Saturday, 9 April 2016

బిగ్ బిజినెస్ సృష్టించడానికి 5 మెట్లు [ Five Steps To Create A Big Business ]

“మా కళ్ళ  ముందే చిన్న పనులతో ప్రయాణం మొదలుపెట్టాడు, కళ్ళు మిరుమిరుమిట్లు గొలిపే విజయం సాధించాడు”
“ఏదో బ్రతకడానికి బజ్జీల బండి పెట్టుకున్నాడు, ఇప్పడు బిజినెస్ లో  బాగా దూసుకెళ్ళిపోతున్నాడు”
“ఆవిడ పాపం తప్పనిసరి పరిస్థితుల్లో ఇంట్లోనే మిషన్ కుట్టి కుటుంబాన్ని పోషించేది, ఇప్పుడు వాళ్ళ కుటుంబం మొత్తం రకరకాల వ్యాపారాలలోకి వెళ్ళిపోయారు” ....ఇలాంటి నిజమైన సక్సెస్ స్టోరీస్  మీరు వినే ఉంటారు.
మీ చుట్టూ ఉన్న కొందరి రియల్ స్టోరీస్ గమనించినపుడు మీరు ఇలాగే ఫీల్ అయి ఉంటారు. మరి వారికి అద్భుత విజయం ఎలా సాధ్యమైంది? అందరిలా మొదలుపెట్టి, అందరికంటే ముందుగా, ఇతరులు ఊహించనంతగా సక్సెస్ సాధించిన వారు ఏమి చేసారు? వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? చిన్న వ్యాపారం నుంచి బిగ్ బిజినెస్ సృష్టించాలంటే ఎక్కవలసిన ఆ ఐదు మెట్లు ఏమిటి? ఇటు వ్యాపానికి, అటు ఉద్యోగానికి... ముఖ్యంగా ఉన్నత జీవితానికి ఉపయోగపడే ఆ ముఖ్యాంశాలేమిటో చూద్దాం.
***    ***    ***    ***    ***    ***
చిన్న వ్యాపారం మొదలుపెట్టటం, దాని ద్వారా వినియోగదారులకు ఉన్నత సేవలు, వస్తువులు అందించడం, వారి సమస్యలకు విలువైన సోల్యూషన్స్ ఇవ్వటం, అందుకు వారినుంచి డబ్బుని తీసుకోవటం అనేది ధైర్యవంతమైన పని. ఎంట్ర ప్రెన్యూర్ చేసేది అదే. మనలో చాలా మంది తమకు నచ్చిందని, ఆ ఏరియా లో ఎవ్వరు పెట్టలేదని, ఇతరులు  ఆ వ్యాపారంలో బాగా సంపాదించారని, తక్కువ పెట్టుబడితో వీలైందని, రిస్క్ లేని వ్యాపారం అని ఇలా రకరకాల కారణాలతో వ్యాపారం మొదలు పెడతారు. కానీ రోజువారి పనులు, పరిస్థితులు, నిజంగా ఆ ప్రోడక్ట్ అవసరం  స్థాయి (ఎవరికి , ఎప్పుడు, ఎక్కడ), ఆ ఫీల్డ్ లో ఇప్పటికే ఉన్న వారు సృష్టించిన కల్చర్, మారుతున్న ఆర్ధిక పరిస్థితులు, టెక్నాలజీ రెవల్యూషన్ వంటి ప్రభావాల వలన ఉన్న అభిరుచి, ప్యాషన్ కాస్త తగ్గే అవకాశం ఉంది. మీ లక్ష్యాల జర్నీ నుంచి ట్రాక్ పక్కకు లాగినట్లు, మీ ప్రయత్నాల దారిలో అడ్డంకులు వేసినట్లు రియాలిటీ కాస్త ఊహకు తేడాగా కనిపించొచ్చు. అనుభవ రాహిత్యం, ఇంకాస్త ప్రయత్న లోపం వలన లాభాలు తగ్గొచ్చు. ఒకోసారి అప్పటికే లాభాల కోసం ముందుకు వెళుతున్న పరిస్థితుల్లో , మళ్ళీ తిరోగమనం దిశగా వెళ్ళొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ ఐదు ముఖ్యమైన మెట్లు ప్రతి చిన్న వ్యాపారస్తుడు అర్థం చేసుకోవాలి , అధిరోహించాలి.


సోపానం 1: నేర్చుకోవడం ఎప్పటికీ ఆగదు       
ట్రైనింగ్ ప్రోగ్రాం లలో తరచు అడిగే ఒక ప్రశ్న .
మీలో ఎవరికి మార్పు కావాలి? అందరు చేతులు ఎత్తుతారు.
మీలో ఎవరు మారడానికి సిద్దంగా ఉన్నారు? .......కాసేపు సైలెన్స్.
ఆ సైలెన్స్ కి ముఖ్య కారణాలు రెండు.
  1. 90% పైగా ప్రజలు “మారడానికేముంది నేను అన్నీ కరెక్ట్ గానే చేస్తున్నా కదా?”  అనుకోవడం. ఇది వాస్తవమా? కాదా? తెలుసుకోలేకపోవటం.
  2. నా రిజల్ట్ ఇలా ఉండడానికి కారణం ఏమిటి అంటే.....”  అంటూ కారణాలు వెతుక్కోవటం.  
ఇంకొంచం నిశితంగా గమనిస్తే ....
పాయింట్-1 ప్రకారం మారడానికి ఏమి లేదు అనుకుంటే , మరి మీకు రిజల్ట్ బాగా వచ్చి ఉండాలి. వస్తుందా? ఒకరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదేమో, కాని మనల్ని మనం మోసగించుకోకూడదు మిత్రులారా? వ్యాపారం ఐనా జీవితం అయినా అకౌంటబిలిటీ ముఖ్యం, సెల్ఫ్- అకౌంటబిలిటీ చాలా ముఖ్యం.
ఇక పాయింట్-2 ప్రకారం మీకు రిజల్ట్ రాకపోడానికి కారణాలు వెతుక్కుంటూపోతే  ఉదయం నిద్రలేకపోవడానికి కారణం రాత్రి మా వీధిలో కుక్కలు మొరగటమే కారణం అన్న వద్ద మొదలై వర్షాకాలం వర్షం చిరాకు, ఎండాకాలం వేడి, బస్సులలో రద్దీ...ఇలా పెద్ద లిస్టు  చెప్పుకోవచ్చు. కేవలం ఫైల్యుర్స్ కి  కారణాలు కనుక్కుంటే వ్యాపారాలు నిర్మించలేము. తెలివైన ఎస్కేపిస్ట్ స్థితిని దాటి ఫలితాలకు బాధ్యత వహించే వ్యక్తిగా మారాలి. అందుకే మా ట్రైనింగ్ కార్యక్రమాలలో చెప్తుంటాము మీ busyness నిజమైన బిజినెస్ గా మార్చుకోండి అని.
చాలా వ్యాపారాలలో (కొన్ని కార్పొరేట్ కంపెనీలు  కూడా) మా ఉద్యోగస్తులకి రెండుగంటలు, ఒక పూట / ఒక్క రోజు మోటివేషన్ కావాలి అంటారు. మోటివేషన్ అంటే ట్రైనింగ్ కి మరో పేరు అనో, మోటివేషన్ అంటే ట్రైనింగ్ అనో అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాస్త అవగాహన ఉన్న కొందరు ఒక వారం ట్రైనింగ్ ఇప్పిస్తారు. గొప్ప పాఠం ఏమిటంటే మీ  సిబ్బంది అందరికీ , మీకూ నిరంతరం శిక్షణ (ట్రైనింగ్ ) అవసరం. ఇది ఒక నిరంతర ప్రక్రియ. దీనికి రెండు పెద్ద సవాళ్ళు  ఏమిటంటే సమయం (టైం), శిక్షణ ఖర్చు (మనీ). సమయాన్ని అడ్డంకి అనుకుంటే మీ ఎంప్లాయిస్ రోజువారీ పనులలో  ఉపయోగపడే స్కిల్ల్స్ నేర్చుకుని , ఇతరులకు నేర్పడం అనేది వారి బాధ్యతలలో భాగం చేయండి. 

సోపానం 2: విషయజ్ఞానం ఇవ్వండి, నిరదారితంగా చెప్పొద్దు         
ఈరోజుల్లో అతిగా మార్కెటింగ్ చేస్తే అది గోల గోల గా చేసినట్లు ఔతుంది. మార్కెటింగ్ అంటే మీ ప్రాముఖ్యతల గురించి, మీ సంస్థ కి వచ్చిన అవార్డ్ లు, గుర్తింపుల గురించి చెప్పటం కాదు మార్కెటింగ్ అంటే అవసరం ఉన్న వ్యక్తులతో బంధాన్ని ఏర్పరుచుకోవడం, వారి అవసరాలను మీరు ఎలా తీరుస్తారో , ఎంత ఉన్నతంగా ఆ పని చేయగలరో చెప్పడం. అందుకు విషయ జ్ఞానం ఇవ్వాలి . మోటివేషన్ కొన్నాళ్ళే ఉంటుంది, అయితే ఎక్కువ కాలం బిజినెస్ ఉండాలి, ఉన్నతంగా ఎదగాలి అంటే కొన్ని విధానాలు టీం కి నేర్పగలగాలి అందుకు ప్రతినెల శిక్షణ అవసరం అని చెప్పడానికి కారణం ఇదే. ఉన్నత మార్కెటింగ్ అనేది విషయజ్ఞానం ఇస్తుంది, ఒప్పిస్తుంది, నమ్మకంగా సర్వీస్ , ప్రోడక్ట్  వినియోగించేలా చేస్తుంది. ఇతర సంస్థలు కూడా మీరు ఇచ్చే సర్వీస్ ఇస్తూ ఉంటాయి. కేవలం మా వద్ద కూడా ఫలానా సర్వీస్ లు ఉన్నాయని ఊక దంపుడు ప్రకటనలు గుప్పించి  తక్కువ నాణ్యత అందించే వారు కొన్నాళ్ళు మార్కెట్ లో ఉన్నా తర్వాత కనుమరుగై పోతారు. అలాంటి  పోటీదారులు ఉన్నచోట ఉన్నతమైన ఆశయంతో, కనీస నాణ్యతతో, సృజనాత్మక విధానాలతో, ఉన్నత వినియోగదారుల సేవతో మీరు రాణించవచ్చు. ఇందుకు నిబద్దత అవసరం. 

సోపానం 3:  సేల్స్ అనేది చెడు మాట కాదు          
నిజానికి ఒక చిన్న వ్యాపారం లేదా సంస్థ లో ఉన్న ప్రతి వ్యక్తి సేల్స్ లో ఉన్నట్లు, లేదంటే ఖచ్చితంగా సేల్స్ కి వ్యతిరేక డిపార్టుమెంటు లో ఉన్నట్లే. అవును చేదు మందులా ఉన్నా , ఇది వ్యాపార ఆరోగ్యాన్ని కాపాడే వాస్తవం. ఒక వ్యక్తి తన బాధ్యతల్లో సేల్స్ కి ఎలా దోహదపడుతుందో తెలుసుకోవాలి. ఒక టీచర్ తన క్లాసు లో ఉన్న పిల్లలతో ఎలా ఉంటున్నారు అనేది ఆ పిల్లలు ఇంటికి వెళ్లి స్కూల్ గురించి ఎలాంటి ముచ్చ్చట్లు షేర్ చేస్తారు అనేది ఆధారపడి ఉంటుంది. మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తే, ఆ ప్రభావం ఉన్నతంగా ఉంటుంది. అది పేరెంట్స్ లో తర్వాతి విద్యా సంవత్సరంలో  అక్కడే చదివించాలా వద్దా అనే నిర్ణయానికి దోహదం చేస్తుంది. ఈరోజుల్లో ఏదో ఒకటి చేసి  ప్రోడక్ట్ , సర్వీస్ ని అంటగట్టే వాళ్ళు సేల్స్ లో ఉండలేరు. ఇప్పుడు కస్టమర్ కి ఎక్కువ విషయ పరిజ్ఞానం ఉంది, అవసరమైతే సామాజిక మాధ్యమాలలో, ఆన్ లైన్ లో మీ గురించి, మీ సర్వీస్ గురించి, మీకు మీ కాంపిటీటర్ కు వ్యత్యాసం గురించి తెలుసుకుని వస్తారు. ఇప్పుడు సేల్స్, మార్కెటింగ్ వ్యక్తికి కావలసింది పెద్దమొత్తం లో - ఎదో ఒకటి చెప్పి- అమ్మే వాళ్ళు కాదు. స్పష్టంగా అవసరమైన ప్రశ్నలు వేస్తూ, కస్టమర్ అవసరాలు మనసుతో తెలుసుకుని, వారి అవసరాలకు ప్రోడక్ట్ ఇచ్చే సొల్యూషన్ ని మ్యాచ్ చేసి ఒప్పించగల వాళ్ళు, కస్టమర్ ఆనందంగా నిర్ణయాలు తీసుకునేలా చేయగలవారు, సంస్థ పై నమ్మకాన్ని కస్టమర్ మనసులో ముద్రించ గలవారు. ప్రోడక్ట్ గురించి ఊదర గొట్టే నాలెడ్జ్ మాత్రమే కాకుండా కస్టమర్ నిజమైన అవసరాలు ఏమిటి, వాటిని ఎలా చేరుకోగలరు అనే సంభాషణ ఉన్నతంగా చేయగలవారు.



సోపానం 4:  మీ బ్రాండ్ తో జీవించండి           
కాకినాడ కాజా, హైదరాబాద్ బిర్యాని, గుంటూరు మిర్చి చాలా గుర్తింపు ఉన్న మాట మనందరికీ తెలిసిందే. కాని ఒక్క సారి ఈ ప్రదేశాలకు వెళ్ళాక కొత్త వారికి కూడా ఇంకోటి తెలుస్తుంది.
కాకినాడ కోటయ్య స్వీట్స్, హైదరాబాడ్ పారడైస్ బిర్యాని, గుంటూరు కోమల విలాస్.....బ్రాండ్ గుర్తింపు అంటే ఇది.  మీ ప్రాంతంలో మీరు ఎంచుకున్న ప్రోడక్ట్ , సర్వీస్ కు ఒక బ్రాండ్ నేమ్ గా గుర్తింపు రావాలి. అందుకు ప్రయత్నించాలి. చిన్న వ్యాపారం ఉన్న వాళ్ళకి కొందరికి ఈ పదాలు తెలియవు. కొందరు జనాల్లో గుర్తుండిపోయేలా క్రియేటివ్ గా కొన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. ఎవరు బ్రాండింగ్ చేస్తారో వాళ్ళతో ప్రజలు బాండింగ్ (బంధాలు) కొనసాగిస్తారు. ఎవరికి బంధాలు ఎక్కువ ఉంటాయో వారికి బిజినెస్ బాగుంటుంది. మీ బ్రాండింగ్ అనేది మీకు అద్దం (మిర్రర్) వంటిది. ఇది మీ నిజ ప్రతిరూపం వంటిది అలాగే కస్టమర్స్ తమని తాము అందులో  చూసుకోడానికి మీతో కలిసిపోడానికి అవకాశాన్ని ఇస్తుంది. తమకి ఎదురైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఒక్కొక్క కస్టమర్ మీ బ్రాండ్ గురించి ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది. అందుకే మీ వెబ్ సైట్, మీ బిజినెస్ కార్డు, మీ ఆఫీస్ లో ఎంప్లాయిస్ మాట్లాడే విధానం, మీ ప్రోడక్ట్,  సర్వీస్  తర్వాత మీరు ఇచ్చే సేవలు అన్నీ జాగ్రత తీసుకోండి. అందమైన, ఉన్నత మైన అనుభవంలా ఇచ్చే ప్రయత్నాలు చేయండి.

సోపానం 5:  సరైన సమయం కోసం వెయిట్ చేయకండి              

మిస్టేక్స్ జరిగితే ప్రోత్సహించండి. విచిత్రంగా ఉందా ? అవును అప్పుడే కదా ఎదో కొత్తదనంగా  ప్రయత్నం చేస్తున్నారు అని తెలిసేది. అందుకే మీ టీం క్రియేటివ్ గా పనిచేసేలా ప్రోత్సహించండి. ఆ ప్రయత్నాలకు అభినందించండి. అంతే కాదు ఘోరమైన వైఫల్యాలు తర్వాతే విషయాలు నేర్చుకుని మరోలా ప్రయత్నిస్తారు. కాపోతే  మిస్టేక్స్ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోకుండా ఇది ఒక పాఠం అంటూ నెలలు, సంవత్సరాలు గడపకుండా జాగ్రత్త పడాలి. అసలు ఏ ప్రయత్నం చేయకుండా , ఫెయిల్ అవుతానేమో అని స్తబ్దంగా కూర్చుంటే వ్యాపారం కూడా స్తబ్దంగా ఉండిపోతుంది. మీరు గమనించారా చిన్న హోటల్స్ లో ఒకోసారి ఇడ్లి రెండు, వడ ఒక్కటి ఇమ్మంటే ప్రతి ఐటెం ఖచ్చితంగా 4 తీసుకోవాలిసిందే అంటారు. కస్టమర్ అవసరాలు ఏంటో ఆలోచించరు, కస్టమర్ కి ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ఇస్తున్నారో అసలు గుర్తించరు. ఇంకా బాగా ఎదగాలంటే ఏమి చేయాలో ఆలోచించరు. అందుకే అంతే ఉంటారు. ఉన్నతంగా ఎదగాలంటే ప్రయత్నాలనుంచి వచ్చిన ఫలితాలు తట్టుకోగాలగాలి, ఇంకా ప్రయత్నించాలి. సరైన సమయం కోసం వెయిట్ చేయకూడదు. తక్కువ సమయంలో ఎక్కువ ప్రయత్నాలు చెయ్యాలి. ఆశించిన ఫలితాలు రావాలంటే ఎలాంటి ప్రయత్నం చేయాలో అర్థం చేసుకోగలగాలి. అందుకు ఫ్లెక్సి బిలిటీ ఉండాలి. నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉండాలి, చేస్తూ నేర్చుకోవాలి, నేర్చుకుంటూ ఎదగాలి.  

Five Steps To Reach Startup To Big Business:
1. Learning never ends in entrepreneurship
2. Be sincere to educate the customer / end-user
3. Sales is not bad word. Every one in small business is a sales person, other wise in anti-sales department
4. Create a brand identity with whatever resources you have
5. Don't wait for right time to come. Create every moment as the best moment in getting things done.

***  ***  ***  సైకాలజీ టుడే, ఏప్రిల్ 2016 లో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***  ***

Tuesday, 8 March 2016

కస్టమర్ సైకాలజీలో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన నాలుగు ముఖ్యాంశాలు మీకు తెలుసా? [ The Four Fundamental Elements of Customer Psychology]


కొందరు కస్టమర్స్ వచ్చింది తీసుకుంటారు? ఇంకొందరు నచ్చిందే కావాలంటారు. కొందరు గీసి గీసి బేరాలు ఆడి సారాన్ని గుంజేస్తారు. కొందరు రాసి రాసి కంప్లైంట్ బాక్స్  నింపేస్తారు. ఒకరు సైలెంట్ గా ఉంటే మరొకరు వయొలెంట్ గా ఉంటారు. అప్పుడు బిజినెస్ ఎలా డెవలప్ చేయాలో, కస్టమర్ ని  ఎలా  అర్థం చేసుకోవాలో, వారికి ఎలా తమ ప్రోడక్ట్ ద్వారా అవసరాలను తీర్చాలో తెలియక, కస్టమర్స్ సైకాలజీ అర్థం కాక చాలా మంది కాంఫ్యూజన్ తో కంగారు పడిపోతారు. అలాంటి పరిస్థితిలో బిజినెస్ మాన్ ఉన్నతంగా అర్థం చేసుకుని పాటించదగిన ప్రాథమిక కస్టమర్ సైకాలజీ సూత్రాలు మీకోసం.
* * * * * * * * * * * * * * * * * *
ఈ ఆర్టికల్ చదవటం ద్వారా మీరు  బిజినెస్ మాన్, ఎంట్రప్రన్యూర్ అయితే మీ కస్టమర్స్ ఏమి కోరుకుంటున్నారో నేర్చుకోవచ్చు, మీరు బిజినెస్ మాన్ కాకపోతే ఎందుకు మీరు కొన్ని షాప్స్ , కంపెనీలతో కంఫర్ట్ ఫీల్ అవుతున్నారో తెలుసుకోవచ్చు, ఏదైనా వస్తువు లేదా సర్వీస్ తీసుకునేటప్పుడు  మీకు ఏది ఇంపార్టెంట్ గమనించవచ్చు. అన్నింటికంటే మించి మీ కుటుంబ సభ్యులతో ఎలా ఉండాలో  నేర్పుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీ  కస్టమర్  అడిగే ఆ ఈ నాలుగు అంశాలు ఏమిటో వినండి...మనస్పూర్తిగా...

ప్రశ్న 1: మీరు (కంపెనీ) నన్ను ఇష్టపడుతున్నారా?: అవును కస్టమర్స్ తమని గౌరవించాలని, ఇష్టంతో నిజమైన అభిమానంతో  చూడాలని కోరుకుంటారు. సర్వీస్ ఇచ్చే వాళ్ళు నిజంగా ఇష్టంగా తమకు సర్వీస్ చేస్తున్నారా అనే అంశం కస్టమర్స్ గమనిస్తారు,  ఈ విషయం ఒక ప్రముఖ ఎయిర్ లైన్స్ లో చేసిన ఒక సర్వే లో చాలా కీలకమైనదిగా పేర్కొన్నారు. మీరు గమనించారా కిరాణా కొట్టుకి వెళ్ళి మనం చిన్న ప్యాకెట్ అడిగితే అది లేదు అని పెద్దది అంట గట్టాలని చుసాడనుకోండి మనకి ఆ షాప్ లో మళ్ళీ వేరే వస్తువు కొనాలనిపించదు. ఎందుకంటే మనల్ని, మన డబ్బుని, మన అవసరాన్ని నిజంగా ఇష్టం తో సర్వీస్ చేయలేదని మనలో కస్టమర్ బాద పడ్డాడన్న మాట.  మీరు ఎవరికైనా సర్వీస్ / ప్రోడక్ట్ ఇచ్చే ఇచ్చే తప్పుడు ఎదో ఒకటి చెప్పి అంటగడుతున్నారా నిజంగా ఇష్టం తో ఆ పని చేస్తున్నారా విశ్లేషించుకోండి. కస్టమర్ పేరుని మాటలలో వాడటం, అణుకువ, పద్ధతి, బాడీ లాంగ్వేజ్, వారితో సమయం , పేమెంట్ విషయాలలో పాటించాల్సిన అంశాలు చెప్పటం చాలా ఉన్నత లక్షణం.  ఇలాచేస్తే మీ కస్టమర్లు “కష్టమర్” అవ్వరు,  వాళ్లకి మీరు “ఇష్టమర్” లు గా మారిపోతారు.

ప్రశ్న 2:  మీరు (సర్వీస్ ఇచ్చేవాళ్ళు) నన్ను పట్టించుకునే స్థితిలో ఉన్నారా? : మీ కస్టమర్లు తమని మీరు కేర్ చేయట్లేదని తెలిస్తే మీ వ్యాపారం చిన్న చిల్లు పడినట్లే. ఆ చిల్లు చాలు సముద్రంలో ఓడ లాగా కొద్ది కాలంలో వ్యాపారం కూలిపోడానికి. అది చిన్నదైనా పెద్దదైనా అవసరం కస్టమర్ దే అని మీ ఇష్టం వచ్చినట్లు , ఏమి పట్టనట్లు ఉంటే...  రేపు మీ లోపాలను అవకాశంగా చేసుకుని మరో వ్యాపారం రావొచ్చు. దీనినే బిజినెస్ భాషలో “కాంపిటీటివ్ అడ్వాంటేజ్” అంటారు. కిరాణా సరుకులు అమ్మే షాప్ ల ప్లేస్ లో మెల్లిగా అంత కంటే తక్కువ ధరకి ఇచ్చే సూపర్ మార్కెట్ లు, ఆటో వాళ్ళ నస తట్టుకోలేక అంత కంటే తక్కువకి కార్ సర్వీస్ లు హైదరాబాద్ లాంటి నగరాలలో రావటానికి కారణం ఇదే. వాళ్ళని కేర్ చెయ్యట్లేదు అని తెలిస్తే, ఆ కస్టమర్స్ లో 65% మరొకరికి ఆ కంపెనీ రెఫెర్ చేయకపోగా , అందులో 35% మంది అసలు దానిని వాడవద్దని ఇతరులకు కుడా ప్రచారం చేస్తారట. అందుకే హృదయపూర్వక సహాయ భావంతో నవ్వుతో విషయాలను చెప్పటం, కళ్ళలోకి చూస్తూ పద్దతిగా సమాధానం చెప్పడం, వద్దు అనే హక్కు వారికి ఉంది అని ఆప్షన్స్ చెప్తూనే ఒప్పించగలగటం, వ్యక్తి గత బాధ్యత , క్రమశిక్షణ ప్రదర్శించేలా మీ కంపెనీ, సర్వీస్ టీం, సేల్స్ లేదా ఇతర కీలక టీం లకు  వ్యాపారంలో ఉన్న భాగాస్వామ్యులకు శిక్షణ ఇప్పించాలి. ప్రొఫెషనల్ ట్రైనింగ్ లేదా బిజినెస్ కోచింగ్ ద్వారా ఆ అంశాల ఉపయోగాలు స్పష్టంగా తెలుసుకుని, ఉన్నతంగా వారి వారి బాధ్యతలు నెరవేరుస్తారు.
ప్రశ్న 3 : నేను మిమ్మల్ని (కంపెనీ, రెప్రజెంటేటివ్ ని ) నమ్మవచ్చా ? :  తనకు సర్వీస్ ఇచ్చే ఎంప్లాయిస్, రెప్రజెంటేటివ్ లు నమ్మగలిగిన వారేనా అనే అంశాన్ని తెలుసుకోవాలనుకుంటారు. ఫోన్ కాల్ కి, ఈమెయిలు కి, షాప్ కి  వెళ్లి నప్పుడు  కలవాల్సిన వ్యక్తి కలవడం వంటి అంశాలలో కస్టమర్ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ పొందేలా పద్దతులు ఉండాలి, చెప్పిన సమయానికి అక్కడ ఉండాలి, మాటిచ్చిన సర్వీస్ చేయాలి. వీటిలో ఏది మిస్ అయినా కస్టమర్ ని మిస్ చేసుకున్నట్లే, మనకు తెలియకుండా తన ద్వారా ఇంకెంతో మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే వచ్చిన కస్టమర్ కి ఏ సర్వీసెస్ లు ఎంత కాలం పూర్తి చేయాలి అనే మినిమం టైం , ప్రాసెస్ / నియమంగా పాటించాలి.
ప్రశ్న 4 : మీరు  (కంపెనీ, రెప్రజెంటేటివ్ ని ) ఏమి మాట్లాడుతున్నారో మీకు తెలుసా? :  తనకు సర్వీస్ ఇచ్చే వారికి స్పష్టంగా విషయాలు తెలుసా,  వారికి దానిమీద నిర్దిష్టంగా విషయ పరిజ్ఞానం ఉందా అని కస్టమర్ తెలుసుకోవాలనుకుంటాడు. గతంలో వాటిని ఇతరులకు ప్రమోట్ చేసిన అనుభవం ఉందా, ఆ కస్టమర్స్ ఎలా ఫీల్ అవుతున్నారు, వారికి ఆ సర్వీస్ / ప్రోడక్ట్ ఎలా అనిపించింది, ఆ సర్వీస్ తర్వాత సాదారణంగావచ్చే ఫీడ్ బ్యాక్  ఏంటి వంటి అంశాలు తెలుసుకోవాలనుకుంటారు. అందుకే నిజమైన నిబద్దతతో కూడిన బిజినెస్ అభివృద్ధికి, ఎప్పుడో ఒక సారి చేసే మోటివేషన్ క్లాసు లా కాకుండా ఏ లెవెల్ వారికి ఏ నైపుణ్యాలు (స్కిల్ల్స్) అవసరమో ఆర్థం చేసుకుని, వారి జాబు కి డిమాండ్ అర్థం చేసుకుని స్టాఫ్ కి ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇప్పించాలి.

కస్టమర్ లు అడిగే ఈ ప్రశ్నలతో నాలుగు కీలక కస్టమర్ సైకాలజీ అంశాలు అర్థం చేసుకున్నారు కదా...వీటినే మీ కుటుంబ జీవితంలో కూడా అన్వయించుకోవచ్చు. అప్పుడు బంధాలు మెరుగుపడతాయి, మాట – బాట కలుస్తాయి, భార్యా భర్తల మధ్య ఆనందం వెల్లివిరుస్తుంది... నిన్నటి వరకు ఉన్న కురుక్షేత్రం ఇప్పుడు సరదాకి కొట్టుకోవటం లా అవుతుంది. బిజినెస్ , లైఫ్ వేరు కాదు అందుకే మన ఫస్ట్ బిజినెస్ లైఫ్ అని తెలుసుకోవటమే జీవితం.
***  ***  ***  సైకాలజీ టుడే, మార్చ్  2016 లో ప్రచురించబడిన  ఆర్టికల్  ***  ***  ***