Thursday, 8 May 2014

ఆ "ఒక్క అడుగు" ఎలా వేయాలి ?

ఆ "ఒక్క అడుగు" ఎలా వేయాలి ? 
మీ కోరికలను నేరవేర్చుకుంటూ కలలను నిజం చేసుకోవాలంటే ఏమి చేయాలి? లక్ష్యాలను సాధించాలంటే ఏమి చేయాలి?. మిమ్మల్ని ఇదే స్థితిలో ఉంచుతూ మీ ఎదుగుదలను నియంత్రిస్తున్న మీ రిమోట్ ఏమిటి తెలుసుకుందాం. రండి ! ఎందుకంటే నిన్నటి జీవితమే రేపటికి  కూడా ఉండాలని లేదు, గతం వలన భవిష్యత్తు నిర్ణయించడాలని ఏ శాసనం లో లేదు. చదవండి, క్రమశిక్షణతో ఫోకస్  తో   ప్రయత్నించండి,  ఊహలకు అతీతంగా ఎక్స్ లెన్స్ సాధించండి. 

ఈ ప్రపంచంలో మనుషులు మూడు రకాలు. కలలు కనే వారు , కలలు నిజం చేసుకునే వారు, “ ఏం జరిగింది?”  అని ఆశ్చర్యంగా అడిగే వారు. మీరు కచ్చితంగా కలలు నిజం చేసుకోవాలనుకునే  కేటగిరి లో ఉండి ఉంటారు. అందుకే ఈ శీర్షిక చదువుతున్నారు. మీలా ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కలలు కంటారు? మరి ఎందుకు కొందరే కలలను నిజం చేసుకుంటారు? ఎందుకు కొందరు జీవితాంతం కలలు  కంటూనే ఉంటారు? ఎందుకు కొందరు కోరుకున్న ఫలితాలు  సాధించరు? కొందరు ఏ స్థితినుంచి తమ ప్రయాణం మొదలు పెట్టినా , ఏ పరిస్థితుల్లో పెరిగినా అద్భుత విజయాలు ఎలా సాధిస్తారు? కొందరు ఎన్ని ఆటంకాలు వచ్చిన లక్ష్యాలు ఎలా చేరుకుంటారు? అసలు మనం కలలు నిజం చేసుకునే  కేటగిరి లో ఉండాలంటే ఏమి చేయాలి?
మీ కంటికి కనిపించని మీ రిమోట్ కండిషన్  తెలుసుకోండి:
చిన్న ప్రశ్న. నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద ఆవిరి అవుతుంది? దాదాపు పరిశుద్దమైన నీరు సాధారణంగా 100 డిగ్రీల వద్ద ఆవిరి అవుతుంది. అయితే అదే నీటిని 96 , 97, 98 , లేదా 99 డిగ్రీ ల వద్ద ఆవిరిగా మార్చగలమా? చేయలేము. ఆవిరి అవ్వాలంటే ఏ స్థాయిలో పని జరగాలో ఆ స్థాయిలో చర్యలు జరిగినప్పుడు 101 డిగ్రీల వద్ద మాత్రమే నీరు ఆవిరి అవటం మొదలౌతుంది. అంటే 99 డిగ్రీలు చేయలేని పని “ఒకే ఒక్క డిగ్రీ” చేసింది. అలాగే మీ జీవితంలో అనేక అంశాలలో ఆశించిన  ఫలితాలు  సాధించడానికి, సాధించలేకపోవడానికి “ఒక్క డిగ్రీ లాంటి అంశాలు” పనిచేసాయో అర్థం చేసుకోండి. మీ కంఫర్ట్ జోన్ లో మాత్రమే మిమ్మల్ని ఉంచి పని చేయనీయకుండా కట్టిపడేసే మీ ఆలోచనలు, ఆచరణల చట్రాన్ని (థాట్ – యాక్షన్ ట్రాప్) దాటి ఒక్క అడుగు వేయండి, ఎక్స్ లెన్స్ మీ సొంతం చేసుకోండి.
ఇటీవల గుంటూరు లో సర్కస్ షో కి వెళ్ళాను. అక్కడ ఒక పక్కన చెట్టు కింద ఏనుగు కట్టేసి ఉంచారు. విచిత్రం  ఏమిటంటే ఆ ఏనుగును జడ వేసుకునే రిబ్బన్ లతో చేసిన తాడుతో కట్టివేశారు. ఆ ఏనుగు తలుచుకుంటే గుడారం మొత్తాన్ని ఈడ్చుకెల్లగలదు. కాని అది ఆ పని చేయదు. ఎందుకంటే ఆ ఏనుగు  చిన్న పిల్లగా ఉన్నప్పుడు బాగా గట్టి, దృఢమైన గొలుసుతో , తాడుతో దానిని ఎటూ కదలనీయకుండా కట్టేస్తారు. మొదట అది తెంచుకునే ప్రయత్నం చేస్తుంది. అలా అనేక సార్లు చేస్తుంది. కానీ 1...2...3...10...50.... ఇలా వందల సార్లు ప్రయత్నించి తాడు తెంచుకోలేక పోవటం వలన తన  మైండ్ లో “ నన్ను కట్టేసినపుడు తాడును తెంచుకుని వెళ్ళలేను” అని నిర్ణయించుకుంటుంది. ఆ విధంగా కండిషన్ చేయబడుతుంది. అమెరికా వంటి దేశాల్లో ఇంటి వెనుక పెరటి (బ్యాక్ యార్డ్) లో కుక్కలు తమ ఇంటి నుంచి మరో ఇంటి ప్రదేశం లోకి వెళ్ళకుండా కంటికి విద్యుత్తు తీగలు (ఫెన్సింగ్) పెడతారు. అది ఆ ఇంటి పరిధి దాటి వెళుతుంటే కరంట్ షాక్ కొడుతుంది. ఇలా మూడు నాలుగు సార్లు షాక్ దెబ్బ తిన్న ఆ కుక్క ఇంటి పరిసరాలు దాటి బయటికి వెళ్ళాలంటే భయపడుతుంది. కొన్ని రోజులకి ఆ విద్యుత్తు ఫెన్సింగ్ తీసేస్తారు. ఆ కుక్కకి ఒక్క జంప్ తో చాల దూరంగా దూకే శక్తి ఉంటుంది. అవకాశం ఉంటుంది. కానీ ఆ కుక్క ఒక్క అడుగు కూడా బయటికి వేయదు . ఎందుకంటే అడుగు వేయాలంటే షాక్ కొడుతుందని భయపడుతుంది. కంటికి కనిపించని ఆ ఫెన్సింగ్ ని అది ఊహించుకుంటుంది. అలాగే జీవితంలో ఇప్పటివరకు మీకు జరిగిన ఏ సంఘటనలు, మీ ప్రయత్నాలకి వచ్చిన ఫలితాల ఆధారంగా మీరు ఏ ఏ అంశాలకు కండిషన్ చేయబడ్డారో గమనించండి. ఏ అంశాల మీద మీ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి? మీ ఆచరణ ఏ విధంగా ఉంది? మీ మానసిక ప్రక్రియ ఎలా ఉంది? పరిశీలించుకోండి.
మీ స్వయం నిర్వచనమే మీ రిమోట్ కంట్రోల్:
మీ గురించి మీరు ఏమి అనుకుంటున్నారు అన్నది మీ స్వయం నిర్వచనం (సెల్ఫ్ కాన్సెప్ట్) ని నిర్ణయిస్తుంది. మీ సెల్ఫ్ కాన్సెప్ట్ మీ జీవన నాణ్యతని నిర్ణయిస్తుంది. మీరు ఏ స్థాయిలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారు? ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారు? ఏ కంపెనీ కార్ కొనాలనుకున్తున్నారు? ఎటువంటి ఇల్లు సొంతం చేసుకోవలనుకున్తున్నారు?  నెలకి ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నారు? ఎన్ని సేల్స్ చేయాలనుకుంటున్నారు? మీ పిల్లలని ఎంత పెద్ద స్కూల్ లో చదివించాలనుకుంటున్నారు? మీ వేసవి సెలవులకు ఏ ప్రదేశాలకు వెళ్లాలనుకున్తున్నారు? ఏ దేశాలు, ప్రదేశాలు చూడాలనుకుంటున్నారు? ......ఈ అంశాలన్నీ మీ స్వయం నిర్వచనం పై ఆధారపడి ఉంటాయి. మీరు గమనించారా ఒకే పరిస్థితుల్లో , ఒకే కంపెనీ కి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు సేల్స్ ద్వారా ఒకళ్ళు నెలకి 10 వేలు సంపాదిస్తే మరొకరు 15 వేలు సంపాదిస్తారు. చాలా కొద్దిమంది నెలకి లక్ష సంపాదిస్తారు. ఆ కొద్ది మంది ప్రత్యేకత ఏమిటి. కొందరి సంపాదన మీటర్ రీడింగ్ 10,000 పెట్టుకున్నారు. కొద్ది మంది తమ సంపాదన నెలకి లక్ష కి తక్కువ ఉండకూడదని నిర్ణయించుకున్నారు. తమ మీటర్ రీడింగ్ స్తాయి ఎక్కుడ పెట్టుకున్నారు. ఎక్కువ రీడింగ్ తో జీవితంలో ప్రతి అంశం లో పనిచేయాలంటే మనిషి తన మీద తన ప్రేమను, నమ్మకాన్ని, గౌరవాన్ని క్షణం ఉంచుకూవాలి. మిమ్మల్ని మీరు గౌరవించుకుని , మీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకుంటే మీకు గతం, ప్రస్తుతంలో కండిషన్ చేయబడినట్లు కాకుండా భవిష్యత్తు అవసరాలకు, ఫలితాలకు తగ్గట్లుగా అడుగు ముందుకు వేయవచ్చు.
ఎక్స్ లెన్స్  దిశలో అడుగులు:
  • మీ స్వయం నిర్వచనం అద్భుతంగా ఉండేలా (సెల్ఫ్ కాన్సెప్ట్) అంతర్గత సంభాషణ కొనసాగించండి. మీతో మీరు విజేతల లా మాట్లాడుకోండి
  • మీ లక్ష్యం చేసే దిశలో ఏర్పడిన గతం లో కండిషన్ లు ప్రస్తుత జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నాయో గమనించండి. మీ నమ్మకాలు, మీ ఆచరణ విధానాలు పరిశీలించుకోండి
  • మీ కలలను, కోరికలను లక్ష్యాలుగా మార్చుకుని ఏ సంవత్సరం , ఏ నెల కి వాటిని చేరతారో వివరాలతో సహా వ్రాసుకోండి. వాటిని  ప్రతి రోజు చదవండి.
  • మీ జీవితంలో వేర్వేరు పార్శ్వాలలో మీరు ఆశించే ఫలితాలేమిటి, వాటిని ఏ స్థాయిలో చేరలనుకుంటు న్నారు , మీ  జీవిత స్థాయికి మీరు నిర్ణ యించుకున్న ఎక్స్ లెన్స్  మీటర్ రీడింగ్ స్థాయి ఎంత? ఆ స్థాయి పెంచుకునీల మీ అలూచనలు కొనసాగించండి. ఆ విధంగా మిమ్మల్ని మీరు నిర్ణయించుకోండి.
  • మీరు కోరుకున్న స్థాయి మనుషులను కలవండి, మీరు ఎప్పుడు కలిసే ఐదుగురు వ్యక్తులు మీపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతారు. కాబట్టి మీ సర్కిల్ లో మిమ్మల్ని ఉన్నతంగా ఉంచగలిగే , మీ లక్ష్యం వైపు అడుగులు వేయించే వ్యక్తులు ఉండేలా చూసుకోండి. కనీసం నెలకి ఒక మంచి పుస్తకం చదవండి.
  • మీ అభివృద్ధిని ఆటంకపరుస్తున్న అలవాట్లు ( hobbies) , భయాలు (fears) గుర్తించండి.
  • గుర్తున్చుకోండి. మీ భయాలకు, మీ కాంఫోర్ట్ జోన్ కు కేవలం ఒక్క అడుగు దూరంలో మీలోని గొప్ప   అంతర్గత శక్తులు, మీ అవకాశాలు ఎదురు చూస్తున్నాయి.
ఆ ఒక్క అడుగు మీ భయాలకు, మీ గత కండిషన్ లకు, మీ కంఫర్ట్ జోన్ లకు ఎదురుగా వెళ్లి ధైర్యంగా అడుగు వేయండి. మీరు మీ లక్ష్యాలు దిశలో చేయాలనుకుంటూ వాయిదా వేస్తున్న మూడు పనులను ఈ నెలలో రోజు ఒక గంట చేయండి. మీ లక్ష్యం దిశలో ఒక్క ముఖ్యమైన ఫోన్ కాల్ చేయండి, ఆ రోల్ మోడల్ వంటి ఒక్క వ్యక్తిని కలవండి, ఆ మౌలిక మైన ప్రాజెక్ట్ మొదలుపెట్టండి,  మీ కంటికి కనిపించని కండిషన్ ని ఒక్క సారి బ్రేక్ చెయ్యండి, మీరు ఎంచుకున్న ఫీల్డ్ సంబంధించి ఒక్క పుస్తకం చదవండి.... ఇటువంటి క్రమశిక్షణలు ఈ క్షణమే మొదలుపెట్టండి మీ జీవిత ప్రాదాన్యాల దిశలో ఈ రోజే ఆ ఒక్క అడుగు వేయండి. ఇలా ప్రధాన్యాలపై పనిచేయటం మీ జీవితంలో భాగంగా మలుచుకోండి. 
**************
"సైకాలజీ టుడే" మాస పత్రికలో  మూడు సంవత్సరాలుగా నడపబడుతున్న నా న్యూ లైఫ్ కాలమ్ లో ఏప్రిల్ 2014 కోసం  ప్రచురింపబడిన ఆర్టికల్ మీ కోసం. 

No comments:

Post a Comment