Monday, 8 September 2014

ఉన్నత అలవాట్లతో ఉన్నత జీవితం సృష్టించుకోండి - Create Empowering Life with Empowering Habits


ఇంటిలో, బడిలో, సమాజంలో, వ్యక్తిత్వ వికాస పుస్తకాలలో, శిక్షణా కార్యక్రమాలలో రిపీటెడ్ గా చెప్పే అంశం “ఉన్నత అలవాట్లు జీవిత అభివృద్ధికి మెట్లు”. ఎందుకు అలా అంటారు. విజయానికి చిట్కా ఏమిటంటే ఉన్నత అలవాట్లను ఎన్నుకోవడం, వాటిని జీవితంలో భాగంగా చేసుకోవడం. అంతే. వెరీ సింపుల్. ఉన్నత అలవాటు మీ జీవితంలో భాగం అయ్యేకొంది, మీరు క్రమశిక్షణ తో కూడిన వ్యక్తిగా కనిపిస్తారు. కాని నిజానికి మీరు నిత్యం చేయడానికి ఒక ఉపయోగపడే పని కలిగిఉన్న వ్యక్తిగా మారతారు. మీరు ఒక ముఖ్యమైన క్రమశిక్షణని  ఎన్నుకుని శక్తివంతమైన అలవాటుగా మార్చుకున్న వ్యక్తిగా మారతారు.
ఒక వ్యాధి- ఒక అల వాటు – ఒక విజయం:


అతనికి  చిన్నవయస్సులో ఏ.డి.హెచ్.డి. (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్) ఉన్నట్లు గుర్తించారు. కిండర్ గార్టెన్ టీచర్ తల్లితో చెప్పింది – “ మీ బాబు ఒక చోట తిన్నగా కుర్చోలేడు, నిశ్శబ్దంగా  ఉండలేడు, అతను ఒక బహుమతి లాంటి కొడుకు కాదు. అతను దేని మీద ధ్యాస నిలపలేదు, దేని మీద ఫోకస్ చేయలేడు”. పదకొండు సంవత్సరాల వయసులో అతని ప్రవర్తన బాగాలేదని స్విమ్మింగ్ పూల్ లో లైఫ్ గార్డ్ స్టాండ్ ని పట్టుకుని అలాగే గంటల కొద్ది నీళ్ళల్లో నిలుచునే వాడు. ఆ ప్రవర్తన లోపాలు కొంత పెద్దయ్యాక కూడా అతన్ని వదిలేయలేదు. 14 సంవత్సరాల వయసు నుంచి అతనికి రోజుకి కనీసం 6 గంటలు, వారానికి ఏడు రోజులు, సంవత్సరానికి 365 రోజులు స్విమ్మింగ్ లో శిక్షణ ఇచ్చారు. ఆ శిక్షణలో అతని శక్తి అంతా ఒక అలవాటుని అభివృద్ది చేసుకోడానికి ఒక క్రమశిక్షనకోసం వెచ్చించాడు – రోజూ ఈదటం.  ప్రతి క్షణం గాలి తీసుకోవటం ఎలాగో, ప్రతి రోజూ ఈదటం అలాగే అన్నట్లు ఈత జీవితంలో భాగమైంది. 2004 లో ఏథెన్స్ లో 8 మెడల్స్, 2008 లో బీజింగ్ ఒలింపిక్స్ లో 8 మెడల్స్, 2012 లో లండన్ లో ఒలింపిక్స్ తో 22 మెడల్స్ తో కలిపి అతను రిటైర్ అయ్యేనాటికి ప్రపంచంలో స్పోర్ట్స్ చరిత్రలో ఆల్- టైం రికార్డు సొంతం చేసుకుని అత్యంత ఆకర్షణీయమైన ఒలింపియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతని తల్లి కొడుకు క్రమశిక్షణ, ఫోకస్ తనని ఆశ్చర్య పరుస్తుందని చెప్తుంది. అదే తల్లికి కిండర్ గార్టెన్ టీచర్ “దేని మీద ఫోకస్ చేయలేదడు” అని చెప్పింది. అతనెవరో గుర్తుపట్టారా? అతనే మైకేల్ ఫెల్ప్స్. అతనికి 11 సంవత్సరాల వయసు నుంచి కోచింగ్ ఇచ్చి తోడ్పడిన వ్యక్తి “బౌ మాన్”. అయితే ఈ రియల్ స్టొరీ లో అద్భుతం ఎలా సాధ్యమైంది?  ఒకే ఒక ఎంపిక  చేసుకున్న  క్రమశిక్షణ కోసం కట్టుబడి ఉండటం వలన.
ఉన్నత క్రమశిక్షణ అభివృద్ధి చేసుకోవటం వలన దీర్ఘ కాలంలో ఉన్నత లాభాలుంటాయి. అది మీరు వెతుక్కుంటున్న విజయాన్ని మీ జన్మహక్కు అయిన ఎక్స్ లెన్స్ ని మీ దరికి చేరుస్తుంది. మీ జీవితం చాలా స్పష్టంగా, క్లిష్టతరం కాకుండా సరళంగా తయారౌతుంది ఎందుకంటే మీకు ఏది బాగా చేయాలో , ఏది చేయకూడదో తెలుస్తుంది. క్రమశిక్షణను సరైన అలవాటు నిర్మించుకోడానికి ఉపయోగించుకోవటం మాత్రమే ఉపయోగిస్తే అది మీ ఎక్స్ లెన్స్ కి “లైసెన్స్” లా , మీ జీవితంలోని అనవసర అంశాలకి “అవుట్ పాస్” లా పని చేస్తుంది. ఇది సత్యం. మీరు సరైన పని చేసినపుడు  అది మీకు జీవితంలో మీ ప్రతి పనిని మానిటర్ చేయాల్సిన అవసరం లేని స్వేచ్చ కూడా ఇస్తుంది.

మేజిక్ స్వీట్ స్పాట్ కి 66 రోజులు:
క్రమశిక్షణ (Discipline), అలవాట్లు (Habits) అంటే చాలా మందికి మాట్లాడడం ఇష్టం ఉండదు. ఆ మాటల శబ్దాలు, ఆ చిత్రాలు మైండ్ లోకి రాగానే మనుషులు అలిసిపోతారు. హహ కనీసం అలా ఫీల్ అవుతారు. అమ్మో..నా బలాలు-బలహీనతల ఆత్మ పరిశీలన చేసుకోవాలేమో అనుకుంటారు. లేదా ఎందుకు చేయలేకపోయానంటే....అని కారణాల చిట్టా మొదలు పెడతారు. కాని క్రమశిక్షణ, అలవాట్లు ఉన్నతంగా నిర్మించుకోగలిగితే జీవితం అద్భుతంగా మారుతుంది.  అందుకే మీ జీవితాన్ని మేజిక్ లా మార్చగలిగే ఆ స్వీట్ స్పాట్ ఏంటో దానిని జీవితంలో ఎలా భాగం చేసుకోవాలో తెలుసుకుందాం రండి. మీకు శుభవార్త ఏంటంటే మంచి క్రమశిక్షణ దీర్ఘ కాలం ఉంటుంది. అలవాట్లు ప్రారంభంలోనే ఇబ్బందిగా అనిపిస్తాయి. నిర్విరామంగా కొనసాగించే కొద్దీ ఆ అలవాటుని కొనసాగించటం మీకు సులభమౌతుంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన కీలక అంశం. అలవాట్లు ప్రారంభించేటప్పుడు కంటే జీవితాంతం కొనసాగించ దానికి తక్కువ శక్తి, ఫోకస్ చాలు. ఒక క్రమశిక్షణ ఎక్కువ కాలం కొనసాగిస్తే అది మీ జీవితంలో భాగం అయిపోతుంది. ఒకసారి ఈ విషయాలు ఆలోచించండి. వంట చేయడం, పొద్దున్నే టీ తాగటం, లంచ్ తర్వాత ఒక సిగరెట్ కాల్చడం, ఈవెనింగ్ వాకింగ్ కి వెళ్ళటం, స్నేహితులు వద్దకి వెళ్లి వచ్చాక మనం క్షేమంగా చేరామని చెప్పటం...ఇలా మీరు రోజు వారి చేసే కార్యక్రమాలు చెక్ చేసుకోండి చిన్న క్రమశిక్షణ లా కొంతకాలం కొనసాగించి అలవాటుగా చేసుకున్నవే. మంచి చెడు ఏదైనా అలాగే జీవితంలో భాగం అయిపోతాయి. ఒక కొత్త ప్రవర్తన మన అలవాటుగా మారితే, దానిని రోజువారి జీవితంలో భాగం చేసుకోడానికి పెద్ద శ్రమ పడనవసరం లేదు.
అందుకే మన క్రమశిక్షణ ఎక్కువ కాలం కొనసాగిస్తే అలవాటుగా మారుతుంది. ఒక మంచి అలవాటు జీవితంలో భాగం అయ్యాక దానిని మైంటైన్ చేయటం ఈజీ. అలా మీ రోజు వారి కార్యక్రమాలు కూడా సులభంగా కంటిన్యూ చేస్తారు, కొత్త అలవాటు లాభాల్ని రుచి చూస్తారు. మీ ఆత్మ విశ్వాసం , ఆత్మ గౌరవం పెరుగుతుంది. ఆ తర్వాత ఇంకో క్రమశిక్షణ తీసుకోవచ్చు. అయితే ఎన్ని రోజులు ఈ క్రమశిక్షణ (కొత్త పని, ప్రవర్తన) కొనసాగించాలి అంటే వ్యక్తిత్వ వికాస శిక్షణలలో, పుస్తకాలలో ఎక్కువగా 21 రోజులు అని నేర్చుకుంటాము. అయితే దీనిని ఇప్పటికీ  ఆధునిక సైన్సు ప్రకారం నిరూపించాబడినట్లు మనకు రుజువులు లేవు. అయితే దీనికి యూనివర్సిటీ కాలేజీ అఫ్  లండన్ వారు 2009 లో చేసిన రీసెర్చ్ ఒక శాస్త్రీయ సమాధానాన్ని ఇచ్చింది. ఒక కొత్త ప్రవర్తన ఒక అలవాటుగా ఎన్ని రోజులకి మారుతుంది అని పరిశోధన చేసారు. 18 రోజుల నుంచి 254 రోజులు పట్టింది అయితే  దాదాపు 66 (అరవై ఆరో ) రోజు ఒక స్వీట్ స్పాట్ అని ఆ రోజు ఎక్కువ మంది అలవాటు నిర్మించుకూగాలిగారని కనిపెట్టారు.
మంచి అలవాట్లు ఉన్నవారిపై మేగాన్ ఊటేన్  మరియు కెన్ చెంగ్ చేసిన ఒక రీసెర్చ్ లో ఉన్నత అలవాటు విజయవంతంగా వారి జీవితాల్లో భాగం చేసుకున్న విద్యార్థులు జీవితాలు ఎంతో బాగున్నాయని, తక్కువ ఒత్తిడి కలిగి ఉన్నారని, అనవసర ఖర్చులు తగ్గించుకున్నారని, మంచి ఆహార నియమాలు నేర్చుకున్నారని, మద్యపానం, సిగరెట్స్ తగ్గించారని కనుగొన్నారు. ఉన్నత అలవాట్లు ఉన్నవారు ఉన్నతంగా పనిచేయగలరు. ఎందుకంటే చాల ముచ్యమైన పనులు వారు క్రమం తప్పకుండా చేయగల నైజం కలిగి ఉంటారు.
గుర్తుంచుకోండి – అలవారుచుకోండి:
  • క్రమశిక్షణా యుత వ్యక్తిగా కంటే ఉన్నత అలవాట్లు పాటించే శక్తిగా, ఎంపిక చేసుకున్న ఉన్నత క్రమశిక్షణలు ప్రాక్టీసు చేసే వ్యక్తిగా మారండి
  • ఒక సమయంలో ఒక  అలవాటు ఏర్పరుచుకోండి. ఒక సమయంలో ఒకటే తీసుకుని , దానిని ఎక్కువ కాలం ప్రాక్టీసు చేస్తూ కొనసాగించండి.
  • ప్రతి అలవాటుకు తగినంత సమయం కేటాయించండి. దాదాపు 66 రోజులకు అలవాటు అవుతుంది. ప్రాక్టీసు చేయండి. అయితే అలవాటుగా మారడానికి మీకు ఎక్కువ రోజులు ప్రాక్టీసు అవసరం అనిపిస్తే కాన్షియస్ గా ఎక్కువ రోజులు కూడా ప్రాక్టీసు చేయండి.
 మీరు ఏది నిర్విరామంగా (రిపీటెడ్) చేస్తారో అదే మీరు అవుతారు. అంటే సాధించడం అనేది ఒక పని కాదు, ఒక అలవాటు. అందుకే ఎక్స్ లెన్స్ కోసం , సక్సెస్ కోసం మీరు అర్రులుచాచనవసరం లేదు. ఉన్నత క్రమశిక్షణలు గుర్తించి, ఫోకస్ తో వాటిని మీ డైలీ లైఫ్ లో భాగం అయ్యేలా అలవాట్లు నిర్మించుకుంటే చాలు. అద్భుత ఫలితాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఆ అద్భుత అలవాట్లు నిర్మించుకునేలా ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.  ప్రయత్నం చేసి మీ సక్సెస్ స్టొరీ మాతో పంచుకోండి. ఎక్స్ లెన్స్ మీ జన్మ హక్కు. దానిని నిజం చేసి చూపించండి మీ అలవాట్లతో.  బెస్ట్ విషెస్.
*****
                     "సైకాలజీ టుడే" మాస పత్రికలో  నేను రాస్తున్న  న్యూ లైఫ్ కాలమ్ లో సెప్టెంబర్ 2014 కోసం  ప్రచురింపబడిన ఆర్టికల్  

No comments:

Post a Comment