మీరు మీ ఇంట్లో,
ఆఫీస్ లో, వ్యాపారంలో, ఊరిలో, బంధుమిత్రులలో ఎలా గుర్తింపబడుతున్నారు? ఇతరుల
దృష్టిలో మీరు ఎలాంటి వారిగా గుర్తొస్తున్నారు. మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలని
మీరు కోరుకుంటున్నారు? వీటిని
తెలుసుకోవాలంటే పర్సనల్ బ్రాండింగ్ అర్థం చేసుకోవాలి. వేగంగా మారుతున్న E-యుగంలో
మీరేంటి అంటే మీ ఆన్ లైన్ ఉనికి గురించి కూడా అనేది E-తరం అర్థం చేసుకోవాలి.
అందుకే మీ ఫేస్ ఏంటో ఫేస్ బుక్ చెప్తుందా, మీ ఫేస్ ఒక బుక్ లా, మీరే ఒక గొప్ప గ్రంధంలా గుర్తించబడాలా? ఈ కీలక అంశాలు తెలిపే “పర్సనల్ బ్రాండింగ్ కు పంచ సూత్రాలు” మీకోసం ప్రత్యేకం.
*** ***
*** *** ***
***
ప్రపంచానికి మీరు ఎలా
కనిపిస్తున్నారు అనేది మీ పర్సనల్ బ్రాండింగ్. మీరు ఎవరు, మీ ప్రత్యేకత ఏమిటి,
మీరు ఏమి సేవలు అందిస్తుంటారు తెలిసిన తర్వాత ప్రజలు మీరు ఎంచుకున్న రంగంలో మిమ్మల్ని
ఆ సర్వీస్ అవసరం ఉన్నప్పుడు గుర్తుకు తెచ్చుకోగలరు. అయితే ప్రశ్న ఏమిటంటే
మిమ్మల్ని మీ రంగంలో ఏ వ్యక్తిగా గుర్తుంచుకోవాలనుకుంటున్నారు? ఏ సర్వీస్ కోసం మిమ్మల్ని ఎటువంటి ప్రత్యేక
కారణం చేత సంప్రదించగలరనుకుంటున్నారు? ఏ విధంగా ప్రజలు మిమ్మల్ని ఎక్కువగా గుర్తుంచుకోవాలనుకుంటున్నారు?
ప్రజలకు ఉన్నతంగా ఉపయోగపడే వ్యక్తిగా మీరు గుర్తుండిపోవాలంటే ఈ క్రింది పర్సనల్
బ్రాండింగ్ పంచ సూత్రాలు పాటించండి
1: మీ
అసలైన వ్యక్తిత్వం ప్రదర్శించండి:
ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి మీరు కాని మరో
వ్యక్తిలా గొప్ప వారిలా, సరదా మనిషిలా, అప్పటికప్పుడు మరోలా ఉండాలని ప్రయత్నిస్తే
అది తాత్కాలిక విజయమే. ప్రజలు ఊసరవెల్లి మనస్తత్వాలను, డాంబికాలను గుర్తిస్తారు.
గొప్ప గొప్ప సంస్థలు, ప్రభుత్వాలు, ప్రముఖులు లేని విలువలు తమ నిజమైన భావాలని
చెప్పుకుని ఆచరణ లో నిరూపించుకోలేక కుప్పకూలిన దాఖలాలు చాలా ఉన్నాయి. అందుకే మీరు
మీలా ఉండండి. అంటే ఒక నమ్మకైన మీదైనా స్వభావాన్ని తెలిపే విధానాలు ఎంచుకోండి. బయటి
రూపం, స్వరూపం మార్చే అనేక ప్రక్రియలు నేర్చుకుని లోపల అంతా ఖాళీగా ఉంటే కోటు,
బూటు చూసి ప్రజలు రెస్పెక్ట్ ఇస్తారేమో
కానీ నోరు విప్పాక వారికి మనదగ్గర సత్తా లేకపోతే తెలిసి పోతుంది. మనుషులు
ఇతర మనుషులతో బంధాలు ఏర్పరచుకుంటారు. మీరు మరో వ్యక్తిలా (మాస్క్ వేసుకుని) ఉంటే
వారి బంధాన్ని మీరు దృడంగా ఉంచుకోలేరు.
ఇది ప్రకృతి నియమం.
2: అవకాశాలు
ఉన్నచోట మాట్లాడండి:
మీ పర్సనల్ బ్రాండింగ్ ఉన్నతంగా
ముందుకు వెళ్ళాలి, ప్రజలు గుర్తించాలంటే వీలైనచోట మాట్లాడండి. అవును దీని ద్వారా
అనేక వ్యక్తులతో కలిసిపోతారు. అందరిలాగే మీరు మాట్లాడితే గుంపులో గోవిందయ్య
అన్నట్లు అయిపోతుంది. మీ ప్రత్యేకత చాటేలా ఉండాలి. ఆ టాపిక్ మీద పట్టు, మీ
కాన్ఫిడెన్సు, మీరు ప్రజలతో కనెక్ట్ అయ్యే విధానం, మీరు అనేక ఇతర వనరులు గురించి
చెప్పే విధానం ద్వారా రాగానే మీరు వారికి
ఎప్పటికీ గుర్తుండి పోవాలి. మీరు మొదటి రోజే గొప్ప వక్త అవ్వక పోవచ్చు, కొందరు
మిమ్మల్ని విమర్శించవచ్చు, కొందరు ప్రోత్సహించవచ్చు. ఎటువంటి ఫీడ్ బ్యాక్ అయినా
రిసీవ్ చేసుకోడానికి రెడీ గా ఉండండి. వాటినుంచి నేర్చుకోండి. మీ పర్సనల్
బ్రాండింగ్ పెంచుకోవాలంటే చిన్న చిన్న మీటింగ్స్ , కస్టమర్ అవేర్నెస్ కార్యక్రమాలు
, మీ ఆఫీస్ లో మీటింగ్స్, బాస్ కి అభిప్రయాలు చెప్పడం, ఆ రంగం లోని ఇతరులు
ప్రాబ్లం లో ఉంటే వాలంటీర్ గా సహాయం చేయడం బాగా ఉపయోగపడతాయి.
3: ఆర్టికల్స్ రాయండి:
మీ రంగంలో కస్టమర్ లను
ఆకర్షించడానికి ముందు వారు చదివే ఆర్టికల్స్ రాయండి. మంచి కంటెంట్ అందించండి.
అందరిలా మీరు రాయకండి. మరో పది మంది రచయితలు రాసినా, పేజి డిజైన్ సరిగా చేయకపోయినా
మీ ఆర్టికల్ మీదకు దృష్టి వెళ్ళేలా, చదివే వారి నిజ జీవితంలో ఉపయోగపడేలా, ఒక సారి
మీ ఆర్టికల్ చదివితే మళ్ళీ ఇంకో ఎడిషన్ కోసం వెయిట్ చేసేలా రాయండి. ఒక మంచి
ఆర్టికల్ రాయాలంటే ఒక మంచి థింకర్ అవ్వాలి అని అంటారు పెద్దలు. అది నిజం ఇది
సమయంతో కూడుకున్న పని. మీరు చదువుతున్న మన సైకాలజీ టుడే పత్రిక కోసం గత ఆరు
సంవత్సరాలుగా నేను ఆర్టికల్స్ రాస్తున్నాను. ఒకోసారి ఆర్టికల్ రాయడానికి ఒక రోజు
సమయం కూడా పడుతుంది. కానీ గతం కంటే బాగా రాయాలన్న తపనతో, అవసరమైన కంటెంట్
అందించాలన్న ప్రేమతో ఆర్టికల్స్ రాస్తుంటాను. మనం ప్రతీసారి బెటర్ గా క్లైంట్ కి
సర్వీస్ అందించగలిగితే ఉన్నతంగా గుర్తుంది పోతాము. మీరు ఎంచుకున్న రంగంలో
రాయడానికి ఆన్ లైన్ వెబ్ సైట్స్, బ్లాగ్స్, మీ ఫేస్ బుక్, ఇతరుల సైట్ కోసం గెస్ట్
పోస్ట్ లు, న్యూస్ పేపర్స్, మ్యాగ జైన్లు ఇలా ఏవైనా ఎంచుకోవచ్చు.
4: ఆన్ లైన్ లో మిమ్మల్ని మీరు ప్రెజెంట్
చేసుకోండి:
ఎవరైనా ఎక్కడా దొరకకపోతే ఆన్-లైన్ లో
ఉన్నాడేమో వెతకండి అని ఆలోచించే రోజులు వచ్చేసాయి. ఒక సెకనుకి 2.3 మిలియన్స్
గూగుల్ సెర్చ్ లు జరుగుతున్నాయట. మీ రంగంలో కస్టమర్ లు సర్వీస్ కోసం వెతికితే మీరు
కనిపించాలి. ఆన్ లైన్ లో ప్రముఖ సోషల్ మీడియా సైట్ లలో (ఉదా: ఫేస్ బుక్, ట్విట్టర్,
పింటరెస్ట్, ఇన్ స్టాగ్రామ్) మీ ప్రొఫైల్, ప్రెజెన్స్ ఉండేలా చూసుకోండి. అయితే ఆన్-
లైన్ లో మీ బ్రాండ్ విలువ మీరే
ఎప్పటికప్పుడు గమనించు కోవాలి, మానిటర్ చేసుకోవాలి. సొంతంగా వెబ్ సైట్ ఉంటే
మంచిది, ఖర్చు, కాస్త టెక్నికల్ అంశాల పైన పట్టు ఉండాలి. వెబ్సైటు ఖర్చు పెట్టె
బదులు వర్డ్ ప్రెస్ , బ్లాగ్ స్పాట్. కాం వంటివి వాడుకుని మీరే సైట్
నిర్మించుకోవచ్చు. ఇది కాస్త సమయం, కొత్త అంశాలు నేర్చుకునే లక్షణం, టెక్నికల్
అంశాలు పాటించడం ద్వారానే సాధ్యం. ఒకవేళ ఈ జాగ్రత్తలు తీసుకోలేకపోతే,
నేర్చుకోలేకపోతే మీ అభివృద్ధిని, మీ పర్సనల్
బ్రాండింగ్ ని మీరే అడ్డుకున్న వారౌతారు.
5: మీ రంగంలో కొత్త అంశాలు నేర్చుకోండి: రాకెట్ స్పీడ్ తో
కొత్త అంశాలు వచ్చి చేరుతున్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మీ రంగంలో కొత్త అంశాలను
నేర్చుకోండి. చాలా సంవత్సరాలుగా మీరు కొంత స్థాయి మించి వెళ్ళలేకపోతున్నారు అంటే
మీ నైపుణ్యాలు పరిధి అని అర్థం. నైపుణ్యాలు నేర్చుకోండి, కొత్త అంశాలతో మిమ్మల్ని
ఇండస్ట్రీ లో అప్డేటెడ్ పర్సన్ గా గుర్తింపు తెచ్చుకోండి. ఈ అంశాలతో మీ పర్సనల్,
కంపెనీ బ్రాండింగ్ ఉన్నతంగా మలుచుకోండి,
మీ సక్సెస్ స్టొరీ మాతో పంచుకోండి.
Five principles for Personal Branding:
1. Show your real you
2. Speak wherever possible
3. Write articles
4. Create online presence
5. Update and learn constantly
*** *** *** సైకాలజీ టుడే, ఆగష్టు 2016 లో ప్రచురించబడిన ఆర్టికల్ *** *** ***
No comments:
Post a Comment