Saturday 17 May 2014

మిమ్మల్ని మీరు ఉన్నతంగా నిర్వచించుకోండి

                                                                   స్వయం నిర్వచనం అంటే:
ఈ ప్రపంచంలో జరుగుతున్న గొప్ప అద్భుతాలను గుర్తించగలిగే మనస్తత్వం మనకు ఉండాలిగానీ సృష్టిలో ఎన్నో అద్భుతాలు ప్రతిక్షణం జరుగుతూనే ఉంటాయి. అలాగే మీరు కోరుకున్న ఫలితాలు సాధించగలరని నమ్మాలి. మిమ్మల్ని ప్రత్యేకమైన వ్యక్తిగా నిలిపే 20 అంశాలను, మీరు సాధించిన 20 వ్యక్తిగత విజయాలను మీ పర్సనల్ నోట్ బుక్ లో రాయండి. ఆ లిస్టు ఒకసారి చదవండి. అవన్నీ సాధించడానికి ముందు కూడా మీరు వాటిని సాధిస్తానా లేదా అని అనేక అనుమానాలతో అలోచించి ఉంటారు, వాటిని సాధించిన తర్వాత మీపై మీకు నమ్మకం పెరిగి ఉండవచ్చు, ఓహ్ ఇంతేనా ఇది చాలా తేలికైన అంశం అనుకోని ఉండొచ్చు, ఆ అంశాల సాధ్యాసాధ్యాలపై మీరు కొత్త నమ్మకాలను ఏర్పరుచుకొని ఉండవచ్చు. మీ జీవితంలో అద్భుతాలు జరగాలంటే మిమ్మల్ని మీరు అద్భుతమైన వ్యక్తిగా నిర్వచించుకోగలగాలి. అందుకు కావలసిన మానసిక ప్రక్రియే “స్వయంనిర్వచనం” (సెల్ఫ్ డెఫినిషన్). మిమ్మల్ని మీరు ఎలా నిర్వచించుకుంటున్నారు? మిమ్మల్ని మీరు ఎలా ఐడెంటిఫై చేసుకుంటున్నారు? బయటి ప్రపంచంతోను, మీతో మీరు ఎలా ఉంటున్నారు? మీ గురించి మీరు ఎటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నారు? ఈ అంశాలను గమనిస్తే తెలిసేదే  “స్వయంనిర్వచనం”(సెల్ఫ్ డెఫినిషన్). మీ సాధ్యాసాధ్యాలు అనేవి మీకు మీరు ఇచ్చుకునే  నిర్వచనానికి సమానంగా ఉంటాయి. ఇప్పుడు చెప్పండి మిమ్మల్ని మీరు ఎలా నిర్వచించుకుంటున్నారు? మీ స్వయం నిర్వచనం ఏమిటి?
మీ స్వయంనిర్వచనమే  మీ జీవితం:

స్వయంనిర్వచనం అనేది చిన్నప్పుడు పెట్టుకున్న రంగుల కళ్ళజోడుతో సమానం. మీకు పండుగలోనో, యాత్రలలోనో, మీ ఊరి దగ్గరలో జరిగే జాతరలోనో కొనుక్కున్న రంగుల కళ్ళజోడు గుర్తుందా? అది ఏ రంగు అద్దాలుతో తయారు చేస్తే మీకు ప్రపంచం మొత్తం ఆ రంగులో కనపడుతుంది. మీ అక్క , చెల్లెలు, అమ్మ, నాన్న, ఇల్లు, వాకిలి, వస్తువులు, ఊరు, ప్రపంచం మొత్తం అదే రంగు. అలాగే మీ స్వయం నిర్వచనం , మీ సాధ్యాసాధ్యాలపై , మీ శక్తి పై మీ నిర్వచనం రంగు అద్దాల కల్లజోడులా పనిచేస్తుంది. మీరు ఒక చిన్న జాబు చూసుకొని బతుకుదాం అనుకుంటే “అదే నా స్థాయి” అని నిర్వచించుకుంటే ఆ క్షణం నుంచి మీ కల, మీ లక్ష్యం  జాబు సంపాదించడమే  అవుతుంది. మీ స్థాయి ఒక మంచి కంపెనీ లో మేనేజర్ గా నిర్వచించుకుంటే మీరు ఆ దిశలో జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలా అని ఆలోచిస్తుంది. మిమ్మల్ని మీరు ఒక కంపెనీకి ఓనర్ గా నిర్వచించుకుంటే మీ మెదడు వెంటనే నూతన సంస్థ స్థాపించటం ఎలా , అందుకు మన దేశంలో ఉన్న పద్దతులు ఏమిటి? అటువంటి సంస్థ పెట్టాలంటే ఎటువంటి అనుభవం కావాలి అందుకు నేనేం చేయాలి అని ఆలోచిస్తుంది. అంటే మీరు ఏ స్థితిలో ఉన్న , ఉన్నత స్వయంనిర్వచనం కలిగి ఉంటే మీ నిర్వచనానికి తగినట్లు మిమ్మల్ని నడిపిస్తుంది మీ మెదడు. మీ నిర్వచనానికి తగిన ఛాయస్ లు, నిర్ణయాలు, అవకాశాలు మీరు అందిపుచ్చు కుంటారు. అంటే మీరు ఏ స్థాయిలో, ఎటువంటి వాతావరణంలో ఉన్నారన్నదానికంటే, మీరు పుట్టి పెరిగిన పరిస్తితులకంటే మిమ్మల్ని మీరు ఎలా నిర్వచించుకుంటున్నారు అనేది మీ జీవితాన్ని ఎక్కువ ప్రభావితం చేస్తుందన్నమాట. అంటే మీ బాహ్య ప్రపంచం కంటే అంతర్ ప్రపంచం మిమ్మల్ని ఎక్కువ నిర్మిస్తుంది. మీ అంతర్ ప్రపంచాన్ని బట్టి బాహ్య ప్రపంచంలో అంశాలు ఆవిష్కృతమౌతాయి.
మీ స్వయంనిర్వచనం ఎలా ఏర్పడింది:
  • మీ తల్లిదండ్రులు, మీ స్నేహితులు, మీ కేర్ తకెర్స్, టీచర్స్ , మీరు ఇప్పటివరకు కలిసిన మనుషులు
  • మీరు చదివిన పుస్తకాలు, మీరు చూసే సినిమాలు, మీరు హాజరైన సమావేశాలు, మీరు చదివే పుస్తకాలు, మీరు చూసే ప్రోగ్రామ్స్
  • మీ జీవితంలోని అనుభవాల్లోంచి మీరు సృష్టించుకున్న అర్థాలు, మీ నిర్వచనాన్ని ప్రభావితం చేసే అనేక అంశాలపై మీకు గల నమ్మకాలు
ఈ పై అంశాలన్నీ మీ స్వయం నిర్వచనాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే నిర్దాక్షిణంగా మీగురించి, మీ శక్తి సామర్థ్యాల గురించి, మీరు అందుకోగల అద్భుతాల గురించి, మీరు సృష్టించగల అర్థవంతమైన జీవితం గురించి, మీరు మాత్రమే ఈ ప్రపంచానికి అందించగల ప్రత్యేకమైన అంశం (అది మీ జీవిత కార్యం అయి ఉండొచ్చు!) గురించి మీ మనసులో రూపుదిద్దుకున్న నిర్వచనాలు పరిశీలించుకోండి, ఉన్నత నిర్వచనాలు అన్వేషించండి. మీ గురించి మీరు ఏమని చెప్పుకోడానికి ఆనందిస్తారు? ఏ విధమైన వ్యక్తిగా గుర్తించబడటానికి ఇష్టపడతారు?ఆలోచించండి. మీ ప్రస్తుత జీవిత పరిస్థితులు, మీ పై ప్రపంచం యొక్క ప్రభావం, మీ అనుభవాల వలన ఏర్పడిన అనవసర చట్రాల ప్రభావం వదిలేసి కాలాతీతంగా, మీ జీవిత కాలం తర్వాత కూడా మీరు ఎలాంటి వ్యక్తిగా గుర్తింపబడాలని ఆశిస్తున్నారు? నిర్మాణాత్మక జీవితం నిర్మాణాత్మక ఆలోచనల ద్వారా సాధ్యం. అందుకే ఈ మౌలిక ప్రశ్నలకు సమాధానాలు వెతకండి. మిమ్మల్ని మీరు ఈ క్రింది అంశాలను దృష్టిలో ఉంచుకొని ఉన్నతంగా నిర్వచించుకోండి.
  • ఈ ప్రపంచంలో మీరు మాత్రమే చేయగల అత్యున్నత కార్యక్రమాలు నిర్వర్తించడానికి మీరు జన్మించారు
  • ఎక్స్ లెన్స్ మీ జన్మ హక్కు . దానిని క్లెయిమ్ చేసుకోండి.
  • మీ జీవితంలో ప్రతి చిన్న అంశం , మీరు వాడే ప్రతి వస్తువు, మీరు కలిసే వ్యక్తులు, మీరు చేసే పనులు గుణాత్మకంగా (క్వాలిటీ తో ) కూడినదేనా, మీరు అత్యున్నతమైన వాటినే మీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నారా ?అలోచించుకోండి.
  • మీ జీవితానికి అత్యంత ప్రాధాన్యమైన అంశాలు ఫై మీ సమయాన్ని, శక్తిని  కేంద్రీకరిస్తున్నారా?
  • ఈ క్షణంలోనే మిమ్మల్ని మీరు ఒక అత్యున్నత వ్యక్తిలా మార్చగలిగే మీ స్వయం నిర్వచనం ఏమిటి? 
ఈ క్రింది ఎక్సర్ సైజు లు చేయండి. మీ గురించి మీరు ఉన్నతంగా మీరే నిర్వచించుకోండి.
  1. మీ గురించి మీకు కలిగిన ఐదు నెగటివ్ నిర్వచనాలు లేదా మిమ్మల్ని తక్కువ స్తాయిలో ఉంచి ఎదగకుండా ఉంచే మీ స్వయంనిర్వచనాలను పరిశీలించుకోండి. వాటి స్థానంలో ఉన్నత, నూతన  నిర్వచనాలు ఇచ్చుకోండి.
మీ ప్రతిబంధక నిర్వచనం
మీ నూతన స్వయంనిర్వచనం
ఉదా: నేను ఇంగ్లీష్ లో మాట్లాడలేను కాబట్టి నేను ఎదో ఒక జాబు చూసుకొని బతికితే చాలు.
ఉదా: ఇంగ్లీష్ భాష ప్రపంచంలో ఎందఱో మాట్లడుతునంరు. వారిలాగా నేను కూడా మాట్లాడగలను. నేను ఇంగ్లీష్ లో అద్భుతంగా మాట్లాడే కొందరిలో ఒకడిగా పేరు తెచ్చుకుంటాను.
ఇలా ఐదు  కనీసం నిర్వచనాలు రాయండి. ఇంకా ఎక్కువ రాస్తే మీ గురించి మీరు అంత వేగంగా ఉన్నత ఐడెంటిటీ సృష్టించుకోగలరు.
  1. నేను ______________వ్యక్తిగా ఎప్పటికి గుర్తుండి పోతాను.
నేను ______________వ్యక్తిగా నిర్మించుకుంటాను.
నేను ప్రతిక్షణం _______________కోసం కట్టుబడి ఉన్న వ్యక్తిగా గుర్తింపబడటం ఇష్ట పడతాను.
నా శక్తిని , నా సమయాన్ని నాకు అత్యంత ప్రాదాన్యాలైన ___________అంశాలపై కేంద్రీకరిస్తాను.
ఈ పై వాక్యాలలో మీరు ఎన్ని విధాలుగా మిమ్మల్ని మీరు నిర్వచించుకుంటారో ప్రతి వాక్యాని పూర్తిగా రాసుకొని రోజు ఒక సారి చదవండి.
౩. స్వయం నిర్వచనాలు పట్టుకోండి: ఈ రోజు నుంచి మూడు వారాలు మీ మనసులో వచ్చే ప్రతి స్వయం నిర్వచనా వాక్యానికి (స్వయం సంభాషణ  లేదా అంతర్వాణి లో) మిమ్మల్ని ఎదగనీయకుండా ఎదురయ్యే వాక్యాలను పరిశీలించుకొని వెంటనే మిమ్మల్ని ఉనతంగా నిర్వచించుకోండి. మీ ప్యాకెట్ లో ఒక చిన్న నోట్ బుక్ పెట్టుకుని మీ నిర్వచనాలను, కొత్తగా ఇచ్చుకున్న ఉన్నత నిర్వచనాలను రాసుకోండి. అయితే ప్రతి నిర్వచనాన్ని ఉన్నతంగా మార్చుకోవటం ఈ ఆటలోని ముఖ్యాంశం. మూడు వారాలలో అద్భుతాలు చూస్తారు. ఆలోచనలలో మార్పు, వ్యక్తిత్వంలో నిర్మాణాత్మక సర్దుబాటు గమనిస్తారు.

4. మిమ్మల్ని మీరు నిర్వచిన్చినట్లుగా , మీ మనసులూని మీ అర్థాన్ని , మీ జీవితాన్ని ప్రతిబింబించేలా ఉన్న బొమ్మలను మీ నోట్  బుక్ లో లేదా జర్నల్ లో  అంటించండి. ఆ బొమ్మలు మీ సబ్ కాన్షియస్ మైండ్ ని ప్రోగ్రాం చేస్తాయి. 
*************
"జీవన వికాసం " మాస పత్రికలో  నేను రాస్తున్న  విశిష్ట జీవనం  కాలమ్ లో ఫిబ్రవరి  2014 కోసం  ప్రచురింపబడిన ఆర్టికల్ 

No comments:

Post a Comment