Sunday, 10 January 2016

2016 మీ జీవితంలో ఒక అద్భుతమైన సంవత్సరం కావాలంటే ఏమి చేయాలి?



2016 లో మీ లక్ష్యాలు సాధించడానికి 3 సూపర్ ప్రాక్టికల్ టెక్నిక్స్

జననం ఒక హిస్టరీ, మరణం మిస్టరీ. ఈ రెండింటి మధ్య మనిషి ఏమి చేస్తాడనేది ఒక ఛాయస్. జననానికి మరణానికి మధ్య ఖాళీని నింపే జీవితాన్ని ఓ అద్భుతంలా నచ్చినట్లు తీర్చిదిద్దుకునే ఛాయస్,  లైఫ్ ఎనర్జీ ని ఉన్నతంగా ఉపయోగించుకునే అవకాశం ఎప్పుడూ మీచేతిలోనే ఉంటుంది.   అందుకు మీ జీవిత ధ్యేయం మీకు తెలియాలి. జపాన్ భాషలో పర్పస్ (ధ్యేయం) ని “ఇకిగాయి” అంటారు. దీని అర్థం ఏమిటంటే “ దేనికోసం నేను నిద్ర లేస్తాను అంటే “ అని అర్థం. మీ జీవిత ధ్యేయం కోసం నిద్రలేవటం అనేది ఒక గొప్ప అనుభూతి. అప్పుడు ప్రతిరోజు ఒక అత్యంత శక్తివంతంగా, అర్థవంతంగా జీవితం ఒక అందమైన కనుభావంలా , దృశ్య కావ్యంలా, అద్భుత ప్రయాణంలా ఉంటుంది. ప్రతి క్షణం అద్భుతమే. ఈ భూమి మీద మనం ఎందుకున్నమన్నది నిజమైన అర్థాన్ని తెలుసుకుని ఆ దిశలో ప్రత్యేకతతో, భిన్నంగా అడుగులు వేయడమే జీవిత ధ్యేయంతో (లైఫ్ పర్పస్)  జీవించడం. మనం ఈ భూమి మీద ఉన్నామంటే ఎదో గొప్ప అర్థం ఉంది అని అర్థం. ఇది మనల్ని మనం ప్రశ్నించుకోవలసిన సమయం -  నా జీవిత శక్తిని ఉపయోగించుకుని నేను మాత్రమే చేయగల అద్భుతమైన పనులు ఏమిటి? నేను ఏ ఉనత కార్యాన్ని నిర్వర్తించడానికి భూమి మీదకు వచ్చాను?. ఒక సారి జీవిత ధ్యేయం స్పష్టంగా ఉంటే మీ జీవితంలో సంవత్సరాలు, నెలలు రోజులు ఆదిశలో ఆలోచనాత్మకంగా, నిర్మాణాత్మకంగా మలుచుకోవచ్చు.
మరి 2016 లో మీరు ఏమి సాధించాలనుకుంటున్నారు? మీ నూతన సంవత్సర లక్ష్యాలు ఏమిటి? రాబోయే 12 నెలలలో మీరు ఏ ఫలితాలు సాధించాలనుకుంటున్నారు? మీ లక్ష్యాలు ఎవైన సరే మీ రాబోయే 365 రోజులలో ఆ తర్వాత కూడా మీ లక్ష్యాలను ప్రభావితం చేసే అంశాలు ఏమిటి? వాటిని అర్థం చేసుకుని ఆశించిన ఫలితాలు సాధించి విజేతలుగా నిలవాలంటే చేసుకోవలిసిన మూడు సూపర్ పవర్ ప్రాక్టికల్ టెక్నిక్స్ ఏంటో చర్చిదాం రండి. ఫ్రెండ్స్...గుర్తుంచుకోండి మీ శారీరక ఎక్సర్ సైజ్ కోసం వేరే మనిషిని అద్దెకు తీసుకోలేరు, మీ స్నానాన్ని వేరే వాళ్ళు చేయలేరు, అలాగే మీ లైఫ్ గోల్స్ కోసం ఇతరులు పనిచేయలేరు. అందుకే ఇది ఒక ఆర్టికల్ కేవలం చదవడమే కాకుండా అర్థం చేసుకోండి, పాటించండి. ఆటంకాలను అధిగామించండి. ఏవైనా అనుమానాలు ఉంటే సంప్రదించండి. మీరు గతంలో నా ఆర్టికల్స్ ద్వారా, ఇతర పుస్తకాల ద్వారా అనేకం నేర్చుకుని ఉండవచ్చు, కానీ కొన్ని టెక్నిక్స్ మరలా చెప్పడానికి కారణం వాటి ప్రాముఖ్యత మీ లక్ష్యాలపై అంతగా ఉంటుందని మీకు స్పష్టతే ఇవ్వడం నా బాధ్యత.    

1.   మీరు అంతర్గతంగా చేసే అంశాలు మార్చుకోండి:

a.   90 చెత్తని వదిలించుకునే ఛాలెంజ్:  మీ ఎదుగుదలకు ఆటంకంగా వచ్చే చెత్త నా దృష్టిలో రెండు రకాలు. ఒకటి  మీకు ఉన్నదానికి ఆనందంగా, కృతజ్ఞతా భావంతో సంతోషంగా ఉండకుండా లేనిది ఊహించుకుని “లేమితో” ఏడవటం. రెండోది మీ జీవితంలో ఫలితాలకు కారణం ఫలానా అంటూ వ్యక్తులను, పరిస్థితులను, సమాజాన్ని నిందించటం. కంప్లైంట్ రోగం. ఈ రెండు రకాల చెత్త ఎంత వేగంగా తొలగిస్తే శరీరము , మనసు అంత హ్యాపీగా ఉంటాయి. ఉన్నదానికి కృతజ్ఞత (గ్రాటిట్యూడ్) లేకపోవడమనేది అత్యంత భయానక పేదరికం.  జీవితంలో ఏది జరిగినా 100% బాధ్యత తీసుకోండి, అది మీరు ముందుకు వెళ్ళడానికి దోహదం చేస్తుంది. నెపం వేస్తే తప్పించుకోవడంలో హీరో అవుతారు, జీవితం చివరికి వచ్చేనాటికి జీరో అవుతారు.  కొందరు తప్పు చేసిన వాడికి పాతం నేర్పుతాంటూ ఆక్రోశానికి పోతారు, ఆ సమయం ఎదో మీ జీవితాన్ని నిర్మించుకోడానికి వాడుకోండి. మీరు వంకలు పెట్టటం/ నెపం వేయటం అవి ఇంకా పెరుగుతాయి, నెగటివ్ గా ఆలోచిస్తే ఆ నెగటివ్ అంశాలు ఇంకా శక్తివంతం అవుతాయి. మీరు సమస్యలే ఎక్కువ మాట్లాడితే అవి శక్తివంతం అవుతాయి. ఏంటి అర్థం కాలేదా అయితే చిన్న ఎక్సర్ సైజ్ చేయండి. ఇప్పుడు మీరు ఉన్న రూమ్ లో లేదా స్థలంలో కళ్ళు తెరిచి అన్నింటిని పరిశీలనగా చూస్తూ గుండ్రంగా తిరగండి కాని ఎరుపు రంగు చూడొద్దు.  ఇలా మూడు రౌండ్స్ వేయండి ఎరుపు రంగు చూడొద్దు. ఏంటి ....చూడలేదుగా...చూసారా? అది మీ మైండ్ ఏది ప్రత్యేకంగా అనిపిస్తే దానిని ఫోకస్ చేస్తుంది. చూడొద్దు అని ప్రత్యేకంగా చెప్తే చూస్తుంది కదూ! అందుకే మీ 2016 లక్ష్యాలు సాధించాలంటే ఈ 90 రోజుల చెత్త వదిలించుకునే చేయండి. 90 రోజులు ఇతరులు, పరిస్థితులు, ఫలితాలు వేటిని నిందించకండి, కారణాలుగా చూపకండి, నెగటివ్ గా మాట్లాడకండి, మీ ఆశీర్వాదాలు లెక్కపెట్టుకోండి , ఆటంకాలు కాదు. మీకు ఉన్న దానితో కృతజ్ఞతతో ఉండండి, ప్రేమ, ఇవ్వటం లోని శక్తిని అనుభవించండి. ఎవరిదగ్గరికైన వెళితే ఏదన్న ఇవ్వండి, ఎవరైనా సరే, చిన్న పువ్వు, చాక్లెట్, నోట్ బుక్, పెన్, ఫ్రూట్, చేతితో చేసిన గ్రీటింగ్ ఏదైనా ఇవ్వండి, డబ్బులు లేవు అనుకోకండి స్వచ్చమైన నవ్వు నేను ఎంత పెట్టినా కొనలేనని తెలుసుకున్నాను అందుకే ప్రేమతో నవ్వుని పంచండి కనీసం. 

b.    మీ ఆలోచన- ప్రవర్తన విధానాలు లక్ష్యాలపై నిబద్దతతో ఉండాలి: మనం ఎప్పుడూ అదే ప్లేస్ లో ఉంటాము, అదే మనుషులతో మాట్లడుతాము, ఒంటరిగా ఉన్నా అవే ఆలోచనలు బొంగరంలా  తిప్పి తిప్పి ఎంత ఆలోచించినా మార్పు రావట్లేదు అనుకుంటూ ఉంటాము. అలా ఒకే ఆలోచన , దానికి తగ్గ పనులు ప్రవర్తనలు ఒక ప్రోగ్రాం లాగ మనలో ఉండిపోతే. వాటిని నేను థాట్ – యాక్షన్ ట్రాప్ (ఆలోచన – ప్రవర్తన ఉచ్చులు) అంటాను. అంతేగా మరి అనుకున్నది కాకుండా ఒక విదానాలైన (మీకు అలవాటు పడిన / మీ ఇగో ని, ఫీలింగ్స్ ని భ్రమలో త్రుప్తిపరిచిన) పద్దతులలో ఆలోచనలు దానికి తగ్గ ప్రవర్తనలు ఈ కొత్త సంవత్సరం లో కూడా ఉంటే గోడమీద క్యాలెండర్ మారుతుంది కాని జీవితం మారదు. కాబట్టి మీ లక్ష్యాల దిశలో మీ అంతర్గత ఆలోచనలు, ప్రవర్తనలు ఉండేలా చూసుకోండి.

c.    మీ భావోద్వేగాలు దేనికి లింక్ పెట్టారు?: మీ శరీరము, మనసు, మీ ఆలోచనలు, మీ జీవితం, ఈ సృష్టి వీటితో మీరు ఆహ్లాదంగా, హాయిగా ఫీల్ అవుతారా? తాదాత్మ్యం, ఆనందం, ఉత్సాహం, హుషారు, సంతోషం, సంతృప్తికరం, అంతర్లీనం, గౌరవం, సుఖం ....ఇవి ఫీల్ అవ్వకపోతే వేరే ఏమి ఫీల్ అవుతారు?. చాలా మంది అది చేసాక నేను సంతోషంగా ఉంటా, ఇది సాధిస్తే నేను ప్రశాంతంగా ఉంటా, ఫలానా ఉంటేనే నాకు ఉత్సాహంగా ఉంటది అని చెప్తుంటారు. కాని మీ ఫీలింగ్స్ కి , మీ పరిస్థితికి అనవసరమైన నెగటివ్ లింక్ పెట్టాల్సిన అవసరం లేదు. అలా లింక్ పెడితే లైఫ్ లో సంవత్సరాలు గడుస్తాయి కాని జీవితం రసమయం కాదు, ప్రేమమయం అనిపించదు. జీవితానికి సంవత్సరాలు చేర్చుకుంటూ వెళ్ళకండి, సంవత్సరాలకి జీవితాన్ని ప్రాణాన్ని మీరే ఇవ్వండి.

d.   మీ శక్తిని కేంద్రీకరించే నిబద్దత: మనం ఈ భూమి మీద కొంతకాలం ఉంటాం. ఈ సమయంలో కొన్ని ముఖ్యమైన పనులు చేస్తాం, కొన్ని అవసరంలేని పనులు చేస్తాము. ఈ ముఖ్యపనులు మనకి అర్థాన్ని , సంతోషాన్ని ఇస్తాయి, అనవసర పనులు కేవలం సమయాన్ని చంపేస్తాయి. సమయం అంటే మన జీవిత కాలం అంటే జీవితాన్నే స్లో –పాయిజన్ లా చంపేస్తాయి. అందుకే మీ జీవిత శక్తిని కేవలం ఇంపార్టెంట్ పనులకు కేటాయించేలా క్రమశిక్షణ అలవరుచుకోండి.

  1. మీరు బహిర్గతంగా చేసే అంశాలు మార్చుకోండి:

  1. ఉత్పాదకత (ప్రోడక్టివిటీ) ఇచ్చే ప్రదేశంలో ఉండండి: మీ చుట్టూ ఉండే మనుషులు, మీరు ఎప్పుడు గడిపే వాతావరణం, మీరు చదివే పుస్తకాలు, ఆడియోలు/వీడియో లు మీ పై ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి ఒక్కసారి మీ నూతన సంవత్సర కష్యాలకు ఇప్పుడు మీరు ఉన్న వాతావరణం, అందులో మనుషులకు, ఆ వ్యక్తులతో మీ చర్చలకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా ఆలోచించండి. కొన్ని పాత జీడిపాకంలా, జిగురునాధంలా అంటుకుంటాయి కాని ఎదగాలంటే ముందు వలలో పడ్డ పావురంలా ఉచ్చులలోంచి బయటపడాలి అప్పుడే ఎగిరే అవకాశం వస్తుంది.మీ ఉత్పాదకత (ప్రోడక్టివిటీ) ని పెంచే మనుషులతో గడపండి, చర్చించండి. కొంత మంది ఉన్నత స్నేహితులు ఉన్నా చాలు, రేలషన్శిప్ అంటే అందరితో టచ్ లో అన్ని రోజులు ఉండటం అనే భ్రమలో ఉండకండి. మీ జీవన ప్రాదాన్యాలకు తగ్గ వారితో విన్-విన్ రిలేషన్స్ ఉంటే చాలు. అందుకే busyness కాదు కావలసింది business అని చెప్తుంటాను నా ట్రైనింగ్ లలో. కొత్త విషయాలు నేర్చుకునేందుకు సమయం, శక్తి కేటాయించండి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఏ వ్యక్తి అయినా నేర్చుకోవడానికి ఉత్సాహం ఉన్న వాళ్ళే. బుక్స్ చదవండి, ఆడియో/వీడియో ల ద్వారా, ఆన్ లైన్ కోర్స్ ల ద్వారా నేర్చుకోండి. ఈ ఒక్క అలవాటు మీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దగలదు.    
      
      

b.      నిబద్దతను గుర్తుచేసే అకౌంటబిలిటీ పార్టనర్: మీ లక్ష్యాల దిశలో నిబద్దతను మొహమాటం లేకుండా గుర్తుచేస్తూ, మీ ఎదుగుదలకు కావలసిన సపోర్ట్ ఇస్తూ, సమయాన్ని కేటాయించగలిగే  అకౌంటబిలిటీ పార్టనర్ చాలా బాగా నడిపించగలరు. మీరు ఒక పుస్తకం రాయాలనుకున్నారు, ఇంటివద్ద ఉండి నడిపించగల బిజినెస్ మొదలెట్టాలనుకున్న్నరు, డబ్బు కోసం కొత్త టెక్నాలజీస్ నేర్చుకుని పార్ట్ టైం జాబు చేయాలనుకున్నారు. ఆ విషయం మీ ఇంట్లో వారు లేదా బయట ఫ్రెండ్స్, లేదా మీ మెంటార్ / కోచ్ కి చెప్పండి. వారు మీ లక్ష్యాల దిశలో వెళ్తున్నారా అనే అంశాన్ని మీకు వారానికి ఒకసారి లేదా నెలకు మూడుసార్లు ఫోన్ లేదా డైరెక్ట్ గా కలిసినపుడు రివ్యూ చేస్తారు, మాట్లాడతారు. మీ గోల్ లాంటి గోల్ ఉన్న మరో పార్టనర్ ఉంటె ఇంకా మంచిది. ఇద్దరు రివ్యూ చేసుకునేప్పుడు బెస్ట్ ప్రాక్టీసు లు ఇరువురు నేర్చుకోవచ్చు.

3.   ఫలితాల దిశలో విధానాలు (స్ట్రాటజీ) మార్చుకోండి :

a.   లక్ష్యాలు రాయండి : గోల్స్ కేవలం అనుకోవటం కాకుండా రాస్తే మీ తల రాతనే మార్చుకున్న వారౌతారు అంటారు. అందుకే మీ డైరీ, నోట్ బుక్, జర్నల్ లో గోల్స్ రాయండి. పాజిటివ్ పదాలలో, మీకు కావలసింది ఎప్పటికి , ఏ రూపంలో, ఏ విధంగా కావాలో స్పష్టంగా రాయండి. ఎప్పుడు కంటికి కనిపించేలా లక్ష్యాల పోస్టర్ రాసుకోవచ్చు, లేదా విజన్ బోర్డు చేసుకోవచ్చు. ప్రతి రోజు మీ గోల్స్ ఒక సరి చదవండి, విజువలైజ్ చేసుకోండి, అవి సాధిస్తే ఎలా అ ఫీల్ అవుతారో అలా ఫీల్ అవండి. మీ బుక్ లో ఆ గోల్స్ ఎందుకు సాధించాలో కుడా స్పష్టంగా రాయండి. కారణాలు ముందు వస్తాయి ఆ తర్వాతే మనిషి కారణాలకోసం పనిచేస్తాడు. ఈ లక్ష్యాలను మూడునెలలకి ఒక ముఖ్యమైన మైల్ స్టోన్ గా నిర్మించుకుంటే ఎక్కువ ఫలితాలు ఉంటాయి. అలాగే ప్రతి నెల ఏమి చేయాలో నిర్ణయించుకుని  నెలకి ఒక సారి గత నెలలో ఏమి చేద్దామనుకున్నాము, ఏమి సాధించాము, ఏమి నేర్చుకోవాలి, ఎలా ముందుకెళ్లాలి అని రివ్యూ చేసుకోవాలి.  
b.    ఒక రోజుని ముందు రాత్రి ప్లాన్ చేసుకోండి: మీ లక్ష్యాల దిశలో రేపు చేయాల్సిన పనులు లిస్టు ఈ రాత్రి పడుకునే ముందే రాసుకోండి. అందులో ముఖ్యమైన అంశాలు ముందు ప్రాధాన్యం ఇవ్వాలి, 100% ఆ పని అయ్యే వరకు దృష్టి పెట్టండి. చూడడానికి ఇదేదో “జ్వరం” అంటే “పారాసిటమాల్” అని చెప్పినట్లు సింపుల్ గా ఉంది కానీ ప్రాక్టీసు చేస్తే ఇదే జీవితాన్ని ఫోకస్ తో నడిపే మంచి అలవాటు అని ఖచ్చితంగా గుర్తిస్తారు. 60 రోజులు ప్రాక్టీసు చేయండి లైఫ్ లో భాగామైపోతుంది. 
c.       ప్రతి ఉదయం ఒక పని పూర్తి చేయండి: ప్రతి ఉదయం నిద్ర లేవగానే ఒక పని మొదలుపెట్టి పూర్తి చేయండి. అల చేయడం వలన మీ రోజులో ఉన్న ఇతర ముఖ్య అంశాలు కూడా పూర్తి అయ్యేలా ప్రోత్సాహంగా ముందుకు వెళ్ళాలనే తపన మీలో వస్తుంది. మీరోజులో  ముఖ్యమైన పని మొదలుచేయండి , పూర్తిచేయండి, వేరే ఏ పని చేయకముందు ఈ పని చేయండి. ఇలా చేయటం ఒక అలవాటుగా మార్చుకోండి.
d.      మీ 12 నెలల లక్ష్యాలను చేర్చే నైపుణ్యాలు నేర్చుకోండి: కెరీర్ నిచ్చెన ఎక్కేటప్పుడు అందరు ఒకే పాయింట్ వద్ద మొదలు పెడతారు కానీ 10 సంవత్సరాల తర్వాత కొందరు ఇతరుల కంటే 20 – 50 % ఉన్నత స్థాయిలో ఉంటారు, సంపాదిస్తారు. ఎందుకంటే విజేతలు కెరీర్ నిచ్చెన లో పైకి వెళ్ళే అవసరాలకు తగిన నైపుణ్యాలు నేర్చుకుంటారు, ఒక్కొక్క అడుగు వేస్తూ ముందుకెళతారు. ఐ.సి.ఐ.సి.ఐ. బ్యాంకులో చందాకొచ్చర్, మైక్రోసాఫ్ట్ లో సత్యా నాదెళ్ళ ఒకప్పుడు ఉద్యోగులే,  వారితో పాటు ఎందరో ఆ కంపనీలలో జాయిన్ అయ్యి ఉండొచ్చు, ఎవరు కంపెనీ అవసరాలకు, ఇండస్ట్రీ అవసరాలకు తగిన నైపుణ్యాన్ని చూపిస్తారో వారికి పెద్ద పీత వేస్తారు. దానితో పాటు హోదా, దాబ్బు అవే వస్తాయి. 2016 లో బాగా డబ్బు కావాలంటే , గొప్ప విలువను అందించండి మీ ప్రోడక్ట్ లేదా సర్వీస్ ద్వారా. ఆ స్కిల్స్స్ నేర్చుకోండి.
e.       చిన్న పనులు – పెద్ద విజయాలు: ఐదు చిన్న చిన్న పనులు రోజూ చేసుకుంటూ వెళితే సంవత్సరానికి 1825 విజయాలు మీ జీవితంలో భాగమైపోతాయి. రోజు ఒక్క పేపర్ పై చేతివ్రాత ప్రాక్టీసు చేస్తే 6 నెలలలో అద్భుతమైన మార్పులు వస్తాయి, రోజుకి 4 ఇంగ్లీష్ పదాలు నేర్చుకుంటే 12 నెలలో 1460 కొత్త పదాలు వస్తాయి. ఈ విషయాలలో 50% సక్సెస్ అయినా ఎంతో మంచి ప్రయత్నమే కదా. అందుకే చిన్న పనులు పెద్ద విజయాలకు నాంది అని గుర్తించి కృషి చేయండి. ఇందుకు నిబద్దత, పట్టుదల, క్రమశిక్షణ మేలోనే ఉన్నాయి.
మీకు, మీ కుటుంబ సభ్యులకు , స్నేహితులకు  నూతన సంవత్సర శుభాకాంక్షలు :) 

*********** సైకాలజీ టుడే, జనవరి 2016 లో ప్రచురించిన  నా ఆర్టికల్ ************** 

No comments:

Post a Comment