Friday, 11 July 2014

Create Your Vision Board - మీ విజన్ బోర్డ్ సృష్టించుకోండి

మీ విజన్ బోర్డ్ సృష్టించుకోండి
“ఒక్క సారి కమిట్ అయితే నామాట నేనే వినను” అనేది  జనాదరణ పొందిన సినిమా డైలాగ్. మరి అలా ఒక్క సారి కమిటై మన గోల్స్ మనం చేరాలంటే సినిమాలో చూపించినంత ఈజీ గా వీలౌతుందా ? అసలు 90% మనిషి చర్యలని నడిపించే సబ్ కాన్షియస్ మైండ్ ని, రోజు వారీ అలవాట్లని నిర్దేశించుకున్న లక్ష్యాలు దిశలో ప్రోగ్రాం చేయాలంటే  ఉపయోగపడే  ఆయుధాలు ఉన్నాయా అంటే  ఉన్నాయి అనే చెప్పాలి.  వాటిలో ఒక ఆయుధాన్ని మీకు పరిచయం చేయడానికే  ఈ  ఆర్టికల్.


మనుషులందరికీ చూడటం, వినటం, పనులు చేయటం వచ్చినప్పటికీ కొందరు చూడటం ద్వారా కొందరు వినటం ద్వారా కొందరు పనులు చేస్తూ ఉండటం ద్వారా,  ఫీలింగ్స్ ద్వారా ఎక్కువ నేర్చుకుంటారు. కొందరికి వీటిలో ఎదో ఒకటి లేదా రెండు విషయాలు శక్తివంతంగా నేర్చుకోడానికి దోహదం చేస్తాయి. మీరు ఈ ఆర్టికల్ చదువుతున్నారు అంటే చదవటం ద్వారా నేర్చుకునే మనస్తత్వం కలవారై ఉంటారు.  మీరు ఏ టైపు వ్యక్తి అయినా మీరు కోరుకున్నదానిని మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండిపోయేలా, మీ రోజువారీ జీవితంలో భాగమైపోయేలా  చేయడానికి ఉపయోగపడే అద్భుత యంత్రం అంటే మీ “విజన్ బోర్డ్ (Vision Board).


విజన్ బోర్డ్ అంటే ఏమిటి?


విజన్ బోర్డ్ అంటే అనేక బొమ్మల సమ్మేళనం, వివిధ రంగురంగుల చిత్రాల మాలిక. మీ జీవితంలో మీరు ఏమి కావాలని కోరుకుంటున్నా , మీరు ఎలా ఉండాలనుకుంటున్నా, మీరు ఆశించే అనేక విషయాలు, మనుషులు, వస్తువులు, అనుభవాలు, ఫీలింగ్స్, స్థితులు తెలిపే దృశ్యరూప సాక్షాత్కారమే మీ విజన్ బోర్డ్. అంటే మీ శరీరం,  మనస్సు, మీ కుటుంబం, మీ రిలేషన్ షిప్స్, మీ కెరీర్, మీ వ్యాపారం, మీ చదువు, మీ సామాజిక బంధాలు, మీ ఆధ్యాత్మిక ఆలోచనలు, మీ వ్యక్తిగత అభివృద్ధి, మీరు ఎంజాయ్ చేయాలనుకుంటున్న అంశాలు, మీరు చూడాలనుకుంటున్న ప్రదేశాలు, తీసుకోవాలనుకుంటున్న శిక్షణా కార్యక్రమాలు...ఇలా అనేక అంశాలకు సంబంధించిన రంగుల,అందమైన, శక్తివంతమైన చిత్రాల సమాహారం విజన్ బోర్డ్. దీనినే కొందరు “ కలల బోర్డ్” (Dream board), లక్ష్యాల బోర్డ్ (Goal board), సృజనాత్మక మాలిక (Creativity Collage) వంటి పేర్లతో కూడా పిలుస్తారు. పేరు ఏదైనా మీరు మీ జీవితంలో దేనిని కోరుకుంటున్నారో ఆ అంశాల దృశ్య రూపమే విజన్ బోర్డ్. చిత్రాలతో పాటు మీకు కచ్చితంగా గుర్తుండిపోవాలనుకున్న పదాలు, మిమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడిపించే మాటలు (పాజిటివ్ స్టేట్ మెంట్ లు) కూడా  రాసుకోవచ్చు.        

మీ విజన్ బోర్డ్ మీకు ఐదు రకాలుగా సహాయపడుతుంది :

  1. మీరు ఏమి ఆశిస్తున్నారో ఆ దృశ్య రూపాన్ని ఒకే ఒక చోట చూసుకునే అవకాశం ఉండడం వలన మెదడు మీకు ఉన్నత స్థాయిలో పనిచేస్తుంది, కొత్త ఆలోచనలు కల్పిస్తుంది. మిమ్మల్ని ఒకే చట్రంలో ఆలోచించే బదులు, చట్రం బయటికి వచ్చి ఆలోచించేలా ప్రోత్సహిస్తుంది. అందుకే కార్పొరేట్ సంస్థలు వారి లక్ష్యాలు సింగల్ పేజి లో, బోర్డుల్లో  చిత్రాలు / మాటల ప్రమోషన్ ద్వారా వారి ప్రతినిధుల మైండ్ బాగా ప్రోగ్రాం చేస్తారు.
  2. మీ లక్ష్యాలపై మీకు స్పష్టత ఇస్తుంది, మీలో జీవితంపై గల కొన్ని అస్పష్టతలను  తొలగిస్తుంది. ఎందుకు, ఎప్పుడు, ఏమిటి, ఎక్కడ వంటి అంశాలతో అలోచించి మీ విజన్ బోర్డ్ చిత్రాలు సేకరణ జరిగితే అద్భుతమైన స్పష్టత అదే వస్తుంది   
  3. మీ రోజు వారీ జీవితంలో బిజీ అయిపోయి కోరుకున్న లక్ష్యాలపై పనిచేయలేక పోతున్నాం అనే పరిస్తితిలోంచి బయట పడేసి మిమ్మల్ని మీ లక్ష్యాలపై పనిచేసేలా అనుక్షణం గుర్తుకు తెస్తుంది
  4. మీరు కోరుకున్న లక్ష్యాలను చేరుకున్నట్లు ఊహించుకోడానికి (విజువలైజేషన్ కి) ఉపయోగపడే అద్భుతమైన యంత్రం ఇది. ఎవరైతే విజువలైజేషన్ చేస్తారో వారు ఊహించిన దానిని నిజజీవితంలో సృష్టించే అవకాశాలు ఎక్కువ.     
  5. మీరు ఆశించిన ఫలితాలను , విషయాలను మీ వైపు ఆకర్షించేలా మీ నుంచి తరంగాలను ప్రసరింపజేస్తుంది . దీనినే ఆకర్షణ సిద్దాంతం (Law of attraction) అన్నారు

మీ విజన్ ఇలా చేసుకోండి :

కావలసిన వస్తువులు:

  1. పాత మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్, ఎక్కువ అందమైన చిత్రాలు (ఇమేజెస్) ముద్రించే దిన పత్రికలు, వార పత్రికలు, మాస పత్రికలు
  2. కత్తెర 
  3. గ్లూ స్టిక్ లేదా చిన్న కాగితాలు అంటించడానికి కావలసిన పదార్ధం
  4. దళసరి అట్ట ముక్క లేదా ఫోమ్ బోర్డు లేదా పిన్ బోర్డు
  5. తెల్లటి పేపర్స్ (A4 వైట్ షీట్స్)
  6. కలర్ స్కెచ్ పెన్ లు
తయారీ విధానం :

స్టెప్ 1: ముందుగా మీరు ఒక సంవత్సరం నుంచి 15 నెలలలో సాధించాలనుకుంటున్న మీ లక్ష్యాలు నిర్ణయించుకోండి. ఆ లక్ష్యాలు సాధిస్తే మీరు ఎలా ఉంటారో ఆ విధంగా కనిపించే చిత్రాలు, మీరు ఇంకా ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో, మీతో , మీ ఫీలింగ్స్ తో బాగా అనుసంధానంగా ఉన్న చిత్రాలు కత్తెర తో కట్ చేసుకుని పక్కకి పెట్టుకోండి.

స్టెప్ 2: మీ ముఖ్యమైన కొన్ని గోల్స్ కోసం చేస్తున్నారా? బరువు తగ్గడం, పుస్తకం రాయటం, జాబు సంపాదించటం, ఇల్లు కట్టడం వంటి ఏదైనా ఒక ప్రత్యేక మైన ఫలితాన్ని ఆశిస్తూ చేస్తున్నారా అనే దానిని దృష్టిలో పెట్టుకుని మీ విజన్ బోర్డ్ సైజ్ నిర్ణయించుకోండి.

స్టెప్ 3: మీ లక్ష్యాలకు, మీరు మీ జీవితంలోకి ఆకర్షించాలనుకుంటున్న అన్ని అంశాలను తెలియజేసేలా ఉన్న చిత్రాలను కత్తెర సహాయంతో కట్ చేసి పక్కకి పెట్టుకోండి. అలా మొత్తం జీవితంలోని అన్ని విషయాలకు / జీవిత ప్రాధాన్యాలకు (categories or priorities or dimensions of life) సంబంధించిన చిత్రాలు కట్ చేసిన తర్వాత మీ బోర్డులో ఎక్కడ దేనిని అతికించాలో పెట్టి చూసుకోండి. అవసరాన్ని బట్టి పదాలు లేదా మాటలు లేదా స్టేట్ మెంట్స్ కొన్ని  తెల్ల కాగితం పై స్కెచ్ పెన్ లతో రాసుకోండి. బోర్డు మధ్యలో లేదా పై భాగంలో కొంత ఖాళీ మీ అందమైన , మీరు ఆత్మ విశ్వాసంతో ఉన్న ఆకర్షణీయమైన ఫోటో, నా విజన్ బోర్డ్ అని టైటిల్ ఎక్కడపెట్టాలో నిర్ణయించుకుని అన్ని చిత్రాలు గ్లూ స్టిక్ తో అంటించండి. వీలైతే  మీకు బాగా  ఇన్ స్పైరింగ్ గా అనిపించే చిత్రాలు మాత్రమే ఒక దాని పక్కన ఒకటి పెట్టి నచ్చిన విధంగా అతికించండి. అన్ని ఒకే సైజ్ చిత్రాలు ఉండాలని లేదు. ఒక్క విషయం గుర్తుంచుకోండి ఆ చిత్రాలు చూస్తే మీకు తక్షణం ఆ విధంగా మిమ్మల్ని నడిపించేలా ఆ చిత్రాలు ఉండాలి. మీరు రాసుకునే పదాలు, మాటలు కుడా శక్తి వంతంగా ఉండేవి ఎన్నుకోండి. ఈ విధంగా మీ విజన్ బోర్డ్ సిద్దమైనట్లే. కావాలంటే మీకు నచ్చిన కలర్ పేపర్స్ తో , పదాలతో ఇంకా ఆకర్షణీయంగా చేసుకోండి. వీలైనంత వరకు మీ బోర్డ్ లో మీ సొంత ఫోటోలు వాడండి. మీరు ప్రస్తుతం లావుగా ఉంది ఆరోగ్యంగా అవ్వడం మీ లక్ష్యం పెట్టుకుంటే, ఎత్తుకు తగ్గ బరువు ఉన్న నాజూకు ఫోటో తీసుకుని తల ప్రదేశంలో మీ ఫోటో పెట్టి మీరే అలా ఉన్నట్లు ఇమేజ్ చేసుకొని అతికించుకోండి. సొంత చిత్రాలు మీ మైండ్ పై అత్యంత ప్రభావాన్ని చూపుతాయి.

మీ విజన్ బోర్డ్ ఎలా వాడుకోవాలి :

సినిమా హీరో లు హీరోయిన్ల ఫొటోస్ ఇంట్లో పెట్టుకునే వారు చాలా మంది ఉన్నారు.  మీ జీవితాన్ని అర్ధవంతంగా నిర్మించుకోడానికి మీఫోటో తో, మీ విజన్ బోర్డ్ పెట్టుకుంటే తప్పేమీ లేదు. ఇది మీ లైఫ్ , మీ లైఫ్ కు మీరే  కింగ్, మీ సామ్రాజ్యానికి  మీరే మహారాణి కాబట్టి సిగ్గు పడొద్దు. ఎవరేమనుకుంటారో అని దాచిపెట్టొద్దు. మీ ఫస్ట్ రూమ్ లో, మీ బెడ్ రూమ్ లో లేదా ఏదైనా మీరు నిత్యం చూసే ప్లేస్ లో పెట్టండి.
  •  విజువలైజేషన్ మరియు ఫీలింగ్స్: ప్రతి ఉదయం మీ కాలకృత్యాలు, మెడిటేషన్, శారీరక వ్యాయామం అయిపోయాక స్నానం చేసి ప్రశాంతంగా 5 నిమిషాలు మీ విజన్ బోర్డ్ చూడండి. దానిలో చిత్రాల్లో ఉన్నట్లుగా మీ జీవితం అందంగా, ఆనందంగా, విజయవంతంగా రూపుదిద్దుకున్నట్లుగా (transform) ఊహించుకోండి. అలా ఊహించినప్పుడు మీలో కలిగే భావనలు, ఫీలింగ్స్ ద్వారా మీరు ఈ సృష్టిలోకి ఒక తరంగాలు (వైబ్రేషన్స్)  విడుదల చేస్తారు. అవి ఇంకా ఎక్కువ అటువంటి ఫీలింగ్స్ సృష్టించేలా జీవితాన్ని మార్చుకునేలా మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. వాటిని మీ జీవితంలోకి త్వరగా ఆహ్వానిస్తుంది.
  • చిత్రాల యంత్రంలో మాటల మంత్రం: అవును . విజన్ బోర్డ్ మీరు ఆశించిన ఫలితాలని మీ వైపు ఆకర్షించడానికి, మీ సబ్ కాన్షియస్ మైండ్ ని ప్రోగ్రాం చేయడానికి శక్తి వంతమైన చిత్రాల రూపం అయితే వీటికి తోడు మిమ్మల్ని నడిపించే అత్యుత్తమమైన మాటలు, ఉత్ప్రేరక పదాలు చదవటం ద్వారా, బొమ్మలకు అనుసంధానంగా పాజిటివ్ అఫిర్ మేషన్స్ ద్వారా మీ లక్ష్యాలపై  మీ అంతర్గత శక్తులను కేంద్రీకరించవచ్చు. అందుకే మీ విజన్ బోర్డ్ చూస్తూ సాధించినట్లు ఊహించుకున్నట్లే, వాటిని చూస్తూ మీ పాజిటివ్ అఫిర్ మేషన్స్ చదవండి. మననం చేసుకోండి.
  • ఒక పన్నెండు నెలల ఆట. ఈ విజన్ బోర్డ్ లో మరో పన్నెండు నెలలో సాధించాల్సిన ఫలితాలకొరకు చేసుకోండి. అయితే ప్రతి రోజు పై మూడు స్టెప్ లలో చెప్పిన విధంగా చేయండి. అయితే ఆ పనిని ఒక రోజు చేస్తే సరిపోదు. మీ జీవితంలో భాగం ఐపోయే వరకు చేయాలి. అదేంటి నేను చేసినవి వెంటనే అవ్వలేదు అనుకోవద్దు. కచ్చితంగా అవుతున్నాయి, ఇంకా బాగా చేయాలంటే నేను ఏమి నేర్చుకోవాలి అని ఆలోచిస్తూ మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఈ విజన్ బోర్డ్  ఎక్సర్ సైజ్ లు చేయండి. మీలో , మీ మైండ్ లో ఉన్న కొత్త శక్తులు మీకు పరిచయం అవుతాయి. పై మూడు పద్దతులద్వారా ఎక్కువకాలం మీ లక్ష్యాలు గుర్తుంటాయి, ఫలితాలకోసం పనిచేయాలనే తపన మీలో ఉంటుంది ఎందుకంటే చూస్తూ, చదువుతూ, ఊహించుకుంటూ నేర్చుకుంటే ఎడ్గార్ డేల్ (Edgar Dale) శాస్త్రవేత్త చెప్పినట్లు మనిషి 50% కి పైగా నేర్చుకుంది గుర్తుంచుకో గలడు. అందుకే ఒక సంవత్సరం కమిట్ మెంట్ తో చేయండి.    
 
మీ విజన్ బోర్డ్ తయారీలో అవసరం అయితే సాఫ్ట్ కాపీస్  ఇమేజెస్ తీసుకుని కంప్యూటర్ లో చేయించుకొని కూడా మీ ఇంట్లో వాల్ మీద లేదా వుడ్ వర్క్ చేసిన డోర్ మీద పెట్టించుకోవచ్చు. పిన్ బోర్డ్ వాడితే ఇమేజెస్ ని పిన్ లతో పెట్టాల్సి వస్తుంది. కాని అవి ఊడిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి.

అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు భక్తులు, పవిత్ర రమజాన్ మాసంలో మహమ్మదీయ సోదరులు 40 రోజులు ఉపవాసం దీక్ష ఉంటారు. చాలా మంది చెడు అలవాట్లు మానేయ గలుగుతారు. దీనికి ఒక సైకలాజికల్ కారణం ఉండకపోలేదు. ఏదైనా పని 21 రోజులు చేస్తే అది జీవితంలో భాగం అయ్యే (అలవాటు) అవకాశం ఉంది. అలాంటిడి మీ విజన్ బోర్డ్ చేసిన తర్వాత ఎక్సర్ సైజ్ లు ఆరు వారాలు 42 రోజులు చేయండి ఇది మీ జీవితంలో భాగ అవటమే కాకుండా ఇంకా ఉన్నతంగా చేయటం ఎలా అనే ఆలోచనలు వస్తాయి, మీ పై మీకు నమ్మకం పెరుగుతుంది.

 ********
"సైకాలజీ టుడే" మాస పత్రికలో  నేను రాస్తున్న  న్యూ లైఫ్ కాలమ్ లో జూలై 2014 కోసం  ప్రచురింపబడిన ఆర్టికల్ 

3 comments:

  1. Dear Sir,
    This is very useful article. We came to know the value of vision board first time from your article. Please share with us many practical tips and tools.

    Sanjeev
    High School Teacher,Karimnagar

    ReplyDelete
  2. Hi sir,
    Your article excellent.In This Message you wrote in Telugu language is very useful to all . Please Share these type of Messages.

    Thank you Once again,
    Harsha Muchakala,
    S/W Engineer.
    Hyderabad.

    ReplyDelete
  3. Dear Harsha,
    Thank you for your feedback. Hope the articles are useful for your personal transformation :) Best wishes.

    ReplyDelete