ఇది డిసెంబర్ 2014. అంటే మన జీవితంలో ఒక క్యాలెండర్ సంవత్సరం ఆఖరిలో ఉన్నాం. మరి ఈ సంవత్సం 12 నెలలు మీ లైఫ్ ఎలా గడిచింది, మీ సమయాన్ని
శక్తిని దేనిపై కేంద్రీకరించారు, ఏం నేర్చుకున్నారు, ఏం సాధించారు ఇవన్నీ రివ్యూ
చేసుకోడానికి మంచి సమయం. 2014 లో మీ ఉత్పాదకత (ప్రోడక్టివిటి)
ఎలా ఉంది? అనుకున్నది చేస్తే ఓకే , చేయకపోతే మాత్రం మీలో ప్రొడక్టివిటీ (ఉత్పాదకత) దొంగలు ఉన్నారన్న మాట. వాళ్ళెవరు?
వారికెలా చెక్ పెట్టాలి వంటి కీలకమైన అంశాలను చర్చించడానికే ఈ ఆర్టికల్.
మీరు ఎన్ని ప్లాన్స్ వేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, మీ ప్రొడక్టివిటీని దొంగిలించడానికి కొందరు దొంగలున్నారు. ఈ దొంగలకు ఇప్పటికైనా
చెక్ పెట్టాలి అనుకుంటే వాళ్ళు ఎవరు, ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు వారిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవాలి. ఆ దొంగలు నలుగురు ఎక్కడో లేరు. మీలోనే చొరబడతారు. మిమ్మల్ని పనులు
చేసుకోనీయకుండా శాసిస్తారు. రండి వారిని గుర్తించి మన పనులు మనం వేగంగా
చక్కబెట్టుకుందాం.
- శరీరాన్ని
పట్టించుకోని దొంగ- ఆరోగ్యకరమైన
అలవాట్లు లేకపోవటం:
మిమల్ని మీరు ఈ ప్రశ్నలు
అడగండి. నిజాయితీగా సమాధానం వెతికే ప్రయత్నం చేయండి. ముందు ఆ పని చేయండి తర్వాత
పేరాగ్రాఫ్ లోకి వెళ్ళకుండా ఈ ఆత్మ శోధన చేయండి. మీ అలవాట్లు , ఆహారం, నిద్ర,
వ్యాయామం విషయాలలో మీరు ఏమి చేయాలి? మీరు ఏమి చేస్తున్నారు? అసలు మీ ఎత్తుకి తగిన
బరువు ఉన్నారా? మీ బాడీ మాస్ ఇండెక్స్ (బి. యమ. ఐ) ఎంత?మీరు ఎప్పుడు నిద్ర లేస్తున్నారు?
ఎన్ని గంటలకి పడుకుంటున్నారు? మీరు ఏ సమయంలో ఎక్కువ శక్తివంతంగా పనిచేయగలరు?
మిమ్మల్ని హాయిగా, ప్రశాంతంగా, ఎనెర్జిటిక్ గా
ఉంచే ఆహారం ఏమిటి? మీ శరీరానికి మనసుకి శక్తి నిచ్చే పనులు, అలవాట్లు మీకు
ఉన్నాయా?
ఒక్క క్షణం ఆలోచించండి
ప్రకృతి ఉచితంగా (అల్ ఫ్రీ ఆఫర్) ఇచ్చిన ఈ అద్భుతమైన శరీరాన్ని బాగా చూసుకోకపోతే
మీరు ఎక్కడ జీవిస్తారు? మీరు ఎలా ఉంటారు? హాస్పిటల్ వార్డులలో అనారోగ్యంతో
ఉన్నవాళ్ళని గమనించండి, ఆరోగ్యంగా ఉండి మనం జీవశక్తిని ఎంత వేస్ట్ చేసుకుంటున్నామో
గుర్తించగలరు. ఉన్నత స్థాయిలో ఎదిగిన వాళ్ళు ఉన్నతంగా శక్తిని ఉపయోగించుకున్న
వారందరూ ఆరోగ్యాన్ని కాపాడుకుని అద్భుతాలు సృష్టించారు. అందుకే మెడిటేషన్, మంచి
ఆహార అలవాట్లు, ఆత్మీయులతో ప్రేమగా ఉండటం, లక్ష్యాలతో ముందుకు వెళ్ళడం ప్రణాళికతో
జీవించడం వంటి అలవాట్లు చేసుకోండి.
- మొహమాటం దొంగ - లేదు
, కాదు అని చెప్పలేకపోవటం:
మీరు మీ లక్ష్యాలకు, మీ
ఉత్పాదకతకు సంబంధంలేని ఒక అంశానికి ‘ఎస్’ అని చెప్పారంటే మీ ప్రపంచంలో మిగతా అన్ని
విషయాలకు ‘నో’ అని చెప్పినట్లే. ఆశ్చర్యంగా ఉందా? ప్రస్తుతం ఈ పుస్తకం
చదువుతున్నది మీరు. మీరు ఈ క్షణంలో ఇక్కడే ఉన్నారు ఇంకో చోటలేరు. కాబట్టి మీరు
‘ఎస్’ అని ఒక దానికి చెపితే, మిగతా అన్ని విషయాలకు ‘నో’ చెప్పినట్టే కదా.
ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, కొల్లీగ్స్, మీనుంచి అనేక అంశాలు, పనులు, మీ
ప్రెజెన్స్ ఆశిస్తారు. అది సహజం. కాని మీరు మీ చేయాలనుకున్న పనులను ఎంత వరకు వదిలేసి ఇతర పనులకు సమయం కేటాయించగలరో
నిర్ణయించుకోండి. అందుకే మీరు ప్రతి ఒక్కరినీ సంతోష పరిచే పని చేయలేరు అనే
వాస్తవాన్ని అర్ధం చేసుకోండి. పనులను ఇతరులకు డెలిగేట్ చేయండి. మంచి అనిపించుకునే
పనిలో (అదొక సూడో ఆనందం) మీకు సంబంధం లేని బాధ్యతలు, పనులు, సహాయ కార్యక్రమాలు
చేసి మీ సొంతపనులు వెనకేసుకోవద్దు. ఫోకస్ అంటే మీరు ఏ పనులు చేయకుండా
ఉంటారో నిర్ణయించుకోవడమే అంటాడు జాన్ కార్మార్క్. అందుకే ప్రేమగా చెప్పండి
మీకు మరో పని ఉందని, మీ సమయం మీకు చాలా ఉపయోగకరమని. ముఖ్యంగా మీ అత్యంత ముఖ్యమైన
పనులు చేసే సమయంలో రోజుకి కనీసం 4 గంటలు ఈ మెయిల్స్, ఫోన్, మీటింగ్స్, ముచ్చట్లు,
ఏ పనులు ఏ అంతరాయాలు లేకుండా చూసుకోండి.
- భయపడే దొంగ - గందరగోళం
అంటే భయపడటం:
మీ ప్రాజెక్ట్ పనులు, మీ
లక్ష్యాలు కేకు వాకింగ్ అన్నట్లు, నేతితో పెట్టిన విద్య అన్నట్లు ఉంటే
బ్రహ్మాండంగా చేసేవాడిని అనేక ఇబ్బందులు ఎదురౌతున్నాయి అదుకే చేయలేకపోతున్న
అంటారు. నిజానికి ఈ ప్రపంచంలో ఏ ఉన్నత ఫలితాలు అయినా, ఏ పెద్ద సక్సెస్ అయినా అనేక
గందరగోళాలు, అడ్డంకులు, కష్టనష్టాలు తట్టుకున్న తర్వాత వచ్చినవే. అంటే ఒక ఉన్నత
కార్యక్రమం, లేదా కాన్షియస్ గా ప్రణాళికతో ముందుకెళ్ళడం అనే ప్రాసెస్ లో భాగంగా
మీకు తెలియని మలుపులు , అడ్డంకులు, ఎత్తుపల్లాలు ఉంటాయి. మనుషులు పనులకు సాయం
చేయకపోవచ్చు, మిమ్మల్ని అవకాశంగా తీసుకోవచ్చు, ప్రాజెక్ట్ లేదా బిజినెస్ నష్టం
రావచ్చు, కొన్ని అవకాశాలు కోల్పోవచ్చ్చు. లేనితనం, చిన్నతనం ఫీల్ అవ్వొచ్చు, ఓటమి
ఆవహించిన భయం ఉండొచ్చు, ఒత్తిడి ఎక్కువ అవ్వొచ్చు. భావోద్వేగాలను అర్థం
చేసుకోడానికి అదొక అవకాశం అనుకోండి, వాటిని అర్థం చేసుకోండి, గందరగోళం సహజం అని నమ్మండి. అందులోనుంచే మీరు స్పష్టతని
వెతుక్కుంటారు అని గమనించండి. చిక్కుముడులు అంటూ లేకపోతే విప్పిదానికి
చెప్పుకోడానికి ఏముంది?
- ప్రభావాన్ని చూపే
దొంగ- ప్రొడక్టివ్ వాతావరణం లేకపోవటం:
మీ వాతావరణం అంటే మీరు
ప్రతిరోజు ఏమిచుస్తారు, ఎవరితో మాట్లాడతారు, ఏం చదువుతారు, ఏం వింటారు, ఎక్కువగా
ఎవరెవరితో గడుపుతారో అదే వాతావరణం. అంటే మీరు చూసే, వినే, ఎక్స్పీరియన్స్ చేసే
అంశాలు అన్నమాట. మీకు తెలిసిన మనుషులు, తెలిసిన ప్రదేశాలు, తెలిసిన క్లైంట్స్ అంటూ
మీకు కంఫర్ట్ ఉన్న చోటనే ఉంటే ఆ విధానాలు మీకు ఉత్పాదకతని ఇస్తున్నాయా అని
ఆలోచించు కోవాలి. కొంతమంది వారి జీవితం పై వారికే స్పష్టత , గౌరవం లేకుండా ఉంటారు
అటువంటి నెగటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళ సాంగత్యం మీ జీవితం పై ప్రభావం చూపే అవకాశం
ఉంది. నో చెప్పడం ఇక్కడ ముఖ్యం లేదంటే మీ వాతావరణం నిరుత్సాహమైపోతుంది. ఎందుకంటే
మీరు ఎక్కువ సమయం గడిపే వ్యక్తుల ప్రవర్తనా విధానాలు, జీవన శైలి మీకు తెలియకుండానే
చాప కింద నీరులా మిమ్మల్ని చుట్టేస్తుంది. యాటిట్యూడ్ అనేది ఒక అంటువ్యాధి వంటిది,
ఒకరినుంచి ఒకరికి త్వరగా పాకిపోతుంది. మీకు ‘చిత్రం భళారే విచిత్రం’ సినిమాలో
బ్రహ్మానందం ‘నీ యంకమ్మ’ అనే డైలాగ్ గుర్తుందా? ఆ యాటిట్యూడ్ ప్రదర్శించే
సందర్భాలలో నిజ జీవితంలో ఇప్పటికీ చాలా
మంది ఆ డైలాగ్ వాడుతుంటారు. గమనించారా? అందుకే సరైన, ఉత్పాదకతని, ఉన్నత అలవాట్లని
నిజ జీవితంలో పాటించే వ్యక్తులతో గడపండి, ఉన్నత వాతావరణాన్ని సృష్టించుకోండి. మీ
లక్ష్యాలకు, మీ వ్యక్తిత్వానికి ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళ సాంగత్యం మిమ్మల్ని
ఎక్స్ లెన్స్ వైపు నడిపిస్తుంది.
మీ గత సంవత్సరంలో ఈ నలుగురు దొంగలు మీకు ఎంత నష్టాన్ని
తెచ్చారో ఒక్క సారి ఆలోచించండి. 2015 లో ఆ పరిస్థితి లేకుండా ఉండాలంటే ఏమి చేయాలో నిర్ణయం
తీసుకోండి. ఒక ఉన్నత ప్రణాళికతో న్యూ ఇయర్
లో న్యూ లైఫ్ నిర్మించుకోండి. మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు హృదయ పూర్వక
క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు J