Sunday 29 April 2018

యంగ్ ఎంట్ర ప్రెన్యూర్స్ పాటించాల్సిన నాలుగు సూత్రాలు


ఎంట్రప్రెన్యూర్ షిప్ ఒక అందమైన, ఆకర్షవంతమైన స్టైలిష్ పదం.  
ఈ మధ్య కాలంలో “ఉద్యోగం ఎవరు చేస్తారు, మనమే ఉద్యోగాలిద్దాం” అనే మైండ్ సెట్ ఉన్న యువత తమ పేరు చివరిలో ఎంట్రప్రెన్యూర్, సి.ఈ.ఓ., సి.యఫ్.ఓ, కో- ఫౌండర్ అని పెట్టుకోవాలని కలలు కంటున్నారు. కలలు నిజం అవ్వాలంటే ఐడియా నుంచి ప్రోడక్ట్ సర్వీస్ మార్కెట్ చేసే వరకు, కాష్ ఫ్లో నుంచి కమ్యూనికేషన్స్ వరకు అనేక స్కిల్ల్స్ కావాలి. టెక్నాలజీ రంగంలో అయితే సరైన అప్డేటెడ్ టెక్నాలజీ మరియు ఫ్యూచర్ మార్కెట్ పై నిర్దిష్ట ముందు చూపు ఉండాలి. మరి ఏ అనుభవం లేని యువత ఎంట్రప్రెన్యూర్షిప్ లో అడుగులు వేయాలంటే ఎలా? ఈ కీలక అంశాలను తెలియజేయడానికే ఈ ఆర్టికల్.
***    ***    ***    ***    ***    ***
తాళికట్టేముందు పెళ్ళికొడుకు కాస్త వణుకుతున్నాడట, అయ్యగారు ఏమిటి అన్నట్లు చూసాడట. “ఇదే సార్ నాకు మొదటిసారి పెళ్లి” అన్నాడట ఆ కుర్రాడు కంగారుగా. నవ్వుకోడానికే చెప్పినా ఎంట్ర ప్రెన్యూర్ విషయంలో సీన్ కూడా అచ్చం ఇలాగే ఉంటుంది. ఏ బిజినెస్ పర్సనైనా మొదటి అడుగులు వేసిన క్షణం లో ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు.  తన గోల్, తన వద్ద ఉన్న ఐడియా, దాని ద్వారా లాభం పొందే కస్టమర్లు, అందుకు తనకి వచ్చే డబ్బు పై కాస్త ఊహాత్మక   విజయాన్ని ఆశిస్తూ రూడిగా గెలుస్తామని తెలియక పాయినా నమ్మకంగా అడుగులు వేసినవారే. ఒకోసారి సక్సెస్, ఒకోసారి ఫెయిల్యూర్ ఎదురౌతుంది. కానీ ప్రతి ఫెయిల్యూర్ ని ఒక బిజినెస్ లెస్సన్ లా స్వీకరిస్తూ, తక్కువ తప్పులతో ఎక్కువ ఫలితాలు ఎలా సాధించాలా అని ఆలోచించటమే ఎంట్రప్రెన్యూర్షిప్ మైండ్ సెట్. మరి అనుభవలేమిని దాటి ఎంట్రప్రెన్యూర్షిప్ లో అద్భుతాలు చేయాలంటే ఏమి చేయాలి?

1.     సక్సెస్ ఐన వారి నుండి నేర్చుకోండి

ఏది కావాలన్నా గూగుల్ లో వెతుకుతున్నారు నేటి యువత. 
అయితే మీరు చేయాలనుకునే బిజినెస్ లాంటిదే ఇతరులు చేసి సక్సెస్ అయ్యారంటే మీరు వారివద్దనుంచి నేర్చుకోవచ్చన్న మాట. అందుకు సిగ్గు పడాల్సిన పనిలేదు. మీరు కూడా కస్టమర్లను మంచి సర్వీస్ తో చేరుకోవాలంటే అలా చేరుకుంటున్న వారు ఎలా ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసారు ? ఎలాంటి రిస్క్ ఊహించారు? తీరా ఫీల్డ్ లోకి వెళ్ళిన తర్వాత ఏమైంది? ఇవన్నీ నేర్చుకోవచ్చు. డైరెక్ట్ గా లేదా ఇంటర్ నెట్ లో, సోషల్ మీడియా ద్వారా, ఫోన్ లేదా ఈ-మెయిల్ ఇలా ఏ మాధ్యమం అయినా సరే మీకు కనీస అవగాహన ఇవ్వగలిగేది కొత్త వారు కాదు ఆల్రెడీ ఆయా అంశాలలో లేదా దానికి దగ్గరగా ఉన్న ప్రాజెక్ట్ లో పనిచేసిన వారు. అందుకే గతంలో సక్సెస్ అయినవారినుంది నేర్చుకోండి. కొన్ని వారి పద్దతులను, రిపీట్ గా అవలంభించే మార్కెటింగ్ విధానాలు చెప్పకుండా కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే వెళ్లి కలిసి మాట్లాడితే ఒక మంచి బంధం ఏర్పడుతుంది.


2.     ఐడియా మార్కెట్ అవసరాలను తీర్చాలి
“నాకు వద్ద మంచి బిజినెస్ ఐడియా ఉంది, ఎవరికే చెప్పలేదు, చాలా డిఫరెంట్ ఐడియా, చెపితే కాపీ కొట్ట్టేస్తారేమో అని చెప్పలేదు” అంటూ తమ ఐడియాస్ మా బిజినెస్ కోచింగ్ సెషన్స్ లో మాట్లాడుతుంటారు. నిజానికి భూమి మీద అదే మొదటి ఆలోచన అనేటంత గొప్ప ఐడియా నేను ఇంతవరకు వినలేదు. కాపోతే కొత్తలో ఎంట్రప్రెన్యూర్ అలా ఫీల్ అవుతారన్నమాట. ఆ తర్వాత వారికి ఐడియాని షేర్ చేయటం కాదు, వాటిని టెస్ట్ చేయాలి, మార్కెటబిలిటీ తెలుసుకోవాలి, అసలు ఐడియా కంటే ప్లానింగ్ తో దానిని ఆచరణలో పెట్టడంలోనే   అసలు సక్సెస్ ఉంది అని చెప్పగానే వెంటనే ఫ్రీ గా మాట్లాడతారు. మీ వద్ద ఒక తియ్యని ఐడియా ఉంటే, అర్జెంటు గా దాని అవసరం ఈ ప్రపంచానికి, మార్కెట్ కి ఉందా? ప్రజల జీవితానికి అది ఎలా ఉపయోగపడుతుంది? ఈ కాలంలో ఎందరు వాటిని వాడతారు వంటి ప్రశ్నలకు జవాబు రాబట్టే ప్రయత్నం చేయాలి.

3.     మీరే ఒక కస్టమర్ లా ఆలోచించండి
నేను ఎంట్ర ప్రెన్యూర్ ని అని కాకుండా, మీరు సృష్టించబోయే ప్రోడక్ట్ , సర్వీస్ ని వాడే వ్యక్తిగా ఆలోచించండి. అప్పుడు ఏం కోరుకుంటారు? అప్పుడు మీ కాస్ట్ ఎలా ఉంటుంది? ఆ సమయంలో ఇలాంటి ( మీ  సర్వీస్/ ప్రోడక్ట్) తో ఒక వ్యక్తి వస్తే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అలాంటి సర్వీస్ తో అదనంగా, మీకు సౌకర్యంగా ఉండాలంటే ఇతర అంశాలలో మార్పులు ఏం కావాలి?  సర్ రిచర్డ్ బ్రాన్సన్ మహాశయుడు అదే అంటారు. “నేను బిజినెస్ పనిమీద అమెరికా వెళ్ళేవాడిని. అక్కడకు వెళ్ళే విమానాలు, ఆ కంపెనీల సర్వీస్, తోటి ప్రయాణికుల ఇబ్బందులు గమనించి “వర్జిన్ అట్లాంటిక్” సంస్థ పెట్టాము.  మొదటిలో ఈ ఫీల్డ్ లో మాకు ఎలాంటి  అనుభవం లేదు. కస్టమర్ మేమే అయితే సర్వీస్ ఎలా ఉండాలి అని అలోచించి కావలసిన మార్పులు చేసాము. “వచ్చింది రా బాబు మళ్ళీ ఒక కొత్త (సుత్తి) కంపెనీ” అని ప్రజలకు విసుగనిపించని విధంగా సర్వీస్ చూడటం చాలా అవసరం. ఎంట్రప్రెన్యూర్ మేధావులు చెప్పే మరో మాట మీరు చెప్పిన దానికంటే ఎక్కువే చేయటం తెలిసిన వారిని మీ టీం లో చేర్చుకోండి , వారికి ఫ్రీడమ్ , బాధ్యత అప్పచెప్పండి. కానీ మొదటి వంద కస్టమర్స్ మీరే తెచ్చుకునే ప్రయత్నం చేయండి.    

4.     వనరులను ఉన్నతంగా వాడుకోండి

డబ్బు, సమయం, నైపుణ్యం, టాలెంట్.....ఏదైనా; మీ, మీ బృంద సభ్యులు ఏ వనరులు అయినా వాటిని మీ లక్ష్యం తగినట్లు వాడండి. పరిస్థితులకు తగ్గట్లు పనిచేయండి, మీ ఫోకస్ అవుట్ పుట్ మీద ఉండేలా చూడండి, కొత్త అంశాలు పరిగణనలోకి తీసుకోడానికి రెడీ గా ఉండండి. నేర్చుకునే తత్వం , రిస్క్ తీసుకునే తత్వం చాలా ముఖ్యం. వనరుల లేమి ఒత్తిడిని తీసుకువస్తుందని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు, అందుకే మీ ప్రాజెక్ట్ మీద నమ్మకం, మీ భయాలను మించి ప్రాక్టికల్ గా ఉండాలి. ఈ స్థితికి రావాలంటే వనరుల వినియోగం , రిస్క్ లెక్కకట్టటం, ఛాలెంజ్ ని ఓపికతో పేస్ చేయటం తెలియాలి. వనరులను వాడటం తెలిస్తే మీరే ప్రాజెక్ట్ కి పెద్ద వనరు (రిసోర్స్) అవుతారు.

 ***  ***  ***  సైకాలజీ టుడే, అక్టోబర్  2017 లో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***  ***