Wednesday, 7 May 2014

శూన్యంలో కూడా విజయం అందించే జీరో రేసిస్టంట్ కోషంట్ (జీ. క్యూ.)

శూన్యంలో కూడా విజయం అందించే  జీరో రేసిస్టంట్ కోషంట్ (జీ. క్యూ.) 

చదువు, ఉద్యోగం, పెళ్లి, ఆరోగ్యం, ప్రేమ, వ్యాపారం, పేరు ప్రతిష్టలు, సామాజిక ఉన్నతి, ఆధ్యాత్మిక వికాసం, ఇలా ఏ విషయం లో అయినా ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎవరు చేసినా ఏం ఫలితాలు సాధిస్తారు?

ఒక క్షణం ఆలోచించండి: 
మీరు ఇప్పుడు కోరుకున్న ఫలితాలకోసం, మీ లక్ష్యాలు మీ కలలు నిజం చేసుకోడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. రోజులు, నెలలు, సంవత్సరాలు...ఇలా ఎన్నాళ్ళు చేస్తారు?
మీరు కోరుకున్న ఫలితం సాధించడంలో పదే పదే విఫలమవుతున్నప్పటికీ ఎన్ని సార్లు ఆ దిశలో ప్రయత్నిస్తారు?
ఊహించిన ఫలితానికి వ్యతిరేకంగా దుష్ఫలితాలు మాత్రమే ఎదురౌతుంటే ఎంతకాలం జీవితాన్ని ఎదురీదుతారు?
మీ శారీరక శ్రమ , మానిసిక ఆరోగ్యం, మీ భావోద్వేగాలు, మీ శక్తి, మీ డబ్బు ..ఇలా మీ జీవితమే ఆశించిన ఫలితాల అన్వేషణలో కరిగిపోతుంటే మీరు ఏమి చేస్తారు? ఆ క్షణంలో మిమ్మల్ని మీరు ఎలా చూస్తారు? ఆ క్షణంలో మీరు గానీ, మనిషి అని పిలువబడే ఏ వ్యక్తి అయినా తాను ఉన్న నిరాశ, నిస్పృహ, నిస్సత్తువలో , వరుస వైఫల్యాలతో కేవలం ఆలోచనలో ఎదో సాధించాలని ఉన్నా, ఏమి సాధించలేని నిస్సహాయ స్థితిలో తమని తాము ఏ స్థితిలో ఉన్నామని స్వీకరించుకుంటారు? తమ పరిస్థితిని ఏమనుకుంటారు? ఈ ప్రశ్న అడిగితే " ఏముందండీ జీవితం శూన్యం" అన్నారు ఇటీవలి నా శిక్షణా కార్యక్రమంలో కొందరు. ఈ ప్రపంచంలో నా జీవితాన్ని ఈ అంశంలో  ఇంతకంటే మార్చలేను అనే శూన్య స్థితినే  జీరో బేస్డ్ స్థితి అంటారు. మీకు జీవితంలో కొన్ని విషయాలలో అలాగే అనిపించి ఉండొచ్చు. ఖచ్చితంగా ఆరోగ్యం, ఇల్లు, పిల్లలు, చదువు, భాగస్వామి విషయంలో, మీ ఆఫీసులో తోటి ఉద్యోగులు లేదా మీ బాస్ విషయంలో , మీ డబ్బు సంపాదనా మార్గం, స్థాయి విషయంలో ...ఇలా ఎదో ఒక అంశంలో ఈ  శూన్య స్థితిని  (జీరో బేస్డ్ స్థితి) అనుభవించి ఉంటారు. ఆ స్థితి మీకు ఎలా కలిగింది అన్నది కాదు ముఖ్యం, ఆ స్థితిని మీకు మీరు ఎలా కమ్యూనికేట్ చేసుకుంటున్నారన్న దానిపై మీ ఎక్స్ లెన్స్ ఆధారపడి  ఉంటుంది. ఓక మనిషి ఎంత ఉన్నత కుటుంబంలో ఉన్నా, ఎంత చదువుకున్నా, ఎన్ని ఆస్తి పాస్తులు కలిగి ఉన్నా, ఎదో ఒక సమయంలో ఎదో ఒక అంశంలో ఈ జీరో స్టేట్ అనుభవిస్తాడు. మన జీవితాలను అత్యంత వేగంగా, ఉన్నతంగా ఈ శూన్య స్థితి నుంచి ఉత్తమంగా తీర్చిదిద్దుకొని ఆశించిన ఫలితాలు సాధించాలంటే జీరో ఫాక్టర్ గురించి తెలుసుకోవాలి. ఇంకా విపులంగా చెప్పాలంటే జీ.క్యూ. (జీరో స్టేట్ రేసిస్టంట్ కోషంట్) అర్థం చేసుకోవాలి.

జీరో స్థితిని తట్టుకోగలిగే స్థాయి: 
మీరు ఇప్పటివరకు ఐ.క్యూ. గురించి ఈ.క్యూ గురించి మాత్రమే  విని ఉంటారు. ఈ ప్రపంచంలో ఈ విషయంలో నన్ను ఎవరు అర్థం చేసుకోవటంలేదు , నేను చేయగలిగింది ఇక ఏమి లేదు, ఇంతకన్నా మరో మార్గం లేదు అని శూన్య స్థితి అనుభవిస్తున్న ఒక సంఘటన / అంశం గుర్తుతెచ్చుకోండి. ఇప్పుడు చెప్పండి. ఆ అంశంలో మీ జీ. క్యూ. ఎంత? 1 నుంచి 10 మార్కుల స్కేల్ లో మీ జీ.క్యూ. స్కోర్ ఎంత? మీలో జీరో స్థితిని తట్టుకునే స్థాయి ఎంత? ఒక్కసారి కళ్ళు మూసుకుని ప్రశాంతంగా మూడు సార్లు దీర్ఘంగా శ్వాస పీల్చుకోండి. మెల్లగా వదలండి. చెప్పండి. మీరు అత్యంత ప్రయత్నాలు చేసినా , విఫలమైనా మళ్ళీ మళ్ళీ వైఫల్యాలు వస్తే ఎంత వరకు తట్టుకోగలరు? చాలా మంది ఈ ప్రశ్న అడగగానే బ్లాంక్ ఫేస్ తో చూస్తారు. "అన్ని ప్రయత్నాలు చేసాము కదా. ఇంకేముంది సార్ జీరో స్టేట్ కదా ఇక అలా అడ్జస్ట్ అయ్యి ఉండాలి" అంటారు. కొందరు ఆథ్యాత్మిక నమ్మకాలపై ఆధారపడతారు. మరి మనిషి తన ఆలోచనలే పెట్టుబడిగా ఈ జీ.క్యూ పెంచుకోవాలంటే ఏమి చెయ్యాలి? అత్యంత దారుణ పరిస్థితుల్లో ఉన్నవ్యక్తి కొన్నాళ్ళకి  "ఆ రోజుల్లో ఇలా ఆలోచించాను. చాల విచిత్రంగా ఉందే. అది అసలు సమస్య కానే కాదు." అనుకొని నవ్వుకునే స్థాయికి ఎలా ఎదగాలి?

జీరో ఫాక్టర్ అర్థం చేసుకోండి:
సున్నాకి విలువెంత? ఈ ప్రశ్న చదివి నవ్వుకుంటున్నారా? సున్నా విలువ శూన్యం.
అయితే సున్నాని వేర్వేరు విధాలుగా ఈ క్రింది ఉదాహరణలో ఉపయోగించాము. అప్పుడు కుడా దాని విలువ శూన్యమేనా? గమనించండి.
10           - పది 
20           - ఇరవై 
200         - రెండొందలు 
2860       - రెండువేల ఎనిమిది వందల అరవై 
89060     - ఎనభై తొమ్మిది వేల అరవై 
786540   - ఏడు లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల                       నలభై 

సున్నా విలువ శూన్యం ఐనప్పటికీ దానిని ఉపయోగించే విధానంలో దాని విలువ మారిపోతుంది. జీవితంలో మీరు శూన్య స్థితి అనుకునే జీరో బేస్డ్  స్టేట్ కుడా అంతే. మీరు దానిని ఎలా అర్థం చేసుకొని మీ అంతర్గత మానసిక శక్తులను ఉపయోగించుకుంటారు అన్నదానిపై భవిష్యత్తులో మీ ఎక్స్ లెన్స్ ఆధారపడి ఉంటుంది. అంటే మనిషి నిజమైన అంతర్గత శక్తులు ఈ జీరో స్టేట్ లో ఉపయోగించుకోచ్చు. అంతర్గత శక్తులు, మానసిక ధైర్యం, ఆలోచన జ్ఞానం, విచక్షణా భరిత ప్రవర్తన, భావోద్వేగాలపై నిర్మాణాత్మకమైన పట్టు మీరు జీరో స్టేట్ లో సాధించగలరు. అందుకే మీరు "ఇన్ని కోట్ల మందిలో నేను కూడా ఒకడినే దానికేముందిలే" అనుకోకుండా " ఇన్ని కోట్ల మంది మనుషులు, వేల కోట్ల ప్రాణులు సృష్టించబడ్డ ఈ ప్రపంచంలో నేను కుడా సృష్టించబడ్డాను  అంటే నేను మాత్రమే నిర్వహించగలిగిన ఒక జీవిత కార్యం ఉందని, జీరో స్టేట్ నాలోని అద్భుత శక్తుల్ని వెలికితీసి మీ జీవిత కార్యానికి దగ్గరగా ప్రయాణించే మార్గంలో లభించిన అవకాశమని" నమ్మాలి.   శూన్య స్థితి (జీరో స్టేట్ ) పర్మినెంట్ కాదు. జీవితం ఒక సంఘటన కాదు, ప్రయాణం. తాత్కాలిక ఫలితాలు భిన్నంగా ప్రవర్తించలేని వారికే వస్తాయి. ఒక సంఘటన, ఒక వ్యక్తి, మీరు చుసిన మాట్లాడిన సమాజంలోని వ్యక్తులు మాత్రమే మీ అనుభవాన్ని ముడివేసి ఇది ఇంతే అని, నా జీవితం ఇంతే అని, నాది శూన్య స్థితి అని ఆగిపోవాల్సిన అవసరం లేదు. ఈ స్థితిలో ఎన్ని కొత్త విధానాలలో మిమ్మల్ని మీరు ఉన్నతంగా మార్చుకొని ప్రయత్నాలు చేయగలరో, ఎన్ని విధానాలలో ప్రయత్నించారో ఆలోచించండి. జీరో స్థితి అనేది శూన్యం కాదు. దానిని ఉపయోగించుకోగలిగితే మనిషి విజయ  శిఖరాలు అధిరోహించడానికి అదే తొలిమెట్టు అవుతుంది. జీరో ఫాక్టర్ ని అర్థం చేసుకోండి. ఎక్స్ లెన్స్ సా
ధించండి.
********
"సైకాలజీ టుడే" మాస పత్రికలో  మూడు సంవత్సరాలుగా నడపబడుతున్న నా న్యూ లైఫ్ కాలమ్ లో మార్చ్ 2014 కోసం  ప్రచురింపబడిన ఆర్టికల్ మీ కోసం. 
       


Tuesday, 6 May 2014

జీవితానికి అర్థాన్నిచ్చే “ఆ ఒక్క పని” చేయండి

జీవితానికి అర్థాన్నిచ్చే 
“ఆ ఒక్క పని” చేయండి

*******************
మనస్పూర్తిగా ఈ క్రింది ప్రశ్నలకు మీ జీవిత కోణంలోంచి సమాధానాలు అన్వేషించండి.
  • మీరు ఎవరు? మీరు ఈ లోకంలో ఏ ప్రత్యేకత కోసం సృష్టించబడ్డారు?
  • మీ జీవితం నుంచి మీరు  ఏమి ఆశిస్తున్నారు? ఏ ఫలితాలు కోరుకుంటున్నారు?
  • మీరు మాత్రమే ప్రత్యేకంగా చేయవలసిన కార్యక్రమాలు, ఈ ప్రపంచానికి అదించాల్సిన అంశాలు ఏమిటి?
  • ఏ ఫలితాలు కోరుకుంటున్నారో వాటిని సృష్టించడానికి ఇప్పటివరకు ఏ ప్రయత్నం చేసారు?
  • మీ జీవితంలో ఇప్పటివరకు ఎన్ని రకాల నిర్ణయాలు తీసుకున్నారు? ఎన్ని రకాల రంగాలలో లేదా వృత్తులలో మీ సమయాన్ని ఉపయోగించారు?
  • ఇప్పటివరకు ఏమి సాదించారు? సాధించిన దానితో మీరు ఎలా ఉన్నారు?
  • మిమ్మల్ని మీరు ఎలా స్వీకరిస్తున్నారు?
  • మీ జీవితం అంతిమ దిశలో మీరు, ఇతరులు మీ గురించి ఎలా అనుకుంటారని మీరు ఊహిస్తున్నారు?
  • మీ దృష్టిలో జీవితం అర్థం ఏమిటి? మీ జీవితం అర్థవంతంగా ఉండాలంటే మీరు ఏమి చేయాలనుకుంటున్నారు?
జీవితం తాలూకు ఇవి ప్రాథమిక ప్రశ్నలు. మిమ్మల్ని మీరు గతంలో ఈ విధంగా అడిగి ఉండవచ్చు లేదా అడగక పోయుండొచ్చు. కానీ ఇప్పుడు ఒక సారి మీ జీవితాన్ని మీ ఆలోచనలని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రశ్నలు అడగండి.
మీరు జన్మించినప్పటినుంచి, ఇప్పటి వరకు మీ జీవితం గురించి ఎన్నో  ఆలోచనలు వచ్చి ఉంటాయి? మీ చివరి వరకు ఇంకా ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఈ ప్రశ్నలకి సమాధానాలు వెతికినపుడు మీ పేరు, మీ ఇంటి పేరు, తల్లి దండ్రులపేరు, మీ అస్తిత్వం, మీ మతం, మీ ఉద్యోగం, మీ కంపెనీ లు, మీ దేశం, మీఋ జీవితంలో ఆపాదించుకున్న అన్ని”ఐడెంటిటీలు” ...ఇలా ఎన్నో సమాధానాలు , ఎన్నో లక్ష్యాలు మీ ఆలోచనలలో వస్తాయి. అయితే ఈ ఆలోచనలను ఉన్నతంగా అర్థం చేసుకోటం, వాటి ద్వారా తన జీవితానికి ఒక అర్థాన్ని నిర్మించుకోవడం విస్మరిస్తాడు. కానీ స్నేహితులారా, ఇది జీవితం. ఇది ప్రకృతి సృష్టి. ఇందులో మీరైనా నేనైనా, ఎవరైనా విస్మరిచడం ద్వారా దాటివేయలేము. సత్యాలను మనిషి మార్చలేదు. సత్యాలు, ప్రకృతి ధర్మాలు అర్థం చేసుకోవటం, పాటించడం మాత్రమే చేయగలం. అందుకే ఈ మౌలిక ప్రశ్నలకు మీ ఆలోచనా స్థాయిలో సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. ఆ సమాధానాల పరంపరలోంచి జీవితాన్ని అర్థవంతంగా మార్చుకునే ప్రయత్నం చేయండి. అదే మీ జీవిత కార్యం (లైఫ్ పరపజ్).

జీవిత కార్యం నిర్ణయించుకోవటం వలన లాభాలు:
మీ జీవిత కార్యాన్ని  మీ జీవిత ఫిలాసఫీ గా, మీ జీవిత అర్థంగా, అదే జీవితంగా ఒక స్పష్టత ఉన్నప్పుడు మీరు జీవించే ప్రతిక్షణం (కేవలం బ్రతికే క్షణం కాదు!) ఒక అద్భుతం అవుతుంది. మీ “జీవిత కార్యం” ఏమిటో తెలిస్తే, ఈ సృష్టి ఇచ్చిన ప్రత్యేక జన్మను సార్థకం చేసుకోడం మొదలుపెడతారు. మీ జీవిత కార్యం మీ కోరికలకు, కలలకు, మీ లక్ష్యాలకు మించిన విషయం. ఎప్పుడైతే మీ జీవిత కార్యం నిర్ణయించుకుంటారో, ఆ దిశలో ఉన్న కార్యక్రమాలు, ఆ మార్గంలోని వ్యక్తులు, ఆ అంశాలకు సంబంధించిన పుస్తకాలు మిమ్మల్ని తమవైపు ఆకర్షిస్తాయి.
  • మీ అంతర్గత శక్తులు మీకు పరిచయం అవుతాయి, మీలో ఉన్న అనంత జీవ శక్తి బయటికి వస్తుంది, మీరు అర్థవంతంగా జీవిస్తున్నారన్న ఆనందం మీలో స్పష్టంగా తెలుస్తుంది
  • మీ ప్రతిక్షణం నిర్మాణాత్మకంగా వినియోగించుకోవాలన్న స్పృహ ఏర్పడుతుంది.
  • ఒకే ఒక్క జీవిత కార్యం మీకు అత్యంత ఉన్నతమైన దృష్టి కోణాన్ని, ఓకే బృహత్ లక్ష్యాన్ని అందిస్తుంది. దానిపై ఫోకస్ తో పనిచేయటం మీ జీవిత ధ్యేయం అవుతుంది.
  • సంపూర్ణంగా ఉన్నతంగా గడిపే ప్రణాలికా బద్దమైన అలవాట్లు మీ జీవితంలో భాగమైపోతాయి
  • మీకు ఎవరిని కలవాలి, ఎవరితో ఉండాలి, ఎవరితో పనిచేయాలి, ఏ కార్యక్రమాలు చేయాలి, ఏం మాట్లాడాలి, మీరు ఎవరిని ప్రేమించాలి, ఏ ప్రదేశాలు చూడాలి, ఈ ప్రపంచానికి ఏమి అందించాలి వంటి అంశాలపై పూర్తి స్వాతంత్రం మీకు ఉంటుందిఅందుకే జీవితకార్యం (లైఫ్ పరపజ్) నిర్మించుకోండి. అందుకు ఈ క్రింది విధానాలు పాటించండి.
 మీతో మీరు : ఒక అద్భుత బంధం ఏర్పరుచుకోండి :
ప్రశాంతమైన ప్రదేశంలో మిమ్మల్ని ఇతరులు ఎవరు ఆటంకపరచని ప్రదేశంలో కూర్చోండి. ఒక పెన్, పర్సనల్ నోట్ బుక్ తీసుకుని పేపర్ పై ఈవిధంగా హెడ్డింగ్ పెట్టండి. “నా జీవిత కార్యం ఏమిటి?” (what is my life purpose?). ఈ హెడ్డింగ్ కింద మీకు  మీ సమాధానాలుగా వచ్చే అన్ని అంశాలు వ్రాయండి. మీకు కావలసిన అన్ని మెటీరియల్ అవసరాలు వ్రాయండి (ఇల్లు, కార్, బంగాళా, స్థలాలు, పొలాలు, సంస్థలు, బంగారం, షేర్ లలో వాటా, ఇన్సూరెన్స్), భావోద్వేగ అవసరాలు వ్రాయండి (ఆనందం, సంతృప్తి, నమ్మకం, ప్రేమించబడటం, స్వీకరించబడటం, కుటుంబంతో, స్నేహితులతో బంధాలు, బాలన్స్, ఉత్సాహం, మానసిక మద్దతు)...ఇలా అన్ని వ్రాయండి. మధ్యలో ఆటంకం వచ్చి , పని ఉంది ఆపితే మల్లీ మొదలు పెట్టండి. మీరు ఉన్నప్పుడు, ఈ కాలంతీతంగా, ఈ విశ్వంలో మీరు కోరుకుంటున్న అన్ని అంశాలు వ్రాయండి. మీరు మనసుకి వచ్చిన అన్ని అంశాలు వ్రాస్తూ వెళ్ళండి. సమాధానం వ్రాస్తున్న ప్రతి వాక్యం తర్వాత మల్లి హెడ్డింగ్ లో అడిగిన ప్రశ్న అడగండి.మీకు ఎన్ని పేజెస్ కావాలంటే అన్ని పేజెస్ లో వ్రాయండి. ఆపకండి. మీకు వచ్చే అన్ని ఆలోచనలను వ్రాయండి. ఒక రియలైజేషన్ తో కూడిన ఆలోచనతో మీకు ఏడుపు వచ్చే వరకు వ్రాయండి. అవును మీకు ఏడుపు తెప్పించే స్థాయి వచ్చే అంశాలు వచ్చే వరకు వ్రాయండి. ఆ క్షణంలో మీకు ఒక స్పృహ వస్తుంది, మీ శరీరం కొత్త అంతర్గత శక్తి నింపుకుంటుంది, మొఖం కాంతివంత మౌతుంది, మనసు కుదుట పడుతుంది. అదే మీ జీవిత కార్యం.

మరొక చిన్న ఎక్సర్ సైజ్ ఏమిటంటే మీకు వెయ్యి కోట్లు డబ్బు ఇస్తే, వాటిని మీ ఇష్టానుసారంగా ఖర్చు చేసుకునే స్వాతంత్రం ఇస్తే మీరు ఏమి చేస్తారు? ఏ పనులు చేయడానికి ఇష్టపడతారు? ఎవరిని కలుస్తారు? ఎవరితో ఉంటారు? ఏం పనులు చేస్తే ఆనందంగా ఉంటారు? మీ వాతవరణం ఎలా ఉంటుంది? ఇదే చివరి రానేల జీవితంలో అనుకుంటే అప్పుడు మీరు ఏమి చేస్తారు? ఎక్కడ ఉంటారు, ఏ విధంగా లైఫ్ గడపడానికి , ఎవారితో గడపడానికి ఇష్ట పడతారు? మీరు లైఫ్ లో ఖచ్చితంగా గెలుస్తారు, సక్సెస్ అవుతారు అనుకుంటే ఏమి చేస్తారు? ఎవరితో ఉంటారు? అనుకున్న పనులు తప్పక అవుతాయంటే ఏమి చేయడానికి ఇష్టపడతారు? ఎవరితో గడుపుతారు? ఎవరితో పనిచేస్తారు? ఏం కార్యక్రమాలు చేస్తారు? మీ జీవితకార్యాన్ని ఈ ప్రశ్నలతో కూడా చెక్ చేసుకోండి. మీ జీవితకార్యాన్ని నిర్ణయించుకోవడమే అన్నింటికంటే ముఖ్యమైన పని. ఆ ఒక్క పని చేయండి , జీవితాన్ని అర్థవంతంగా నిర్మించుకోండి, అద్భుతాలు చేయండి. ఎందుకంటే ఈ జీవితాన్ని మరోసారి జీవించలేము కదా?
********** 
"సైకాలజీ టుడే" మాస పత్రికలో  మూడు సంవత్సరాలుగా నడపబడుతున్న నా న్యూ లైఫ్ కాలమ్ లో ఫిబ్రవరి 2014 కోసం  ప్రచురింపబడిన ఆర్టికల్ మీ కోసం.