Tuesday, 6 May 2014

జీవితానికి అర్థాన్నిచ్చే “ఆ ఒక్క పని” చేయండి

జీవితానికి అర్థాన్నిచ్చే 
“ఆ ఒక్క పని” చేయండి

*******************
మనస్పూర్తిగా ఈ క్రింది ప్రశ్నలకు మీ జీవిత కోణంలోంచి సమాధానాలు అన్వేషించండి.
  • మీరు ఎవరు? మీరు ఈ లోకంలో ఏ ప్రత్యేకత కోసం సృష్టించబడ్డారు?
  • మీ జీవితం నుంచి మీరు  ఏమి ఆశిస్తున్నారు? ఏ ఫలితాలు కోరుకుంటున్నారు?
  • మీరు మాత్రమే ప్రత్యేకంగా చేయవలసిన కార్యక్రమాలు, ఈ ప్రపంచానికి అదించాల్సిన అంశాలు ఏమిటి?
  • ఏ ఫలితాలు కోరుకుంటున్నారో వాటిని సృష్టించడానికి ఇప్పటివరకు ఏ ప్రయత్నం చేసారు?
  • మీ జీవితంలో ఇప్పటివరకు ఎన్ని రకాల నిర్ణయాలు తీసుకున్నారు? ఎన్ని రకాల రంగాలలో లేదా వృత్తులలో మీ సమయాన్ని ఉపయోగించారు?
  • ఇప్పటివరకు ఏమి సాదించారు? సాధించిన దానితో మీరు ఎలా ఉన్నారు?
  • మిమ్మల్ని మీరు ఎలా స్వీకరిస్తున్నారు?
  • మీ జీవితం అంతిమ దిశలో మీరు, ఇతరులు మీ గురించి ఎలా అనుకుంటారని మీరు ఊహిస్తున్నారు?
  • మీ దృష్టిలో జీవితం అర్థం ఏమిటి? మీ జీవితం అర్థవంతంగా ఉండాలంటే మీరు ఏమి చేయాలనుకుంటున్నారు?
జీవితం తాలూకు ఇవి ప్రాథమిక ప్రశ్నలు. మిమ్మల్ని మీరు గతంలో ఈ విధంగా అడిగి ఉండవచ్చు లేదా అడగక పోయుండొచ్చు. కానీ ఇప్పుడు ఒక సారి మీ జీవితాన్ని మీ ఆలోచనలని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రశ్నలు అడగండి.
మీరు జన్మించినప్పటినుంచి, ఇప్పటి వరకు మీ జీవితం గురించి ఎన్నో  ఆలోచనలు వచ్చి ఉంటాయి? మీ చివరి వరకు ఇంకా ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఈ ప్రశ్నలకి సమాధానాలు వెతికినపుడు మీ పేరు, మీ ఇంటి పేరు, తల్లి దండ్రులపేరు, మీ అస్తిత్వం, మీ మతం, మీ ఉద్యోగం, మీ కంపెనీ లు, మీ దేశం, మీఋ జీవితంలో ఆపాదించుకున్న అన్ని”ఐడెంటిటీలు” ...ఇలా ఎన్నో సమాధానాలు , ఎన్నో లక్ష్యాలు మీ ఆలోచనలలో వస్తాయి. అయితే ఈ ఆలోచనలను ఉన్నతంగా అర్థం చేసుకోటం, వాటి ద్వారా తన జీవితానికి ఒక అర్థాన్ని నిర్మించుకోవడం విస్మరిస్తాడు. కానీ స్నేహితులారా, ఇది జీవితం. ఇది ప్రకృతి సృష్టి. ఇందులో మీరైనా నేనైనా, ఎవరైనా విస్మరిచడం ద్వారా దాటివేయలేము. సత్యాలను మనిషి మార్చలేదు. సత్యాలు, ప్రకృతి ధర్మాలు అర్థం చేసుకోవటం, పాటించడం మాత్రమే చేయగలం. అందుకే ఈ మౌలిక ప్రశ్నలకు మీ ఆలోచనా స్థాయిలో సమాధానాలను వెతికే ప్రయత్నం చేయండి. ఆ సమాధానాల పరంపరలోంచి జీవితాన్ని అర్థవంతంగా మార్చుకునే ప్రయత్నం చేయండి. అదే మీ జీవిత కార్యం (లైఫ్ పరపజ్).

జీవిత కార్యం నిర్ణయించుకోవటం వలన లాభాలు:
మీ జీవిత కార్యాన్ని  మీ జీవిత ఫిలాసఫీ గా, మీ జీవిత అర్థంగా, అదే జీవితంగా ఒక స్పష్టత ఉన్నప్పుడు మీరు జీవించే ప్రతిక్షణం (కేవలం బ్రతికే క్షణం కాదు!) ఒక అద్భుతం అవుతుంది. మీ “జీవిత కార్యం” ఏమిటో తెలిస్తే, ఈ సృష్టి ఇచ్చిన ప్రత్యేక జన్మను సార్థకం చేసుకోడం మొదలుపెడతారు. మీ జీవిత కార్యం మీ కోరికలకు, కలలకు, మీ లక్ష్యాలకు మించిన విషయం. ఎప్పుడైతే మీ జీవిత కార్యం నిర్ణయించుకుంటారో, ఆ దిశలో ఉన్న కార్యక్రమాలు, ఆ మార్గంలోని వ్యక్తులు, ఆ అంశాలకు సంబంధించిన పుస్తకాలు మిమ్మల్ని తమవైపు ఆకర్షిస్తాయి.
  • మీ అంతర్గత శక్తులు మీకు పరిచయం అవుతాయి, మీలో ఉన్న అనంత జీవ శక్తి బయటికి వస్తుంది, మీరు అర్థవంతంగా జీవిస్తున్నారన్న ఆనందం మీలో స్పష్టంగా తెలుస్తుంది
  • మీ ప్రతిక్షణం నిర్మాణాత్మకంగా వినియోగించుకోవాలన్న స్పృహ ఏర్పడుతుంది.
  • ఒకే ఒక్క జీవిత కార్యం మీకు అత్యంత ఉన్నతమైన దృష్టి కోణాన్ని, ఓకే బృహత్ లక్ష్యాన్ని అందిస్తుంది. దానిపై ఫోకస్ తో పనిచేయటం మీ జీవిత ధ్యేయం అవుతుంది.
  • సంపూర్ణంగా ఉన్నతంగా గడిపే ప్రణాలికా బద్దమైన అలవాట్లు మీ జీవితంలో భాగమైపోతాయి
  • మీకు ఎవరిని కలవాలి, ఎవరితో ఉండాలి, ఎవరితో పనిచేయాలి, ఏ కార్యక్రమాలు చేయాలి, ఏం మాట్లాడాలి, మీరు ఎవరిని ప్రేమించాలి, ఏ ప్రదేశాలు చూడాలి, ఈ ప్రపంచానికి ఏమి అందించాలి వంటి అంశాలపై పూర్తి స్వాతంత్రం మీకు ఉంటుందిఅందుకే జీవితకార్యం (లైఫ్ పరపజ్) నిర్మించుకోండి. అందుకు ఈ క్రింది విధానాలు పాటించండి.
 మీతో మీరు : ఒక అద్భుత బంధం ఏర్పరుచుకోండి :
ప్రశాంతమైన ప్రదేశంలో మిమ్మల్ని ఇతరులు ఎవరు ఆటంకపరచని ప్రదేశంలో కూర్చోండి. ఒక పెన్, పర్సనల్ నోట్ బుక్ తీసుకుని పేపర్ పై ఈవిధంగా హెడ్డింగ్ పెట్టండి. “నా జీవిత కార్యం ఏమిటి?” (what is my life purpose?). ఈ హెడ్డింగ్ కింద మీకు  మీ సమాధానాలుగా వచ్చే అన్ని అంశాలు వ్రాయండి. మీకు కావలసిన అన్ని మెటీరియల్ అవసరాలు వ్రాయండి (ఇల్లు, కార్, బంగాళా, స్థలాలు, పొలాలు, సంస్థలు, బంగారం, షేర్ లలో వాటా, ఇన్సూరెన్స్), భావోద్వేగ అవసరాలు వ్రాయండి (ఆనందం, సంతృప్తి, నమ్మకం, ప్రేమించబడటం, స్వీకరించబడటం, కుటుంబంతో, స్నేహితులతో బంధాలు, బాలన్స్, ఉత్సాహం, మానసిక మద్దతు)...ఇలా అన్ని వ్రాయండి. మధ్యలో ఆటంకం వచ్చి , పని ఉంది ఆపితే మల్లీ మొదలు పెట్టండి. మీరు ఉన్నప్పుడు, ఈ కాలంతీతంగా, ఈ విశ్వంలో మీరు కోరుకుంటున్న అన్ని అంశాలు వ్రాయండి. మీరు మనసుకి వచ్చిన అన్ని అంశాలు వ్రాస్తూ వెళ్ళండి. సమాధానం వ్రాస్తున్న ప్రతి వాక్యం తర్వాత మల్లి హెడ్డింగ్ లో అడిగిన ప్రశ్న అడగండి.మీకు ఎన్ని పేజెస్ కావాలంటే అన్ని పేజెస్ లో వ్రాయండి. ఆపకండి. మీకు వచ్చే అన్ని ఆలోచనలను వ్రాయండి. ఒక రియలైజేషన్ తో కూడిన ఆలోచనతో మీకు ఏడుపు వచ్చే వరకు వ్రాయండి. అవును మీకు ఏడుపు తెప్పించే స్థాయి వచ్చే అంశాలు వచ్చే వరకు వ్రాయండి. ఆ క్షణంలో మీకు ఒక స్పృహ వస్తుంది, మీ శరీరం కొత్త అంతర్గత శక్తి నింపుకుంటుంది, మొఖం కాంతివంత మౌతుంది, మనసు కుదుట పడుతుంది. అదే మీ జీవిత కార్యం.

మరొక చిన్న ఎక్సర్ సైజ్ ఏమిటంటే మీకు వెయ్యి కోట్లు డబ్బు ఇస్తే, వాటిని మీ ఇష్టానుసారంగా ఖర్చు చేసుకునే స్వాతంత్రం ఇస్తే మీరు ఏమి చేస్తారు? ఏ పనులు చేయడానికి ఇష్టపడతారు? ఎవరిని కలుస్తారు? ఎవరితో ఉంటారు? ఏం పనులు చేస్తే ఆనందంగా ఉంటారు? మీ వాతవరణం ఎలా ఉంటుంది? ఇదే చివరి రానేల జీవితంలో అనుకుంటే అప్పుడు మీరు ఏమి చేస్తారు? ఎక్కడ ఉంటారు, ఏ విధంగా లైఫ్ గడపడానికి , ఎవారితో గడపడానికి ఇష్ట పడతారు? మీరు లైఫ్ లో ఖచ్చితంగా గెలుస్తారు, సక్సెస్ అవుతారు అనుకుంటే ఏమి చేస్తారు? ఎవరితో ఉంటారు? అనుకున్న పనులు తప్పక అవుతాయంటే ఏమి చేయడానికి ఇష్టపడతారు? ఎవరితో గడుపుతారు? ఎవరితో పనిచేస్తారు? ఏం కార్యక్రమాలు చేస్తారు? మీ జీవితకార్యాన్ని ఈ ప్రశ్నలతో కూడా చెక్ చేసుకోండి. మీ జీవితకార్యాన్ని నిర్ణయించుకోవడమే అన్నింటికంటే ముఖ్యమైన పని. ఆ ఒక్క పని చేయండి , జీవితాన్ని అర్థవంతంగా నిర్మించుకోండి, అద్భుతాలు చేయండి. ఎందుకంటే ఈ జీవితాన్ని మరోసారి జీవించలేము కదా?
********** 
"సైకాలజీ టుడే" మాస పత్రికలో  మూడు సంవత్సరాలుగా నడపబడుతున్న నా న్యూ లైఫ్ కాలమ్ లో ఫిబ్రవరి 2014 కోసం  ప్రచురింపబడిన ఆర్టికల్ మీ కోసం. 

No comments:

Post a Comment