Friday, 10 October 2014

Think big - Achieve Big : : ఉన్నతంగా ఆలోచించండి- గొప్పగా సాధించండి

చిన్నప్పటి కథలలో అనగనగా ఒక ఊరిలో పెద్ద, చెడ్డ రాక్షసుడు ఉండేవాడు....వంటి స్టొరీ లు వినటం వల్లనేమో చాలా మంది  పెద్ద స్థాయిలో ఒక దృఢమైన అడుగు వేయాలంటే భయపడతారు, పెద్ద సక్సెస్ సాధించాలంటే అది మనది కాదు అనుకుంటారు, బిగ్ అంటే బ్యాడ్  అన్నట్లు ఆలోచిస్తారు.  పెద్దగా అలోచించాలంటేనే చెడు చేసినట్లు కాదు, ఆర్డినరీ  వ్యక్తి ఎక్స్ ట్రా -  ఆర్డినరీ గా సాధించవచ్చా ? అసలు అలాంటిది ఉందా  అనే అంశాలను శాస్త్రీయంగా చర్చించడానికి ఈ ఆర్టికల్.

ప్రస్తుతం మనం లేముకాబట్టి, పెద్దది అనుకుంటున్నాం కాబట్టి పెద్ద స్థాయికి ఎదగాలనుకోవటం ఏ మాత్రం తప్పు కాదు. చిన్నప్పటి కథలోలా పెద్ద రాక్షసుడు ఉంటాడు , వాడు చెడ్డ వాడు అని చదువుకున్నంత మాత్రాన పెద్దవి అన్నీ చెడ్డవి కావు. పెద్ద స్థాయిలో అలోచించి మీరు కొన్ని నిర్ణయాలు, పనులు చేసి నప్పుడు చెడు అనుభవాలు ఎదురై ఉండొచ్చు. చెడు జరిగిన ఒక పెద్ద అంశం మీ జీవితంలో ఉంది ఉండవచ్చు. అలా అని బిగ్ అంటే బ్యాడ్ కాదు. పెద్ద సక్సెస్ గురించి, గొప్ప విషయాల గురించి మాట్లాడగానే ప్రజలు సాధారణంగా కష్టపడాలి, ఎంతో ప్రయాసతో కూడుకున్నది, సంక్లిష్టమైనది, ఒత్తిడి తో కూడుకున్నది అనే భావనకు లోనౌతారు. ఆ భావాలకు సంభందించిన ఇమేజెస్, మాటలు మైండ్ థియేటర్ లో చూస్తారు. ఆ విధంగా పెద్ద సక్సెస్ అన్నా, పెద్ద విషయాలు అన్నా ఇవే ఫీలింగ్స్ రిపీట్ చేయటం వలన ఒక ఒత్తిడికి, మానసిక అసౌకర్యానికి గురౌతారు. దీనిఫలితంగా ఆ ఆలోచనలు వచ్చినపుడు తమ మానసిక శక్తిని, సమయాన్ని, కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంబంధాలను, ఆరోగ్యాన్ని కోల్పోతేగాని అది సాధించాలేనేమో అనుకుంటారు. గొప్ప అంశాలు సాదిస్తామో లేదో అనే సందిగ్దంలో , కొత్త విధానాలను అందుకోగలమా అనే మీమాంసలో, కన్ఫ్యూజన్ లో ఉంటారు. దీనితోపాటు ఒకవేళ పెద్ద లక్ష్యాల దిశలో పనిచేసినా మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురవగానే మరోసారి దాని గురించిన ఆలోచన రాగానే తల గిర్రున తిరుగుతుంది. ఈ ఆలోచన చట్రం అలా కొనసాగితే ఓ కొత్త ఫోబియా (భ్రమలో) కనిపెట్టి మరీ కొనుక్కున్నట్లే. అదే పెద్ద ఫోబియాపెద్ద అంశాలంటే అనవసరంగా భయపడడం. ఎప్పుడైతే మనం పెద్ద అంటే చెడు అని, అనుసంధానం చేసి చూసామో మన ఆలోచనలు కుంచించుకుపోతాయి. అంతే కాక చిన్నగా ఆలోచించడం జీవితంలో భాగామైపోతుంది. ఇంకా ఊహించండి, చిన్నగా ఆలోచిస్తే పెద్ద సక్సెస్ ఎలా వీలౌతుంది?

మీ స్థాయికి సీలింగ్ లేదు:
ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి ఇంతే సాధించగలదని ఒక సీలింగ్ ఏమీ లేదు. ఏ శక్తి వచ్చి మనకెవరికీ “ఇదే  నీ స్థాయి”  అని మన సీలింగ్ పాయింట్ చెప్పలేదు. మరి అలాంటప్పుడు మీరు జీవితంలో ఏ స్థాయి కావాలి అని అంటే ఏమి సెలెక్ట్ చేసుకుంటారు? చిన్నదా? పెద్దదా? సమాధానం ఏంటో అందరికి తెలుసు పెద్దదే. ఎందుకంటే మనంతట మనమే మన ఎదుగుదలను అడ్డుకోవాలనుకోము. పెద్ద అంశాలు సాధించాలంటే కావలసిన సాధనా విధానాలు (strategies) మానసిక ప్రక్రియలు (Psychological processes) అర్థం చేసుకుంటే చాలు. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు పెద్దఅంశాలు ఎన్నుకునే వ్యక్తిగా అంగీకరించారో అప్పుడు పెద్ద అంటే మీరు ఇచ్చుకునే అర్థం మారిపోతుంది. అప్పుడు పెద్ద అంటే మిమ్మల్ని మీరు “ది బెస్ట్” గా స్వీకరించటం. ఎప్పుడైతే పెద్ద మీరు పెద్ద ఫలితాలు కోరుకున్నారో అప్పటివరకు మీ కంఫర్ట్ జోన్ ని పటాపంచలు చేస్తూ ధైర్యంతో కూడిన ఆలోచనలు వస్తాయి, మీ చాలెంజెస్ నుంచి మీరు అవకాశాలు చూడడం మొదలుపెడతారు. బిగ్ రిజల్ట్స్ నమ్మడం మొదలైతే మీరు మీలోని ప్రశ్నలకు సమాధానాలు ధైర్యంగా అడుగుతారు, మీ రోల్ మోడల్స్ ని త్వరగా కలుస్తారు, మీ లాంటి వ్యాపారులు మరొకరు ఉంటె వారి కంటే భిన్నంగా చేయటం ఎలా అని ఆలోచిస్తారు, భిన్నమైన మార్గాలలో ప్రయాణించదానికి ప్రయత్నిస్తారు.

పెద్ద ఆలోచనలతోనే గొప్ప ఫలితాలు:
ఈ ప్రపంచంలో మనుషులందరికీ అదే సమయం ఉంటుంది. కనీసం జీవిన్చాము అంటే జీవిత కాలం అనేది ఉంది. ఆ కాలంలో ఏమిచేస్తావు అనేది ఆ వ్యక్తి స్థాయిని నిర్ణయిస్తుంది. అంటే రోజు మొత్తంలో నువ్వు ఎంత గొప్పగా, ఎత్తుగా, ఉన్నతంగా అలోచిస్తావో ఆ స్థాయిలో ఫలితాలు వస్తాయన్న మాట. ఈ క్రింద ఇచ్చిన చిన్న గ్రాఫ్ ద్వారా దీనిని అర్ధం చేసుకోవచ్చు. 
అంటే నువ్వు ఎంత గొప్పగా ఆలోచిస్తావు అనేది రాకెట్ లాంచర్ లా పనిచేసి నిన్ను ఆ స్థాయికి చేర్చగలదన్నమాట . ఏ స్థాయి ఫలితం/ సక్సెస్ అయినా మీరు ఏమి చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎవరితో చేస్తున్నారు అనేదానిపై ఆధారపడి ఉంటుంది. అయితే మీకు చిన్న ఫలితాలను ఇచ్చే ఈ మూడు అంశాలు జీవితంలో భాగమై ఉంటే మీకు చిన్న ఫలితాలే వస్తాయి. ఆ కాంబినేషన్ స్థాయికి మించి భిన్నమైన స్థాయిలో ఫలితాలు రావాలంటే భిన్నమైన కాంబినేషన్ (ఏమి చేయాలి, ఎలా చేయాలి, ఎవరితో చేయాలి) కావాలి. ఇది సహజం. ఎంత పెద్దగా వీలైతే అంత పెద్దగా ఆలోచించండి. పెద్ద ఫలితాలు పొందాలంటే మీ ఆలోచనా స్థాయికి తగ్గట్లు భిన్నమైన కాంబినేషన్ మారాలి. అప్పుడు ఫలితాలు ఆటోమేటిక్ గా మారతాయి.
పెద్దగా ప్రశ్న అడగటం వింత అనుకోవచ్చు, ఆలోచించడం , సాధించడం క్లిష్టం అనిపించవచ్చు . అది కొత్తలో మొదలుపెట్టిన తొలిరోజుల్లో మాత్రమే. దూరాన ఉన్న కొండ మహా పెద్దగా ఉంటుంది కాని ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వెళుతుంటే ఇంకా పెద్దగా కనిపించిన ఆకొండ దగ్గరికెళ్ళి ప్రయాణం కొనసాగించి చూస్తే మీ పాదాల కింద మౌనంగా ఒదిగిపోతుంది. అక్కడినుంచి ప్రపంచం కుడా ప్రశాంతంగా అందంగా కనిపిస్తుంది. అదే కొండ, అదే మనిషి కాని పెద్ద ఆలోచన దిశలో ప్రయత్నించాక ఫలితాలు సంతృప్తిని ఇస్తాయి.

పెద్ద ప్రశ్న-పెద్ద ఆలోచన-పెద్ద ఫలితం :
అందుకే నేను ఎలా సక్సెస్ అవ్వాలి అని అనకండి, నేను 1000 మందికి అన్నం పెట్టేలా వ్యాపారాని ఎలా నిర్మించాలి అని అడగండి. నాకు సేల్ వస్తాడా రాదా అని సందేహించకండి, నేను ఈ నెలలో 30 ఎలా చేయాలి అని ఆలోచించండి. నేను సొంత ఇల్లు కట్టగాలనా అని సందేహించకండి, నేను 1000 గజాల స్థలంలో గార్డెన్ తో, స్విమ్మింగ్ పూల్ తో, నాకు ఇష్టమైన అభిరుచితో ఇల్లు ఎలా నిర్మించుకోవాలి దానికి నేనేం చేయాలని ఆలోచించండి ఆ విధంగా ప్రయత్నించండి. ఈ పెద్ద ప్రశ్నలకు పెద్ద సమాధానాలు, మీ లూనుంచి ఒక అంతర్వాణి కొన్ని సమాధానాలు సూచనలు చేస్తుంది. మీ అంతర్వాణి (శరీరం, మనసు చెప్తున్న ) సిగ్నల్స్ ని గమనించండి. పెద్ద ప్రశ్నలు, పెద్ద ఆలోచనలు దిశలో పెద్ద పనులు చేయండి. మీరు అలా సాధిస్తే ఎలా ఉంటారో ఆలోచించుకోండి. అయినా అనుమానాలు ఉంటె ఆల్రెడీ సాధించిన వారిని కలిసి మాట్లాడండి. వారిని గమనించండి, వారి అనుభవంలోంచి నేర్చుకోండి. భయపడకండి. భయాలు పక్కింటి తాళాలవంటివి. మీ ఇంటి తాళం తీయాలంటే మీరు ధైర్యం అనే తాళం చెవి వాడాలి. పక్కింటి తాళం వంటి భయాన్ని కాదు.

చిన్నగా ఆలోచించడం అనేది మీ జీవితానికి ఒక పరిధిని నిర్మించేలా , మీ ఎదుగుదలకు అద్దంకిలా మరేలా చేస్తుంది. దానికి ఆ అవకాశం ఇవ్వకండి. ఈ సృష్టిలో అద్భుతాలన్నీ ఎలా సృష్టించాబద్దయో మీరు అలాగే సృష్టించ బడ్డారు. అందుకే జీవితాన్ని సంపూర్ణంగా , ఫుల్ల్ గా జీవించండి. పెద్దగా ఆలోచించండి. పెద్ద గోల్స్ పెట్టుకోండి. పెద్ద అంటే గొప్ప, ఉన్నతమైన రాబోయే తరాలు మార్గదర్శకంగా నిలిచేలా, ప్రపంచంలో మీ ముద్రని ఉన్నతంగా వేసేలా. అందుకే మీరు ఏ స్థాయిలో ఊహల్లో సాధించాగాలరో ఆ స్థాయికి మించి ప్రయత్నాలు చేసి పెద్ద ఫలితాలు సృష్టించండి. పెద్దగా ఆలోచించండి, పెద్దగా జీవించండి. థింక్ బిగ్, లివ్ బిగ్. బెస్ట్ విషెస్. 
మీకు, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు దీపావళి శుభాకాంక్షలు J   
******
                        "సైకాలజీ టుడే" మాస పత్రికలో  నేను రాస్తున్న  న్యూ లైఫ్ కాలమ్ లో అక్టోబర్ 2014 కోసం  ప్రచురింపబడిన ఆర్టికల్