“నా జీవితం ఇంతే
సరైన టైం కి పెళ్లి చేసుకుంటే….”,
“25 సంవత్సరాలకే ఉద్యోగం వచ్చి ఉన్నట్లయితే ఎంత బాగుండేదో”, “ఈ లైఫ్ , ఈ వయసులో నా చేతిలో ఏం ఉంది”, “ఈ వయసులో
ఏమి చేస్తాను లెండి, శరీరమే సహకరించక పోతే ఇంకా ఇప్పుడు నేను ఎదో కొత్త ప్రయత్నాలు
చేయడం దేనికి” ఇలా వయసుకి వారి జీవితానికి లింక్ పెట్టి మాట్లాడుతుంటారు కొందరు.
మరి ఈ అంశాలలో వాస్తవం ఎంత? శరీరం, మనస్సు, వాటిమీద వయస్సు ప్రభావం ఎంత? మలి
వయస్సులో సక్సెస్ మంత్రం జపించడం ఎలా ? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని నిరూపించిన వారెవరన్నా
ఉన్నారా? ఉంటే వారు ఏం చేసారు? ఏ వయస్సు వారైనా ఆశించిన జీవితాన్ని సాధించుకోవటం
ఎలాగో కాలం నేర్పిన పాఠాలు, కారణ జన్ములుగా పాటించిన విజేతల జీవితాలలో సక్సెస్
నియమాలు మీకోసం.
వయస్సు అనేది మనిషి
తన ఉనికిని (existence)
చెప్పడానికి వాడుకున్న అంశం. నాకు ఇన్ని
సంవత్సరాలు, మీకు ఆ పనికి ఎంత కాలం పట్టింది? వంటి కనీస వ్యవహారానికి ఉపయోగపడేది
సమయం. మరి ఈ సమయం అనేది ఎక్కడ మొదలైంది ఎక్కడ అంతమౌతుంది పక్కకిపెడితే, మనం
జన్మించాక వయసుని సంవత్సరాలలో కొలవడం తెలుసుకుంటాం, ఏ వయసుకి ఏం పనులు చేస్తాము అనేది ప్రపంచం ద్వారా
నేర్చుకుంటాం. అయితే మరి వయసుకి, శరీరానికి, మనసుకి లింక్ ఎక్కడ ఉంది?
శరీరానికి
వయస్సు ఉందా?
ఇప్పడు మీకు ఉన్న శరీరం వయస్సు ఎంత? వయస్సు
అనేది మనిషి శరీరానికి ఉందా? మనిషి మెమరీ లో మాత్రమే ఉందా? క్లినికల్ గా
మాట్లాడితే మన శరీరం లోని కణజాలం మొత్తం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఒక సారి
మనిషి గాలి పీల్చుకుని వదిలేసే సమయానికి కొన్ని కోట్ల కణాలు (ఇంచుమించుగా అవి 10 22)
మన శరీరం నుంచి ఈ సృష్టిలోకి
వదులుతాము, అంతే సంఖ్యలో సృష్టిలోని కణాలు మన శరీరం లోకి తీసుకుంటాము. ఇది ఒక మన సైంటిఫిక్ అంచనా. ఇంతేకాదు సైన్సు చెప్పేది
ఏమిటంటే ఒక్క సంవత్సరంలో మనిషిలో 98 % శరీరం పూర్తిగా మారిపోయి కొత్త కణాలు నిర్మించుకుంటారని. అలాగే 5 రోజులలో స్టమక్ లైనింగ్ 10 రోజులలో నాలుక
రుచి మొగ్గలు, ఐదు నెలలకు లివర్, 3 వారాలలో ఊపిరి తిత్తులు, చర్మం, 4 వారాలకు
రక్తకణాలు ఇలా ప్రతి అవయవం, వ్యవస్థ లోను
కణాలు మారిపోతుంటాయి. అంటే నాకు
ఇన్ని సంవత్సరాలు అని మీరు అన్నప్పుడు ఏ బాడీ (ఏ కణాల సమూహం) గురించి
మాట్లాడుతున్నారో రిఫరెన్స్ తీసుకోవటం వీలుకాని ఒక వింతైన పరిస్థితి. వినటానికి
కొత్తగా ఉన్నా ఇది సైంటిఫిక్ గా నిర్ధారించబడింది. అందుకే మనిషి ఒక మెమరీ మెషిన్
లా తనను తాను నిర్మించుకుంటాడు అంటారు. మన శరీరం (బాడీ) అనేది నిరంతరం ఏర్పడుతూ ఉండే ఒక
ప్రాసెస్, ఒక నిశ్చలమైన స్తబ్దమైన వస్తువు కాదు. అలా కనిపిస్తుంది అంతే. అంటే మనం మన బాడీని ఎప్పటికప్పుడు కొత్తగా సృష్టించుకుంటూ
ఉంటామన్న మాట. గతం నుంచి ఇప్పటివరకు మెమరీ లో విషయాలు మోస్తూ , కొత్త కణాలకు అందించే
ఒక ఇంటలిజెన్స్ మనలో ఉంది.
మీ మనసులో వయసు ఏమంటోంది?:
అవును. ఇంతకీ మీ మనసులో
వయసు మీతో ఎప్పుడూ ఏమి చెప్తుంది? మీ వయసు ఎంత అని చెప్తుంది? “అది ఏంటి అలా అంటారు నేను పుట్టింది ఏం సంవత్సరమో
నాకు తెలుసు, అప్పటి నుంచి ఈ 2016
ఫిబ్రవరి నాటికి ఇన్ని సంవత్సరాలు” ఇది వాస్తవం అంటారా? అవును అది
వాస్తవమే. అలా ప్రతి రోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం మీతో మీరు నాకు
ఇన్ని సంవత్సరాలు, నా వయస్సు ఇది అని చెప్తున్నారు కాబట్టి. మీ మైండ్ తో మీ బాడీ
కి ఒక సిగ్నల్ ఇస్తునారు, మీ వయసు గురించి, ఈ వయసులో చేయగల పనులు ఇవే అని, ఈ వయసులో
చేయలేని పనులు ఇవి అనీ, ఈ వయసులో ఈ జాబు చేయోచ్చు అని, చెయ్యకూడదు అని ఇలా ఇంకా
ఎన్నో. అందులో తప్పేముంది అంటారా? అదే
వాస్తవం అంటారా? డియర్ ఫ్రెండ్స్ మీరు ఏది రిపీట్ చేసి చెప్తారో అదే నిజమని
నమ్ముతారు, వయస్సు , జీవితం, చేయగలిగే పనులు...మరి ఏదైనా.
ఒక పెద్దాయన నల్గొండ జిల్లా నుంచి కొడుకుని చూడడానికి
హైదరాబాద్ వచ్చాడు. కొడుకు అమీర్ పేట్ లో ఆఫీస్ కి వెళుతూ నేను వెళ్లి వస్తాను,
మనం రేపు ఆర్ట్ ఎగ్జిబిషన్ కి వెళదాం
అన్నాడు. సాయంత్రం ఐదు గంటలకి ఇంటికి వచ్చే సమయానికి “నేను పేపర్ చదువుతుంటే
జూబిలీ హిల్స్ లో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఉందని తెలిసింది, అడ్రస్ కనుక్కొని వెళ్లి
వచ్చా” అన్నాడు తండ్రి. ఆశ్చర్య పోవటం
కొడుకు వంతైంది. ఎందుకంటే తనతో ద్విచక్ర వాహనం మీద ఆయన్ని కాలుష్యంలో తిప్పటం కంటే
మరునాడు కార్ లో కావలసిన ప్రదేశాలకు తీసుకు వెళ్ళాలని, రద్దీ బస్ లో వెళ్ళటం
తండ్రికి ఇబ్బంది అని కొడుకు ఉద్దేశ్యం. కానీ తనకు నచ్చిన సబ్జెక్టు తను
తెలుసుకోవాలని అడ్రస్ తెలుసుకొని కలిసి వచ్చాడు ఆయన. చిత్రమేమిటంటే అమీర్ పేట్
దూరం అని కొడుకు అనుకున్నాడు, సిటీ తెలియకపోయినా దానిని దాటి జూబిలీ హిల్స్ వెలి వచ్చాడు పెద్దాయన. ఈ
ముచ్చట్లలో కొడుకి స్నేహితుడు వచ్చాడు. అతనికి తను రీసెంట్ గా వేసిన పెన్సిల్
ఆర్ట్ అంటూ చూపించాడు పెద్దాయన. “ఈ వయసులో మీరు బొమ్మలు వేశారంటే రిటైర్మెంట్
వయసులో మీరు ఆర్టిస్ట్ అయ్యారు సార్ అన్నాడు 43 ఏళ్ళ కొడుకి స్నేహితుడు. “నా వయసు
ఎంత అనుకుంటున్నారు చెప్పండి” అన్నాడు పెద్దాయన. “64 ఏళ్ళు” బదులిచ్చాడతను. “ కాదు
నాకు ముప్పై ఏళ్లే, మీరు అంతా నాకు అరవై అని అనుకుంటున్నారు , నాతో నేను మనసులో,
బయటా ఉత్సాహంగా, హాయిగా ముప్పై వాళ్ళ లాగానే ఉంటాను అలాగే అనుకుంటాను, అంతే,
వయస్సు శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది.” అన్నాడు పెద్దాయన.
మరుసటి రోజు ఐదు గంటలు కష్టపడి వాటర్ కలర్ తో లైఫ్ మొదటిసారి ఒక బొమ్మ గీసి
చూపించాడు పెద్దాయన. పక్క చిత్రంలో గమనించగలరు. ఆ పెద్దాయన నా తండ్రి, ఆయన వయసుకి
తెలియని ప్రదేశాలలో తిరగటం ఇబ్బంది అని నమ్మకాన్ని మార్హ్సుకుంది నేనే. ఇప్పటికీ
హైదరాబాద్ వస్తే నాన్న తను చూడాలనుకున ప్రదేశాలకు హాయిగా బస్ లోనే వెళ్లి
వస్తున్నారు.ఆయన వయసు 64 (మన కాలమానం ప్రకారం), ఆయన మనస్సు ఆయనతో మాట్లాడే లెక్కల
ప్రకారం నాకంటే నాన్న ఐదేళ్ళు చిన్న.
వయసుతో
సంబంధం లేకుండా సాధించండి: వయసుతో సంబంధం లేకుండా మీరు బాగా ప్రేమించే పనిని చేయండి.
మీ వృత్తిలో ఇతరులకు శిక్షణ ఇవ్వడం ద్వారా మరింతమందికి సహాయం చేయండి , మీరు బాగా
ప్రేమించే పని, హాబీస్, చూడాలనుకున్న ప్రదేశాలు, కలవాలనుకున్న వ్యక్తులు ప్రయత్నం
చేయండి. జీవితం అనేది ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది , మనం చుసేదానిని బట్టి
మారుతుంది. బయటి ప్రపంచం ఎలా ఉంటుందంటే అంతర్ ప్రపంచం ఎంత ఉన్నతంగా ఉంది
అన్నదానిపై ఆధార పడి ఉంటుంది. కొంత మంది కుర్ర వాళ్ళు పుట్టుకతో వృద్ధులు
అన్నారు మహాకవి శ్రీ శ్రీ . అలాగే కొందరు పెద్దవాళ్ళు ఇప్పటికే యువకులే. వారిలో
ఉత్సాహం, ఆలోచనా విధానం ఇతరులను ఇన్ స్పైర్ చేయగలదు. ఉదాహరణకి చూడండి.
§ 58 ఏళ్ళ వయసులో సోనీ కంపెనీ చైర్మన్ అకియో మొరిటా అప్పట్లో ఎవ్వరు ఊహించని సోనీ వాక్ మాన్ తయారీ చేసాడు
§ 60 ఏళ్ళ కు జార్జ్ బెర్నార్డ్ షా “హార్ట్ బ్రేక్ హౌస్” అనే మాస్టర్ పీస్ రాసారు
§ 62 ఏళ్ళకు JRR టోకీన్స్ లార్డ్ అఫ్ ది రింగ్స్ అనే ఫాంటసీ సిరీస్ లో మొదటి పుస్తకం పబ్లిష్ చేసాడు
§ 70 ఏళ్ళ సంవత్సరాలు వయసుగల భార్య రూబీ చనిపోతే ఆ బాధని 3 సంవత్సరాలు భరించి తన 96 సంత్సరాల వయసులో హరీ బెర్న్ స్టీన్ “ది ఇన్విజుబుల్ వాల్” అనే తన మొదరి పుస్తకం రాసాడు.
§ 99 సంవత్సరాల టీచి ఇరగాషి మౌంట్ ఫుజి అధిరోహించి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసారు.
వీళ్ళంతా వయస్సు తో వచ్చిన
అనుభవాన్ని తమని విజేతలుగా నిలబెట్టేలా ఉపయోగించుకునారు అద్భుతాలు చేసారు. ఎదో
సినిమాలో చెప్పిన మాటలలో చెప్పాలంటే “ఎప్పుడు వచ్చామన్నది కాదు విజేతగా నిలిచామా
లేదా అన్నది ప్రశ్న”. ప్రయత్నానికి ఎప్పుడూ ఓటమి లేదు. అందుకే వయసుతో సంబంధం లేదు
ప్రయత్నించండి.
*** *** *** సైకాలజీ టుడే, ఫిబ్రవరి 2016 లో ప్రచురించబడిన ఆర్టికల్ *** *** ***
No comments:
Post a Comment