎంప్లాయిస్ మాట్లాడే విధానం, మీ ప్రోడక్ట్,  సర్వీస్  తర్వాత మీరు ఇచ్చే సేవలు అన్నీ జాగ్రత తీసుకోండి. అందమైన, ఉన్నత మైన అనుభవంలా ఇచ్చే ప్రయత్నాలు చేయండి.

సోపానం 5:  సరైన సమయం కోసం వెయిట్ చేయకండి              

మిస్టేక్స్ జరిగితే ప్రోత్సహించండి. విచిత్రంగా ఉందా ? అవును అప్పుడే కదా ఎదో కొత్తదనంగా  ప్రయత్నం చేస్తున్నారు అని తెలిసేది. అందుకే మీ టీం క్రియేటివ్ గా పనిచేసేలా ప్రోత్సహించండి. ఆ ప్రయత్నాలకు అభినందించండి. అంతే కాదు ఘోరమైన వైఫల్యాలు తర్వాతే విషయాలు నేర్చుకుని మరోలా ప్రయత్నిస్తారు. కాపోతే  మిస్టేక్స్ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోకుండా ఇది ఒక పాఠం అంటూ నెలలు, సంవత్సరాలు గడపకుండా జాగ్రత్త పడాలి. అసలు ఏ ప్రయత్నం చేయకుండా , ఫెయిల్ అవుతానేమో అని స్తబ్దంగా కూర్చుంటే వ్యాపారం కూడా స్తబ్దంగా ఉండిపోతుంది. మీరు గమనించారా చిన్న హోటల్స్ లో ఒకోసారి ఇడ్లి రెండు, వడ ఒక్కటి ఇమ్మంటే ప్రతి ఐటెం ఖచ్చితంగా 4 తీసుకోవాలిసిందే అంటారు. కస్టమర్ అవసరాలు ఏంటో ఆలోచించరు, కస్టమర్ కి ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ఇస్తున్నారో అసలు గుర్తించరు. ఇంకా బాగా ఎదగాలంటే ఏమి చేయాలో ఆలోచించరు. అందుకే అంతే ఉంటారు. ఉన్నతంగా ఎదగాలంటే ప్రయత్నాలనుంచి వచ్చిన ఫలితాలు తట్టుకోగాలగాలి, ఇంకా ప్రయత్నించాలి. సరైన సమయం కోసం వెయిట్ చేయకూడదు. తక్కువ సమయంలో ఎక్కువ ప్రయత్నాలు చెయ్యాలి. ఆశించిన ఫలితాలు రావాలంటే ఎలాంటి ప్రయత్నం చేయాలో అర్థం చేసుకోగలగాలి. అందుకు ఫ్లెక్సి బిలిటీ ఉండాలి. నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉండాలి, చేస్తూ నేర్చుకోవాలి, నేర్చుకుంటూ ఎదగాలి.  

Five Steps To Reach Startup To Big Business:
1. Learning never ends in entrepreneurship
2. Be sincere to educate the customer / end-user
3. Sales is not bad word. Every one in small business is a sales person, other wise in anti-sales department
4. Create a brand identity with whatever resources you have
5. Don't wait for right time to come. Create every moment as the best moment in getting things done.

***  ***  ***  సైకాలజీ టుడే, ఏప్రిల్ 2016 లో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***  ***